Maha Shivaratri: శైవ క్షేత్రాల ఖిల్లా .. ఓరుగల్లు జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు.. సర్వం శివోహం
చాళక్యుల నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని విలక్షణమైనదిగా చెబుతారు. స్థానికులే కాదు.. ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి కూడా వేయిస్తంబాల గుడిని చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు.
‘స్వస్తి శివం కర్మాస్త్వితి’ అనగా కర్మములు శివునిచే కాపాడబడి భద్రంగా ఉంటాయని వేదం చెబుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీళ్లు శివలింగంపై పోస్తూ శివనామాన్ని జపిస్తే చాలు అఖల సంపదలను అనుగ్రహిస్తాడు. శివలింగానికి ఆద్యంతాలు లేనట్టే శివుని మహిమళకు కూడా అంతులేదు. కాకతీయుల వైభవానికి అద్దం పట్టే వేయిస్తంభాల ఆలయంలోని శివుడిని రుద్రేశ్వరస్వామిగా కొలుస్తుంటారు భక్తులు. వరంగల్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రధాన ఆలయాల్లో వెయ్యిస్తంభాల గుడి ఒకటి. ఇది 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవ నిర్మించారు. ప్రధానంగా శివుడికి అంకితం చేసిన ఈ ఆలయం శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం పేరుతో ప్రాచుర్యం పొందింది. ఈ దేవాలయాన్ని త్రికూటాలయంగానూ పిలుస్తుంటారు.
సాధారణంగానే ప్రతీరోజూ సందడి కనిపించే ఈ ఆలయం… మహాశివరాత్రి వచ్చిందంటే చాలు జాతరను తలపిస్తుంది. రుద్రేశ్వరాలయంలో నిత్యపూజలతో పాటు అభిషేకాలు, శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ టెంపుల్‌లో శివుడు, విష్ణువు, సూర్యదేవుళ్ల గర్భాలయాలున్నాయి. సాధారణంగా ఏదైనా ఆలయం ఉందంటే.. అందులో ప్రధాన దేవుడు ఒక్కడే ఉంటారు. కానీ ఈ వెయ్యిస్తంభాల ఆలయంలో మాత్రం ముగ్గురు దేవుళ్లుండడం విశేషం.
వేయిస్తంభాల ఆలయం కాకతీయ శిల్ప కళారీతికి అద్దంపట్టే అద్భుతమైన ఆలయం. కుడ్యాల మీద తీర్చిదిద్దిన శిల్పాలు దివ్యలోకంలో అడుగు పెట్టిన భావనను కలిగిస్తాయి. క్రీ.శ. 1163లో రుద్రదేవ మహారాజు కట్టించగా.. ఆయన పేరుతోనే ఈ ఆలయాన్ని రుద్రేశ్వరాలయం అని పిలుస్తుంటారు. దీనిలోని లింగాన్ని రుద్రేశ్వర లింగం అని వ్యవహరిస్తారు. నక్షత్రాకారంలో నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. స్తంభాలు ఒకదాని తరువాత ఒకటి వరుసలు దీరినట్లు చెక్కబడి కనిపిస్తాయి. శివరాత్రి పర్వదినంతో ఆలయ ఆవరణలో జాగరణకు వీలు కల్పించారు.
శివాలయం తూర్పు ముఖంగా ఉండగా ఇతర ఆలయాలు పశ్చిమ, దక్షిణాభిముఖంగా ఉంటాయి. నిర్మాణంలోని శిల్పకళా వైభవం కాకతీయ రాజ్య వారసత్వ సంస్కృతికి అద్దం పడుతుంది. చాళక్యుల నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని విలక్షణమైనదిగా చెబుతారు. స్థానికులే కాదు.. ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి కూడా వేయిస్తంబాల గుడిని చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..