Tirumala: తిరుమలలో దళారి అరెస్ట్.. సిఫార్స్ లేఖలతో టికెట్లు పొంది అధిక ధరకు అమ్ముతున్నట్లు గుర్తింపు
దళారుల చేతిలో తాము మోస పోయామని తరచుగా భక్తులు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. తాజాగా స్పెషల్ దర్శనం టికెట్లను అధిక ధరకు అమ్ముతున్న ఓ దళారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
తిరుమల తిరుపతి క్షేత్రంలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అనేక మంది భక్తులు కోరుకుంటారు. భక్తుల కోరికను ఆసరాగా చేసుకుని తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. భక్తుల దగ్గర నుంచి టికెట్స్, లడ్డులు, గదులు ఇలా రకరకాల సౌకర్యాల పేరు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు. దళారుల చేతిలో తాము మోస పోయామని తరచుగా భక్తులు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. తాజాగా స్పెషల్ దర్శనం టికెట్లను అధిక ధరకు అమ్ముతున్న ఓ దళారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..
తిరుమలలో దళారీని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి స్వామివారి స్పెషల్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12 రూ.300 దర్శన టికెట్లను.. రూ.32 వేలుకు విక్రయించాడు. దళారీ కరుణ కుమార్ గా .. కాణిపాకం ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నట్లు గుర్తించారు. కరుణ కుమార్ మోసంపై టీటీడీ విజిలెన్స్ కు కర్ణాటకకు చెందిన నవీన్ కేశవమూర్తి అనే భక్తుడు ఫిర్యాదు చేశాడు.
దళారి కరుణ కుమార్.. ఈ స్పెషల్ టికెట్లను కాణిపాకం ఆలయ ఏఈఓ మాధవరెడ్డి సిఫార్సు లేఖతో టికెట్లు పొందినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తాను తన కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్లాలని చెప్పి.. కాణిపాకం ఏఈఓ వద్ద సిఫార్సు లేఖ తీసుకున్నాడు. ఈ ఏఈఓ సిఫార్సు లేఖతో టికెట్లు పొంది భక్తులకు కరుణ కుమార్ అధిక ధరకు విక్రయించాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు తిరుమలలో దళారుల బెడద పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే స్వామివారి దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. దళారుల వలలో పడి మోసపోకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..