Asian Champions Trophy 2023: అదరగొట్టిన భారత్‌.. సెమీస్‌లో జపాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌లో మలేషియాతో అమీతుమీ

భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్‌గా అవతరించడానికి మరో అడుగు దూరంలో ఉంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌లో 5-0 తేడాతో జపాన్‌ను చిత్తు చేసి ఏకపక్షంగా భారత్ ఫైనల్‌కు చేరుకుంది. కొత్త కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ నేతృత్వంలోని భారత జట్టు టోర్నమెంట్‌ తుదిపోరుకు దూసుకెళ్లింది.

Asian Champions Trophy 2023: అదరగొట్టిన భారత్‌.. సెమీస్‌లో జపాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌లో మలేషియాతో అమీతుమీ
Indian Men's Hockey Team

Updated on: Aug 12, 2023 | 11:42 PM

భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్‌గా అవతరించడానికి మరో అడుగు దూరంలో ఉంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌లో 5-0 తేడాతో జపాన్‌ను చిత్తు చేసి ఏకపక్షంగా భారత్ ఫైనల్‌కు చేరుకుంది. కొత్త కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ నేతృత్వంలోని భారత జట్టు టోర్నమెంట్‌ తుదిపోరుకు దూసుకెళ్లింది. లీగ్‌లో జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-1తో డ్రాతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే ఈసారి భారత్ ధాటికి జపాన్ డిఫెన్స్ కకావికలమైంది. మ్యాచ్‌ ఆద్యంతం టీమ్ ఇండియాదే ఆధిపత్యం సాగడంతో జపాన్‌ చిత్తుగా ఓడింది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించిన మలేషియాతో భారత్ టైటిల్ కోసం పోటీపడనుంది. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ టోర్నమెంట్‌లోని రెండు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు ఆగస్టు 11 శుక్రవారం చెన్నైలో జరిగాయి. తొలి సెమీఫైనల్‌లో మలేషియా, దక్షిణ కొరియా జట్లు తలపడ్డాయి. గతంలో 2021లో జరిగిన చాంపియన్‌షిప్ టైటిల్‌ను కొరియా గెలుచుకుంది. అయితే ఈసారి ఈ జట్టు ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. గ్రూప్ దశలోనే 1-0తో మలేషియా చేతిలో ఓడిపోయింది. కానీ సెమీ-ఫైనల్స్‌లో దాని పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మలేషియా 6-2తో విజయం సాధించింది.

టీమిండియా గోల్స్‌ వర్షం..

కాగా టైటిల్ కోసం మలేషియాతో ఏ జట్టు తలపడుతుందనే ఆసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది. మూడుసార్లు ఆసియా ఛాంపియన్ భారత్ లేదా ప్రస్తుత ఆసియా క్రీడల ఛాంపియన్ జపానా? ఏది విజయం సాధిస్తుందని అందరూ సెమీస్‌ మ్యాచ్‌ కోసం వెయిట్‌ చేశారు. ఎన్నో అంచనాలతో ప్రారంభమైన మ్యాచ్‌లో ఇరు జట్లు కొన్ని అవకాశాలను సృష్టించుకున్నప్పటికీ విజయం సాధించలేదు. భారత జట్టు ఆరంభం నుంచి మరింత దూకుడుగా, ధాటిగా ఆడినా గోల్స్‌ సాధించలేకపోయింది. దీంతో ఇరుజట్ల స్కోరు 0-0గా మిగిలిపోయింది. అయితే రెండో క్వార్టర్‌ ఆరంభంలో ఆకాశ్‌దీప్‌ (19వ నిమిషం) భారత్‌ ఖాతా తెరిచాడు. ఇక్కడి నుంచి గోల్స్‌ వర్షం మొదలైంది. ఆ తర్వాత 11 నిమిషాల్లో భారత్ మరో రెండు గోల్స్‌ చేసింది. 23వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మరో ‘బుల్లెట్’ పెనాల్టీ కార్నర్‌తో జపాన్ డిఫెన్స్‌ను చీల్చగా, 30వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ భారత్ ఆధిక్యాన్ని 3-0కి పెంచాడు. ఇక్కడితోనే భారత్ విజయం దాదాపుగా ఖాయమైంది. 39వ నిమిషంలో సుమిత్, 51వ నిమిషంలో కార్తీ సెల్వం గోల్స్ చేయడంతో భారత్‌కు 5–0తో విజయాన్ని అందించారు. కాగా టీమ్ ఇండియా ఈ టోర్నమెంట్‌లో ఐదవసారి ఫైనల్‌కు చేరుకుంది. అలాగే స్టార్ గోల్‌కీపర్ PR శ్రీజేష్ 300వ అంతర్జాతీయ మ్యాచ్ వేడుకను కూడా చిరస్మరణీయం చేసింది. ఫైనల్లో మలేషియాతో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో కూడా ఇరు జట్లు తలపడగా భారత్ 5-0తో గెలిచింది.

ఇవి కూడా చదవండి

భారత్ జట్టు గోల్స్ వీడియోస్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..