వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం తిరుమల వెళ్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలోని అంశాలేంటో తెలుసుకుందాం.. తిరుమల వైకుంఠ దర్శనానికి వెళ్లే బక్తులకు కొన్ని సూచనలు చేస్తోంది టీటీడీ. వైకుంఠ ఏకాదశి దర్శనం కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే కాదు. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. గతంలోలాగా పది రోజుల పాటు ఈ దర్శనం కల్పించనుంది టీటీడీ. ఈ పది రోజులకుగానూ తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు కేటాస్తారు.
జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి, 3వ తేదీన ద్వాదశితో కలుపుకుని జనవరి 11వ తేదీ వరకూ ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. అయితే ఈ దర్శనానికి టికెట్లు తప్పనిసరి చేశారు. టికెట్టు లేని వారికి దర్శన అనుమతి లేదు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రోజుకు 25 వేలు, సర్వదర్శనం టికెట్లు రోజుకు 50 వేలు కేటాయిస్తారు. ఈ పది రోజుల పాటు వైకుంఠ దర్శనం చేసుకోడానికి 5 లక్షల సర్వదర్శన టికెట్లు కేటాయించనున్నారు. సర్వదర్శన టికెట్ల కోసం తిరుపతిలో తొమ్మిది, తిరుమలలో ఒక్క కేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ టికెట్లకు సంబంధించి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది టీటీడీ. ఇక ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో అన్ని ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్లో రోజుకు రెండు వేలు కేటాయిస్తారు. ఈ టికెట్లు కలిగిన వారికి మహాలఘు దర్శనం కల్పిస్తారు. గోవింద మాలలు వేసుకునే భక్తులు కూడా టికెట్లు తీసుకునే రావాలి. వారికి ప్రత్యేక దర్శనాలుండవని చెబుతున్నారు టీటీడీ అధికారులు.
జనవరి 2వ తేదీన వేకువజాము 1.40 గంటల నుంచి వీఐపీ దర్శనం ఉంటుంది. ఉదయం 5 గంటలకు సామాన్య భక్తుల దర్శనానికి అనుమతినిస్తారు. జనవరి 2న వైకుంఠ ఏకాదశి నాడు బంగారు తేరు, 3వ తేదీన ద్వాదశి నాడు చక్రస్నానం నిర్వహిస్తారు. టికెట్లు పొందిన భక్తులు.. వారికి కేటాయించిన సమయానికి రావాలని సూచించింది టీటీడీ. జనవరి 2న కూడా రాజ్యాంగ హోదాలో వీఐపీలు స్వయంగా వస్తే వారికి మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. టికెట్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు కానీ దర్శనానికి అనుమతులుండవు.
శ్రీవారి ఆనంద నిలయం బంగారు తాపడం పనుల విషయానికి వస్తే.. ఆగమ సలహా మండలి సూచనల మేరకు ఫిబ్రవరి 23 నుంచి బాలాలయ నిర్మాణం చేస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఆరు నెలల్లో తాపడం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. ఈ సమయంలో కూడా శ్రీవారి దర్శనం కొనసాగుతుందని.. తాపడం కోసం భక్తులు సమర్పించిన బంగారాన్ని మాత్రమే వాడుతున్నామని అన్నారాయన. ఈ సమయంలో స్వామివారి దర్శనానికి 1957-58లో అనుసరించిన విధానమే అమలు చేస్తామన్నారు టీటీడీ ఈవో.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..