AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 27 సెంచరీలతో మెరిసినా.. కనికరించని టీమిండియా సెలెక్టర్లు.. ఎవరంటే?

Abhimanyu Easwaran: దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన కొందరు ప్లేయర్లు.. టీమిండియా చోటు దక్కించుకున్నారు. కానీ, కొంతమంది ప్లేయర్లు మాత్రం ఇప్పటికీ చోటు దక్కించుకోలేకపోతున్నారు. అలాంటి బ్యాడ్‌లక్ ప్లేయర్లలో అభిమన్యు ఈశ్వరన్ కూడా చేరాడు. దేశవాళీలో సెంచరీలతో సత్తా చాటుతున్నా.. భారత జట్టులో మాత్రం చోటు పొందలేకపోతున్నాడు.

Team India: 27 సెంచరీలతో మెరిసినా.. కనికరించని టీమిండియా సెలెక్టర్లు.. ఎవరంటే?
Abhimanyu Easwaran
Venkata Chari
|

Updated on: Oct 16, 2024 | 3:15 PM

Share

Abhimanyu Easwaran: ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అంతకుముందు, బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడగా, ఆస్ట్రేలియా పర్యటన నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఐదు టెస్టులు జరగనున్నాయి. అంతకుముందు, దేశవాళీ క్రికెట్‌లో మెరిసిన కొందరు స్టార్లు 2024 సంవత్సరంలో భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. కానీ ఒక ఆటగాడు మాత్రం అవకాశం పొందలేకపోయాడు. ఆయన పేరే అభిమన్యు ఈశ్వరన్. గత ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు సాధించాడు. ఈ సమయంలో అతని స్కోర్లు 200, 191, 157 నాటౌట్, 127 నాటౌట్, 116 పరుగులు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 27 సెంచరీలు సాధించాడు. కానీ భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

2021లో ఇంగ్లండ్ పర్యటనలో అభిమన్యును టెస్ట్ జట్టులో చేర్చారు. కానీ, ఆడే అవకాశం రాలేదు. అప్పటి నుంచి భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. బెంగాల్‌కు ఆడుతూ రంజీ ట్రోఫీలో నిరంతరం పరుగులు చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎంపిక కాకపోవడంతో మౌనం వీడాడు. దేశం కోసం ఆడి గెలవాలనే కల ఉందని ఈశ్వరన్ చెప్పుకొచ్చాడు. కానీ, ఎంపిక నా నియంత్రణలో లేదు. కాబట్టి, దానిపై ఎక్కువ ఆలోచనలు చేయకూడదు. నావంతు ప్రయత్నాలు నేను చూస్తూనే ఉంటాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందేనంటూ తెలిపాడు.

టీమిండియాలో ఎంపిక కాకపోవడంపై ఈశ్వరన్ ఏమన్నాడంటే?

ఈశ్వరన్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, ‘ఈ గేమ్‌ను ఎంతో ఇష్టపడ్డాను. నన్ను ఎంపిక చేసినా చేయకపోయినా, ఈ ఆటపై నాకు ఎప్పటికీ ప్రేమ తగ్గదు. నేను ఆడేటప్పుడు ఆనందించాలనుకుంటున్నాను. భారత జట్టుకు ఎంపిక కాలేదనే విషయం గుర్తుకు వస్తుంది. కానీ, మంచి వ్యక్తులు నా చుట్టూ ఉండటం నా అదృష్టం. నా కుటుంబం, నా స్నేహితులు, నా కోచ్‌లు. నాకు క్లారిటీ రానప్పుడల్లా వారితో మాట్లాడి నా సందేహాలను తీర్చుకుంటాను’ అంటూ ఆవేదన చెందాడు.

న్యూజిలాండ్‌ సిరీస్‌కు భారత జట్టును సెలక్టర్లు ఇటీవలే ప్రకటించగా అందులో అభిమన్యు పేరు లేదు. దీని గురించి అడిగినప్పుడు, ‘నేను ఇప్పుడు రంజీ ట్రోఫీ ఆడాలని స్పష్టంగా ఉన్నాను. కాబట్టి నేను ప్రిపరేషన్‌కి వెళ్లాను. నేను ఎంపిక కాలేదు. అందుకు భిన్నంగా ఏమీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నేను అవకాశం పొందడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు.

అభిమన్యుకి ఐపీఎల్ ఆడాలనే కోరిక..

దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన భారత ఆటగాళ్లలో అభిమన్యు ఒకడు. కానీ, ఐపీఎల్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే ఈ బ్యాట్స్‌మెన్ ఈ టోర్నీలో ఆడాలని కోరుకుంటున్నాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఆటకు మరింత పదును పెట్టుకోవచ్చూ అంటూ తన కోరికను బయటపెట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..