AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9000 Years Old Toli Tirupati: ఎవరు చూస్తే వారి ఎత్తులోనే కనిపించే శ్రీవిష్ణు ఆలయం తొలి తిరుపతి ఎక్కడో తెలుసా?

విష్ణువు రూపంలో చిద్విలాసంగా నవ్వుతు ఉండే వేంకటేశ్వరుడు విగ్రహం, ఆ విగ్రహం ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా...

9000 Years Old Toli Tirupati: ఎవరు చూస్తే వారి ఎత్తులోనే కనిపించే శ్రీవిష్ణు ఆలయం తొలి తిరుపతి ఎక్కడో తెలుసా?
Surya Kala
|

Updated on: Jan 06, 2021 | 5:04 PM

Share

9000 Years Old Toli Tirupati: తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల.. భక్తులు పెద్ద తిరుపతి చిన్న తిరుపతిగా పిలుచుకుంటూ శ్రీవారిని భక్తు శ్రద్దలతో కొలుస్తున్నారు. అయితే తిరుమల తిరుపతి కంటే.. ఇంకా చెప్పాలంటే పురాతణ క్షేత్రంగా భావిస్తున్న సింహాచలం కంటే అత్యంత పురాతణ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ప్రభుత్వాలు శ్రద్ధపెట్టని ఈ స్వయం భూ క్షేత్రం గురించి ఆలయ విశిష్టత గురించి అనేక కధనాలు ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం కు దగ్గరగా ఉన్నతిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. 6వేలఏళ్ళున్న తిరుమల కంటే 8 వేల ఏళ్ల చరిత్ర కలిగిన సింహాచలం కంటే అతి పురాతనమైన క్షేత్రం. ఇంకా చెప్పాలంటే.. దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైంది. పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా దివిలి సమీపంలో కొలువుదీరిన దేవాలయానికి 9000 చరిత్ర వుంది. విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందున ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు. స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి ఆలయంలోనూ ఆళ్వారులు కొలువుదీరి ఉంటారు. అదే రీతిలో ఇక్కడ గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.

మహా విష్ణు ఇక్కడ స్వయం భవుగా కొలువుదీరాడానికి ధ్రువుడు కారణం అంటూ స్థానికుల కథనం. ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా ఒకానొకప్పుడు కీకారణ్యం. ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవునికి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు పన్నుతున్న సమయంలో ధృవుని తల్లి సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పింది. అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట. అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విధానం అడగగా.. ఆ ముని, “నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి” స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేశాడని పూర్వీకుల కథనం

ఆ మహాముని చెప్పినట్లే “దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట” అయితే, ఆ కాంతిని చూడలేక ధృవుడు భయపడ్డాడట. అప్పుడు విష్ణుమూర్తి నాయనా! భయమెందుకు నేనూ నీ అంతే వున్నాను కదా అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట. ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట. స్వామి నీ అంతే వున్నాను కదా అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు అంటే స్వామి వారు చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా దర్శనమిస్తారు. ఆ అరణ్య ప్రాంతంలో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారని స్థానికులు తమ పూర్వికులు చెప్పారని అంటారు. స్వామి వారు ఒంటరిగా ఉంటున్నారని దేవేరి ఐన లక్ష్మీ దేవిని నారద మహర్షి ప్రతిష్టించారనే కథనం. వెంకన్న భక్తుడైన శ్రీ కృష్ణ దేవరాయల ఈ ఆలయాన్ని సందర్శించి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయ విశిష్టతను తెలుపుతూ నేటికీ అక్కడ శిలా శాసనాలు దర్శనమిస్తాయి.

శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే.. విష్ణువు రూపంలో చిద్విలాసంగా నవ్వుతు ఉండే వేంకటేశ్వరుడు విగ్రహం, ఆ విగ్రహం ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ, చక్రాల స్థానం మారి వుంటాయి. ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి. సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి లబిస్తుంది భక్తుల నమ్మకం. ఈ ప్రధాన ఆలయంలోని ఏకశిలా కళా ఖండాలు, విగ్రహమూర్తి, ఉత్సవ మూర్తి, ప్రదాన ఆకర్షణగా నిలుస్తాయి. శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు. ఇక ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయం ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నప్పటికీ యాత్రికులకి దర్శనానానికి, బసకి సరైన సదుపాయాలు లేవు అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎంతో ప్రాశస్యం కలిగిన ఈ ప్రాంతం అభివృద్ధిపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

Also Read: జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు, విగ్రహాలు ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడంపై విమర్శ