
హిందూ ధర్మం, వాస్తు శాస్త్రం ప్రకారం.. డబ్బును కేవలం ఒక వస్తువులా కాకుండా సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. మనం చేసే ఆర్థిక లావాదేవీలు ఏ సమయంలో చేస్తున్నాం అనే అంశం మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సరైన రోజున చేసే లావాదేవీలు ఐశ్వర్యాన్ని కలిగిస్తే.. అశుభ కాలంలో చేసే ఖర్చులు లేదా అప్పులు ఆర్థిక కష్టాలను తెచ్చిపెడతాయి. అందుకే వారంలో ఏ రోజు డబ్బు ఇవ్వాలి? ఏ రోజు తీసుకోకూడదు? అనే విషయాలను పక్కా తెలుసుకోవాలి.
ఆర్థిక పురోగతి కోసం వారంలో మూడు రోజులను అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు:
శుక్రవారం: ఈ రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున చేసే పెట్టుబడులు లేదా లావాదేవీలు దీర్ఘకాలిక లాభాలను, సుఖసంతోషాలను ఇస్తాయి.
సోమవారం: శివపార్వతుల అనుగ్రహం ఉండే రోజు కాబట్టి ఆర్థిక ప్రవాహం సాఫీగా సాగడానికి ఈ రోజు అనుకూలం.
గురువారం: బృహస్పతి అనుగ్రహంతో ఈ రోజు చేసే ఆర్థిక నిర్ణయాలు స్థిరమైన వృద్ధిని కలిగిస్తాయి.
వాస్తు ప్రకారం శనివారం ఆర్థిక లావాదేవీలకు అత్యంత అశుభకరమైన రోజు. ‘‘శనివారం ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయడం వల్ల ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని, అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని’’ వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. శని దేవుడి ప్రభావం వల్ల ఈ రోజు చేసే లావాదేవీలు ఆర్థిక అస్థిరతకు దారితీస్తాయి.
మంగళ గ్రహం శక్తి, సంఘర్షణకు ప్రతీక. అందుకే మంగళవారం చేసే లావాదేవీలు తరచుగా వివాదాలకు లేదా ఊహించని నష్టాలకు దారితీస్తాయి. ఈ రోజు ఎవరికైనా డబ్బు ఇస్తే అది అంత త్వరగా తిరిగి రాదని, ఇది మీ ఆర్థిక సమతుల్యతను దెబ్బతీస్తుందని శాస్త్రం చెబుతోంది.
కేవలం వారాలే కాకుండా తిథులు కూడా ముఖ్యమే. ముఖ్యంగా అమావాస్య రోజున ఎటువంటి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. ఈ రోజున చేసే లావాదేవీలు ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.
డబ్బు విషయంలో క్రమశిక్షణతో పాటు ఇలాంటి చిన్న చిన్న వాస్తు నియమాలను పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, ఐశ్వర్యాన్ని పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు.
(Note: ఇక్కడ అందించిన వివరాలు పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, పండితుల అభిప్రాయాల ఆధారంగా ఇవ్వబడినవి. భక్తులు తమ నమ్మకాన్ని బట్టి వీటిని అనుసరించవచ్చు..)