Janmashtami 2025: శ్రీ కృష్ణుడు కిరీటంలో నెమలి ఈకను ఎందుకు ధరిస్తాడు? ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే..
శ్రీ కృష్ణునికి ఇష్టమైన అలంకరణ వస్తువుల్లో నెమలి ఈక ఒకటి. నెమలి ఈక కన్నయ్యకు ఒక గుర్తింపు.. భక్తిలో అంతర్భాగం. శ్రీ కృష్ణ కిరీటంలో అలంకరించబడిన నెమలి ఈక కేవలం అలంకరణ మాత్రమే కాదు.. దీనికి సంబంధించిన మూడు అద్భుతమైన పౌరాణిక కథలు, ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. పురాణ గ్రంథాలలో నెమలి ఈక ప్రాముఖ్యత.. దానిని ఇంట్లో పెట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు కూడా వివరించాయి.

శ్రీకృష్ణుని కిరీటంలో అలంకరించబడిన నెమలి ఈక కేవలం ఆయన అందానికి ఒక ఆభరణం మాత్రమే కాదు. పురాణాలు, ఆధ్యాత్మిక రహస్యాలు, శాస్త్రీయ నమ్మకాలతో ముడిపడి ఉన్న చిహ్నం. భక్తి ప్రపంచంలో, కన్నయ్య వేణువు లేకుండా అసంపూర్ణమని.. వేణువు లేకుండా నెమలి ఈక అసంపూర్ణమని నమ్ముతారు. అయితే ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైంది? దీని వెనుక ఉన్న మూడు అద్భుతమైన కథలు ఏమిటి? అలాగే గ్రంథాలలో వివరించబడిన ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి అనేది తెలుసుకుందాం..
మొదటి కథ: రాహు దోషం.. తల్లి పరిహారం చిన్న కృష్ణుడు జన్మించినప్పుడు, కొన్ని రోజుల తర్వాత తల్లి యశోద కన్నయ్య జాతకాన్ని ఒక జ్యోతిష్కుడికి చూపించిందని చెబుతారు. జ్యోతిష్కుడు కన్నయ్యకు రాహు దోషం ఉందని చెప్పాడు. యశోద తల్లి ప్రేమతో తన కుమారుడి శ్రేయస్సు కోసం ఒక పరిష్కారాన్ని చూపించమని కోరింది. అప్పుడు నెమలి ఈక ఎల్లప్పుడూ అతనితోనే ఉంటే.. రాహు దోషం తోలగుతుందని చెప్పారు. దీంతో యశోద .. కన్నయ్య ధరించే కిరీటాన్ని నెమలి ఈకతో అలంకరించింది. నెమలి ఈక ఉన్న కిరీటాన్ని ధరించిన కృష్ణుడు చాలా అందంగా కనిపిస్తున్నాడని యశోద అనుకుంది. అప్పటి నుంచి నెమలి ఈక ఎల్లప్పుడూ కృష్ణుడు ధరించే కిరీటంలో ఒక భాగంగా మారింది.
రెండవ కథ: అలంకరణలో నెమలి ఈక మరొక కథలోతల్లి యశోద ప్రతిరోజూ కన్నయ్యని వివిధ ఆభరణాలతో అలంకరించేదని వర్ణించబడింది. ఒకరోజు ఆమె అతన్ని నెమలి ఈకతో అలంకరించింది. కన్నయ్య మనోహరమైన రూపాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఆ రోజు నుంచి నెమలి ఈక అతని కిరీటంలో శాశ్వత భాగంగా మారింది.
మూడవ కథ: నెమళ్ల బహుమతి మరొక పురాణ కథ ప్రకారం బాల కృష్ణుడు అడవిలో వేణువు వాయిస్తున్న సమయంలో అతని శ్రావ్యమైన స్వరం విని, నెమళ్ల గుంపు నృత్యం చేయడం ప్రారంభించింది. నృత్యం ముగిసిన తర్వాత.. నెమళ్ల నాయకుడు కృష్ణుడి పాదాల వద్ద అత్యంత అందమైన ఈకను సమర్పించాడు. కృష్ణుడు దానిని ప్రేమతో స్వీకరించి తన తలపై ఉన్న కిరీటంలో ధరించాడు.
నెమలి ఈక.. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత హిందూ మతంలో నెమలి ఈకను అదృష్టం, శాంతి, ప్రేమ, సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. గరుడ పురాణం, విష్ణు పురాణం విశ్వంలోని రంగులు నీలం, ఆకుపచ్చ, బంగారు రంగులు నెమలి ఈకపై నివసిస్తాయని వివరిస్తాయి. ఇవి విశ్వం సమతుల్యతను సూచిస్తాయి. భగవత పురాణంలో కృష్ణుడి అలంకరణలో నెమలి ఈక వర్ణన అతని లీలల మాధుర్యానికి, ప్రకృతితో అతని అవినాభావ సంబంధానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. నెమలి ఈకను “తమస్” అంటే ప్రతికూల శక్తిని నాశనం చేసేదిగా కూడా చెబుతారు. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల రాహు-కేతువు వంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
నేటికీ నెమలి ఈక లేని కృష్ణ భక్తి అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ కథలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా.. నేటికీ నెమలి ఈక లేకుండా శ్రీకృష్ణుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. నెమలి ఈక కేవలం అలంకారం కోసం మాత్రమే కాదని.. భగవంతుని లీలలు, ప్రేమ, రక్షణకు చిహ్నంగా భక్తులు నమ్ముతారు. అందుకే జన్మాష్టమి నుంచి రోజువారీ పూజ వరకు.. నెమలి ఈక కన్నయ్య గుర్తింపులో అంతర్భాగంగా ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








