AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Sharma : అభిషేక్ శర్మ సిక్సర్ల విధ్వంసం.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్‌టైమ్ రికార్డ్

Abhishek Sharma : ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షం కురిపిస్తూ అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఎవిన్ లూయిస్ రికార్డును అధిగమించి క్రికెట్ చరిత్రలో కొత్త మైలురాయిని నెలకొల్పాడు.

Abhishek Sharma : అభిషేక్ శర్మ సిక్సర్ల విధ్వంసం.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్‌టైమ్ రికార్డ్
Abhishek Sharma
Rakesh
|

Updated on: Jul 02, 2026 | 6:27 AM

Share

Abhishek Sharma : భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో చేస్టర్-లే-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న ఏకైక బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లోని ఎందరో దిగ్గజ హిట్టర్లను వెనక్కి నెట్టి, ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

కేవలం 4 బంతుల తేడాతో నయా హిస్టరీ

ఈ అద్భుతమైన రికార్డు అంతకుముందు వెస్టిండీస్ పవర్‌ఫుల్ హిట్టర్ ఎవిన్ లూయిస్ పేరిట ఉండేది. లూయిస్ 789 బంతుల్లో 100 అంతర్జాతీయ టీ20 సిక్సర్లు పూర్తి చేయగా.. అభిషేక్ శర్మ కేవలం 785 బంతుల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. కేవలం 4 బంతుల స్వల్ప తేడాతో ఎవిన్ లూయిస్‌ను వెనక్కి నెట్టి అభిషేక్ వరల్డ్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ జాబితాలో భారత సరికొత్త టీ20 కెప్టెన్, మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. సూర్యకుమార్ 100 సిక్సర్లు కొట్టడానికి 1007 బంతులు తీసుకోగా, ప్రస్తుతం ఆయన ఈ గ్లోబల్ లిస్ట్‌లో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు కొట్టిన టాప్-6 బ్యాటర్లు (బంతుల పరంగా):

అభిషేక్ శర్మ (భారత్) – 785 బంతులు

ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్) – 789 బంతులు

ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) – 871 బంతులు

ట్యామ్ డేవిడ్ (ఆస్ట్రేలియా) – 931 బంతులు

కాలిన్ మున్రో (న్యూజిలాండ్) – 963 బంతులు

సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 1007 బంతులు

ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లను నలుమూలలా బాదుతూ కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అవుట్ అయ్యే సమయానికి కేవలం 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 6 ఫోర్లు, 4 భారీ సిక్సర్ల సహాయంతో 59 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్ చేరాడు. అతని స్ట్రైక్ రేట్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 245 పైగా నమోదు కావడం విశేషం.

ఐర్లాండ్ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ..

ఇటీవల జరిగిన ఐర్లాండ్ పర్యటనలో మొదటి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 20 బంతుల్లో 49 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో సున్నా పరుగులకే వెనుదిరిగాడు. ఐర్లాండ్‎తో జరిగిన ఆ 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో ఘోరంగా నష్టపోయింది. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే ఐర్లాండ్ చేతిలో ఒక సిరీస్ ఓడిపోవడం అదే తొలిసారి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో జరిగిన ఆ అవమానకర పరాజయం తర్వాత, ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక సిరీస్‌ను ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us