AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Cricket: ఇదేందయ్యా ఇది! 3 బంతుల్లో 4 వికెట్లు.. పాకిస్తాన్ క్రికెట్‌లో రేర్ మూమెంట్!

ప్రెసిడెంట్స్ ట్రోఫీ ఫైనల్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ బ్యాటర్ సౌద్ షకీల్ టైమ్ అవుట్ కావడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇదే సమయంలో మొహమ్మద్ షాజాద్ 3 బంతుల్లో 4 వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

Pakistan Cricket: ఇదేందయ్యా ఇది! 3 బంతుల్లో 4 వికెట్లు.. పాకిస్తాన్ క్రికెట్‌లో రేర్ మూమెంట్!
Pakistan Cricket Board
Narsimha
|

Updated on: Mar 07, 2025 | 5:45 PM

Share

రావల్పిండిలో జరిగిన ప్రెసిడెంట్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్- పాకిస్తాన్ టెలివిజన్ (PTV) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ సౌద్ షకీల్ టైమ్ అవుట్ కావడం పెద్ద వివాదానికి దారితీసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో టైమ్ అవుట్ అయిన మొదటి పాకిస్తాన్ బ్యాటర్ గా ప్రపంచంలో ఏడవ క్రికెటర్ గా సౌద్ నిలిచాడు. టెస్ట్ జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్న సౌద్ షకీల్, రెండు బంతుల్లో రెండు వికెట్లు పడిపోవడంతో, డ్రెస్సింగ్ రూమ్‌ నుంచి ఆలస్యంగా గ్రౌండ్‌లోకి రావడంతో అతనికి టైమ్ అవుట్ ఇచ్చారు. బ్యాటింగ్‌కు రావాల్సిన మూడు నిమిషాల లోపల గరిష్ట సమయాన్ని అతను దాటి వెళ్ళినందున, PTV కెప్టెన్ అమద్ బట్ తెలివిగా అప్పీల్ చేశాడు.

అంపైర్లు అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకుని సౌద్ ఆలస్యంగా వచ్చాడని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో మొహమ్మద్ షాజాద్ అద్భుతమైన బౌలింగ్‌తో మూడు బంతుల్లో హ్యాట్రిక్ సాధించాడు. మొదట ఉమర్ అమీన్, ఆ తర్వాత ఫవాద్ ఆలం వరుస బంతుల్లో అవుట్ కాగా, సౌద్ టైమ్ అవుట్ అయ్యాడు. షాజాద్ తన హ్యాట్రిక్‌ని ఇర్ఫాన్ ఖాన్ మిడిల్ స్టంప్‌ను బోల్డ్ చేసి పూర్తిచేశాడు. మూడు బంతుల్లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ 128/1 నుంచి 128/5కి పడిపోయింది.

PTV జట్టు తరపున ఇమ్రాన్ బట్ 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, స్టేట్ బ్యాంక్ జట్టును 205 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ టోర్నమెంట్ మొత్తం రంజాన్ కారణంగా రాత్రి సమయంలో జరుగుతోంది. సాయంత్రం 7:30 నుండి తెల్లవారుజామున 2:30 వరకు మ్యాచ్‌లు నడుస్తున్నాయి.

ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓడిపోయిన అనంతరం సౌద్ పాకిస్తాన్ జట్టులో భాగంగా ఉన్నాడు. అయితే, ఈ టోర్నమెంట్ ముగిసిన వెంటనే PCB న్యూజిలాండ్ టూర్‌కు పాకిస్తాన్ వైట్-బాల్ జట్లను ప్రకటించింది. పాకిస్తాన్ వన్డే జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ టీ20 జట్టులో చోటు సంపాదించలేదు. ఆశ్చర్యకరంగా, సౌద్ షకీల్ కూడా రెండు ఫార్మాట్లలో ఎంపిక కాలేదు.

PCB కొత్తగా టీ20 జట్టుకు సల్మాన్ అలీ అఘాను కెప్టెన్‌గా, షాదాబ్ ఖాన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. మార్చి 16 నుంచి న్యూజిలాండ్ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి.

పాకిస్తాన్ జట్లు: వన్డేలు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావేద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్దిల్ షా, ముహమ్మద్ అలీ, ముహమ్మద్ వసీం జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్, తయ్యా షాహిర్, నసీమ్ షా.

టీ20లు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, హసన్ నవాజ్, జహందాద్ ఖాన్, ఖుష్దిల్ షా, ముహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, ముహమ్మద్ అలీ, ముహమ్మద్ హరీస్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ షాహెమ్, సుఫ్ యూసఫ్ ఖాన్.

పాకిస్తాన్ జట్టు కీలక ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం, ముఖ్యంగా బాబర్ అజామ్, సౌద్ షకీల్ వంటి ఆటగాళ్లకు దక్కని చోటు అభిమానుల్లో చర్చకు దారి తీసింది. వచ్చే మ్యాచ్‌ల్లో కొత్త ఆటగాళ్లు ఎలా రాణిస్తారో చూడాలి!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..