TNPL 2025: ఇదేందయ్యా అశ్విన్.. బాల్ ట్యాంపరింగ్‌తో ఇలా అడ్డంగా బుక్కయ్యావేంది?
Tamil Nadu Premier League 2025: తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల సమయంలో రాత్రిపూట మంచు సమస్యను అధిగమించడానికి, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అందించిన తువ్వాలను ఉపయోగించి బంతిని ఆరబెట్టాల్సి ఉంటుంది. ఇది అంపైర్ ముందే చేయాలి. అయితే, అశ్విన్ టీం ఇందులో విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tamil Nadu Premier League 2025: రవిచంద్రన్ అశ్విన్ బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2025లో మధురై పాంథర్స్ జట్టు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని ఆరోపించింది. జూన్ 14న జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ జట్టు దిండిగల్ డ్రాగన్స్ ఇలా చేశారని ఆరోపించింది. ఈ విషయంలో TNPLకి అధికారిక ఫిర్యాదు అందింది. ఆ తర్వాత, లీగ్ నిర్వాహకులు మధురై నుంచి ఆధారాలు కోరింది. జూన్ 14న జరిగిన మ్యాచ్‌లో దిండిగల్ తొమ్మిది వికెట్ల తేడాతో మధురైని ఓడించింది. ఈ మ్యాచ్‌కు ముందు వర్షం పడింది. ముందుగా ఆడుతున్నప్పుడు మధురై ఎనిమిది వికెట్లకు 150 పరుగులు చేసింది. దిండిగల్ కేవలం 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అశ్విన్ ఓపెనర్‌గా 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
దిండిగల్ ఆటగాళ్లు రసాయనాలతో తువ్వాలు ఉపయోగించి బంతిని దెబ్బతీశారని మధురై దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీనివల్ల బంతి బరువుగా మారింది. అది బ్యాట్‌ను తాకినప్పుడు లోహాన్ని తాకినట్లుగా శబ్దం వచ్చింది. దీని గురించి TNPL CEO ప్రసన్న కన్నన్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, ప్రత్యర్థి ఆటగాళ్లు ఫిర్యాదు దాఖలు చేశారు. దానిని మేం అంగీకరించాం. మ్యాచ్ జరిగిన 24 గంటల్లోపు వారు ఫిర్యాదు చేశారు. మేం దానిని అంగీకరించాం. ఆరోపణలకు సంబంధించి ఆధారాలు అందించమని వారిని కోరాం. ఈ ఆరోపణలలో నిజం ఉంటే, మేం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తాం. తగినంత ఆధారాలు లేకుండా ఒక ఆటగాడు, ఫ్రాంచైజీపై ఆరోపణలు చేయడం తప్పు. వారు ఎటువంటి ఆధారాలు అందించకపోతే, మధురై శిక్షను ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపారు.
అంపైర్లకు నో ఇష్యూ..
TNPL మ్యాచ్‌ల సమయంలో రాత్రిపూట మంచు సమస్యను అధిగమించడానికి, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అందించిన తువ్వాలను ఉపయోగించి బంతిని ఆరబెట్టాలి. ఇది అంపైర్ ముందు చేయాలి. TNPL అందించిన తువ్వాలతో మాత్రమే వారు బంతిని తుడవాలని కన్నన్ అన్నారు. సిక్స్ కొట్టినప్పుడల్లా లేదా వికెట్ పడినప్పుడు లేదా ఓవర్ల మధ్య విరామం ఉన్నప్పుడు, అంపైర్లు నిరంతరం బంతిని తనిఖీ చేస్తుంటారు. మ్యాచ్ సమయంలో బంతితో వారికి ఎటువంటి సమస్య కనిపించలేదు.
మధురై ఫ్రాంచైజీ తరపున, COO S మహేష్ ఫిర్యాదు పంపారు. దిండిగల్ డ్రాగన్స్‌తో జరిగిన మా ఇటీవలి మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ జరిగినట్లు తీవ్రమైన సంఘటన జరిగిందని అందులో ఉంది. పదే పదే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, దిండిగల్ జట్టు రసాయనాలతో పూసిన తువ్వాలతో బంతిని బహిరంగంగా పాడుచేసిందంటూ ఆరోపణలు గుప్పించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




