AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటిమిట్ట సీతారామ కల్యాణం: పౌర్ణమి నాడు ఎందుకు? మిస్టీరియస్ నిజం తెలుసుకోండి!

Ontimitta Sitarama Kalyanam: ఒంటిమిట్ట కోదండరామ ఆలయంలో సీతారాముల కల్యాణం శ్రీరామనవమికి బదులు చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వెన్నెల్లో జరుగుతుంది. జాంబవంతుడు ప్రతిష్టించిన ఏకశిలా విగ్రహాలు, గర్భగుడి బయట కొలువై ఉన్న సంజీవరాయుడు, పోతన భాగవతం అంకితం వంటి అనేక విశేషాలతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఈ అరుదైన ఆచారాల వెనుక ఉన్న పురాణ కథనాలను తెలుసుకుందాం.

ఒంటిమిట్ట సీతారామ కల్యాణం: పౌర్ణమి నాడు ఎందుకు? మిస్టీరియస్ నిజం తెలుసుకోండి!
Ontimitta Srirama Temple
Rajashekher G
|

Updated on: Mar 31, 2026 | 4:41 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంటిమిట్ట కోదండరామ ఆలయం అరుదైన విశిష్టతలతో కూడిన ఒక చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రం. సాధారణంగా శ్రీరామనవమి నాడు జరగాల్సిన సీతారాముల కళ్యాణం ఇక్కడ నవమి తర్వాత ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఆరుబయట వెన్నెల్లో, నిండు చంద్రుడు సాక్షిగా నిర్వహించడం అత్యంత ప్రధానమైన ప్రత్యేకత. విష్ణుమూర్తి లక్ష్మీదేవుల వివాహాన్ని పగటిపూట చూడలేకపోయిన ఆమె సోదరుడైన చంద్రుడు, రామావతారంలో తన కోరిక తీరుస్తానని విష్ణువు నుంచి వరమొందడమే ఈ ఆచారం వెనుక ఉన్న పురాణ గాథ.

ఒంటిమిట్ట అనే పేరు..

ఈ ప్రాంతం పూర్వం దండకారణ్యంగా పిలవబడేది. యజ్ఞాలు చేసుకుంటున్న మునులను రాక్షసుల నుండి కాపాడమని శరణు వేడినప్పుడు, రాముడు ఇక్కడ కొంతకాలం నివసించాడని ప్రతీతి. సీతాదేవి దప్పిక తీర్చడానికి రాముడు తన బాణంతో బుగ్గను రప్పించిన ప్రదేశాలే నేటి రామతీర్థం, లక్ష్మణతీర్థం. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు వడ్డె కుల సోదరులకు కలలో శ్రీరాముడు కనిపించి జ్ఞానోదయం కలిగించాడని, తదనంతరం వారు ఈ గర్భగుడిని నిర్మించారని, అందుకే ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని స్థానిక కథనం.

హనుమంతుడు లేని రామాలయం

ఆలయంలోని విగ్రహాలు ఏకశిలా నిర్మితాలు. వీటిని స్వయంగా జాంబవంతుడే ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు ఇతర రామాయణ ఆలయాల మాదిరిగా గర్భగుడిలో కాకుండా, ఆలయం వెలుపల సంజీవరాయుడిగా కొలువై ఉండటం మరో విలక్షణత. మేఘనాథుడి శరాఘాతానికి మూర్ఛపోయిన లక్ష్మణుడికి సంజీవని తెచ్చి ప్రాణదానం చేసినందుకు ప్రతీకగా ఆంజనేయుడిని సంజీవరాయుడిగా కొలుస్తారు. చోళులు, తదనంతరం విజయనగర రాజుల నిర్మాణ శైలిలో అద్భుత శిల్ప సౌందర్యంతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. తన భారతదేశ యాత్రలో ఒంటిమిట్టను సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్, ఇది భారతదేశపు అత్యుత్తమ కట్టడాలలో ఒకటిగా ప్రశంసించాడు. పోతనామాత్యునికి, ఇతర ప్రముఖులకు కేటాయించిన మాన్యం భూములకు సంబంధించిన ప్రాచీన శిలాశాసనాలు నేటికీ ఇక్కడ దర్శనమిస్తాయి.

క్షేత్ర ప్రాశస్త్యం..

చైత్ర మాసంలో శ్రీరామనవమికి ముందు రోజు నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. పోతన జయంతి, గరుడ సేవ, సంజీవరాయుని సేవ, చతుర్దశి నాడు కళ్యాణం, రథోత్సవం, చక్రస్నానం, ఏకాంత సేవ వంటివి ఈ ఉత్సవాల్లో ప్రధానమైనవి. పూజలన్నీ పాంచరాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారం జరుగుతాయి. ఇక్కడి స్వామివారు కులమతాలకు అతీతమైనవారని ప్రతీతి. మాల ఓబన్న చేత స్వామివారికి హారతి ఇప్పించడం, టిప్పు సుల్తాన్ ప్రతినిధి ఇమాం బేగ్ భక్తుల సౌకర్యార్థం ఒక బావిని తవ్వించడం దీనికి నిదర్శనాలు. భాగవతాన్ని రాయ సంకల్పించిన బమ్మెర పోతన ఒంటిమిట్ట కోదండరాముని తలచుకుంటూ, “పలికేడిది భాగవతమట పలికించేడి వాడు రాముడట” అంటూ తన కావ్యాన్ని ఈ క్షేత్రానికి అంకితం ఇవ్వడం దీని ప్రాశస్త్యాన్ని చాటుతుంది. ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఒంటిమిట్టలో సాయంత్రం కన్నులపండువగా సీతారాముల కళ్యాణం జరగనుంది. ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని విశ్వసించడం మీ వ్యక్తిగతం.)

Follow Us