Ashes 2023: దిగ్గజాల రికార్డులకు బ్రేకులు.. లార్డ్స్‌లో దుమ్మురేపిన స్మిత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌..

Steve Smith Records: లార్డ్స్‌లో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై 31 పరుగులు చేసిన వెంటనే స్మిత్ తొమ్మిది వేల టెస్టు పరుగులు పూర్తి చేశాడు.

Ashes 2023: దిగ్గజాల రికార్డులకు బ్రేకులు.. లార్డ్స్‌లో దుమ్మురేపిన స్మిత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌..
Steve Smith Records
Follow us
Venkata Chari

|

Updated on: Jun 29, 2023 | 12:13 PM

Steve Smith: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్‌లో మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. లార్డ్స్‌లో జరుగుతోన్న యాషెస్ సిరీస్‌లోని రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై 31 పరుగులు చేసిన వెంటనే, స్మిత్ తొమ్మిది వేల టెస్టు పరుగులను పూర్తి చేశాడు. కెరీర్‌లో 99వ టెస్టు మ్యాచ్‌లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన స్టీవ్ స్మిత్.. అతి తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇంతకు ముందు 101 టెస్టు మ్యాచ్‌ల్లో 9000 పరుగులు పూర్తి చేసిన వెస్టిండీస్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా పేరిట ఈ రికార్డు ఉంది.

ఇప్పుడు, 34 ఏళ్ల స్టీవ్ స్మిత్ తన 99వ టెస్టులో 174వ ఇన్నింగ్స్‌లో తొమ్మిది వేల పరుగులతో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర, భారత దిగ్గజ జోడీ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌లను అధిగమించాడు.

కుమార సంగక్కర టెస్టుల్లో 9000 పరుగులు పూర్తి చేసేందుకు 172 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 111 టెస్టుల్లో 9000 పరుగులు పూర్తి చేశాడు. అలాగే, ప్రస్తుత టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ 104 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

అతనితో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 177 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేశాడు. ఇప్పుడు 99 టెస్టు మ్యాచ్‌ల్లో 9000 పరుగులతో ఈ లెజెండ్‌ను స్టీవ్ స్మిత్ అధిగమించాడు.

అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగులు పూర్తి చేశాడు. అత్యంత వేగంగా 15 వేల పరుగులు చేసిన 7వ ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 333 ఇన్నింగ్స్‌ల్లో 15 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. ఆమ్లా రెండో స్థానంలో ఉన్నాడు. అతను 336 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. వివ్ రిచర్డ్స్ 344 ఇన్నింగ్స్‌లలో ఈ స్థానాన్ని సాధించాడు. హేడెన్ 347, విలియమ్సన్ 348 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు. 350 ఇన్నింగ్స్‌ల తర్వాత జో రూట్ ఈ రికార్డు సృష్టించాడు. కాగా, స్టీవ్ స్మిత్ 351 ఇన్నింగ్స్‌ల్లో 15 వేల పరుగులు పూర్తి చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 15,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..

విరాట్ కోహ్లీ – 333 ఇన్నింగ్స్‌లు

హషీమ్ ఆమ్లా – 336 ఇన్నింగ్స్‌లు

వివ్ రిచర్డ్స్ – 344 ఇన్నింగ్స్‌లు

మాథ్యూ హేడెన్ – 347 ఇన్నింగ్స్‌లు

కేన్ విలియమ్సన్ – 348 ఇన్నింగ్స్‌లు

జో రూట్ – 350 ఇన్నింగ్స్‌లు

స్టీవ్ స్మిత్ – 351* ఇన్నింగ్స్‌లు

మ్యాచ్ గురించి మాట్లాడితే..

యాషెస్ సిరీస్ 2023లో రెండో టెస్టు మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. స్మిత్ 85 పరుగులు, అలెక్స్ క్యారీ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..