- Telugu News Spiritual Srivari Salakatla Brahmotsavam 2024: Muthyapu Pandiri Vahana Seva held in tirumala tirupati, devotees flooded
Tirumala:సకలు శుభాలను ఇచ్చే ముత్యాల పందిరిలో శ్రీనివాసుడి దర్శనం.. బకాసుర వధ అలంకారంలో శ్రీవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో తిరుమల పుణ్యక్షేత్రంలో ఇసుక వేస్తె రాలనంత భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వివిధ రూపాల్లో వివిధ వివిధ వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చారు.
Updated on: Oct 07, 2024 | 7:07 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.

జ్యోతిషశాస్త్రం ప్రకారం ముత్యాలు చంద్రునికి ప్రతీకంగా నిలుస్తున్నాయి. అంతేకాదు మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు ముక్కుకు, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది.

ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా మలచిన ఆ ముత్యాల పందిరి నీడలో తన దేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో ఊరేగే స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి.

ముత్యపు పందిరి వాహనసేవలో వివిధ రాష్ట్రల నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత రీతిలో ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 20 కళాబృందాలు, 541 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు.

తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల విద్యార్థుల భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శన అబ్బురపరిచినది. శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, మచిలీపట్నం, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు చెందిన కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

తిరుపతికి చెందిన డా. మురళీ కృష్ణ బృందం ప్రదర్శించిన శ్రీకృష్ణావతారం రూపకం, బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ బృందం ప్రదర్శించిన దశావతార మహోత్సవం, విశాఖపట్నంకు చెందిన మర్రి లలితా బృందం ప్రదర్శించిన శ్రీ నరసింహోద్భవ ఘట్టం, మధ్యప్రదేశ్ రాష్టానికి చెందిన హర్సింగ్ వర్మ ప్రదర్శించిన గిరిజన జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి.

ఆంధ్ర రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పంజాబ్, కర్నాటక రాష్టాలకు చెందిన కళా బృందాలు ప్రదర్శించిన తీరు భక్తులకు నయనానందంతోపాటు మనోరంజకంగా సాగింది.

మణిపూర్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రలకు చెందిన జానపద సంప్రదాయ నృత్యాలు అలరించాయి.

చల్లని ముత్యాలకింద నిలిచిన భక్తుల పాలిట కలియుగ దైవం శ్రీనివాసుని దర్శనంతోనే మానవులకు తాపత్రయాలను పోగొట్టి.. జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుందని నమ్మకం.

ఈ ముత్యాల పందిరి వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో జె. శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.




