AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagannath Temple Flag: ఎన్నో రహస్యాలకు నెలవు పూరీ జగన్నాథ ఆలయం.. రోజూ ఆలయ శిఖరంపై జెండా ఎందుకు మారుస్తారో తెలుసా..

ఇటీవల వైరల్ అయిన వీడియోలో జగన్నాథ పూరి జెండాను మోస్తూ ఒక గద్ద ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. ఈ సంఘటన భక్తులను, ఆలయ నిర్వాహకులను ఆశ్చర్యపరిచింది. కొంతమంది దీనిని చెడు శకునంగా భావిస్తున్నారు. మరికొందరు దీనిని సాధారణ సంఘటనగా చూస్తున్నారు. అయితే ఈ సంఘటన జగన్నాథుని ఆలయంలో పురాతన సంప్రదాయంతో ముడిపడి ఉన్న రహస్యాన్ని, ఉత్సుకతను మరింత పెంచింది. పూరి జగన్నాథ ఆలయం ఎన్నో రహస్యాలను, సంప్రదాయాలను దాచుకుంది. అటువంటి సంప్రదాయంలో ఒకటి ఆలయ శిఖరమపై ప్రతిరోజూ జెండాను మార్చే సంప్రదాయం. ఈ రోజు ఈ జెండా మార్చే సంప్రదాయం గురించి తెలుసుకుందాం..

Jagannath Temple Flag: ఎన్నో రహస్యాలకు నెలవు పూరీ జగన్నాథ ఆలయం.. రోజూ ఆలయ శిఖరంపై జెండా ఎందుకు మారుస్తారో తెలుసా..
Jagannath Temple Flag
Follow us
Surya Kala

|

Updated on: Apr 16, 2025 | 7:05 AM

ఒడిశాలోని పూరి నగరంలో ఉన్న ఒక ముఖ్యమైన హిందూ దేవాలయం జగన్నాథ పూరి ఆలయం. ఈ ఆలయం జగన్నాథుడికి అంకితం చేయబడింది. ఇక్కడ కృష్ణుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలకు ప్రతి రూపంగా భావిస్తారు. ఇది భారతదేశంలోని నాలుగు ధామ్ తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటి. ఈ క్షేత్రానికి హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో గంగా రాజవంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడగంగ దేవ ప్రారంభించగా.. 13వ శతాబ్దంలో అనంగభీమ దేవ III పూర్తి చేశాడు. ఆలయ గర్భగుడిలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర చెక్కతో చేసిన విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఈ విగ్రహాలను నబకలేబారా అని పిలిచే కొత్త విగ్రహాలతో భర్తీ చేస్తారు. ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలికి చాలా అందమైన ఉదాహరణ, వక్ర శిఖరాలు, క్లిష్టమైన శిల్పాలతో ఈ ఆలయ సముదాయం చుట్టూ సింగద్వారం, హస్తి ద్వారం, అశ్వ ద్వారం, వ్యాఘ్ర ద్వారం అనే నాలుగు ప్రధాన ద్వారాలతో కూడిన పెద్ద సరిహద్దు గోడ ఉంది.

రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

జగన్నాథ పూరి ఆలయం వైష్ణవ భక్తులకు ఒక ప్రధాన యాత్రా స్థలం. జగన్నాథుడు ‘లోక ప్రభువు’ అని నమ్ముతారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీనిలో ముగ్గురు దేవతలను భారీ రథాలలో కూర్చోబెట్టి గుండిచా ఆలయానికి తీసుకువెళతారు. ఆలయంలో తయారుచేసిన మహాప్రసాదానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని వేలాది మంది భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ ఆలయ వంటగది ప్రపంచంలోని అతిపెద్ద ఆలయ వంటశాలలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయానికి సంబంధించి అనేక రహస్యాలు ఉన్నాయి. వాటిలో ఆలయం పైభాగంలో ఉంచిన జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగిరిపోతుంది. ఆలయం నీడ రోజులో ఏ సమయంలోనూ కనిపించదు. అందువల్ల జగన్నాథ పూరి ఆలయం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు.. ఇది భారతదేశ గొప్ప సాంస్కృతిక , చారిత్రక వారసత్వాన్ని కూడా సూచిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి వస్తారు.

జెండా మార్పుకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజూ ధ్వజాన్ని (జెండా) మార్చే సంప్రదాయానికి లోతైన మతపరమైన, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ సంప్రదాయం సుమారు 800 సంవత్సరాలుగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన అనేక నమ్మకాలు, రహస్యాలు ఉన్నాయి. జగన్నాథ ఆలయం పైభాగంలో ఉన్న 20 అడుగుల పొడవైన త్రిభుజాకార జెండాను ప్రతిరోజూ మారుస్తారు. ఈ పనిని ‘చోళ’ కుటుంబం చేస్తుంది. వారు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఒకసారి జగన్నాథుడు ఒక భక్తుడి కలలో కనిపించి.. తన జెండా పాతబడిపోయి చిరిగిపోయిందని చెప్పాడని చెబుతారు. మర్నాడు ఆలయ పూజారులు చూసినప్పుడు జెండా నిజంగా చిరిగి పోయి కనిపించింది. అప్పటి నుండి ప్రతిరోజూ ఆలయ శిఖరంపై కొత్త జెండాను ఎగురవేయడం అనే సంప్రదాయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ అత్యంత భక్తితో, నిర్వహిస్తారు

ఇవి కూడా చదవండి

శిఖరంపై జెండా దేనికి చిహ్నం అంటే

జెండాను జగన్నాథుని ఉనికి , శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ జెండా సముద్రం నుంచి వీచే గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. ఇదే ఒక రహస్యం.. శాస్త్రీయ దృక్కోణంలో ఇది ఏరోడైనమిక్ ప్రభావం వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు. ఇక్కడ ఆలయ నిర్మాణం కారణంగా గాలి దిశ మారుతుంది.

జెండాను మార్చడం ఒక సాహసకార్యం

ఆలయ శిఖరంపై జెండాను మార్చే ప్రక్రియ చాలా సాహసోపేతమైనది. నైపుణ్యంతో కూడుకున్నది. సేవకులు ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండానే 214 అడుగుల ఎత్తైన ఆలయం శిఖరాన్ని ఎక్కి పాత జెండాను తీసి కొత్త జెండాను ప్రతిష్టిస్తారు. ఈ పని ప్రతిరోజూ జరుగుతుంది. జెండాను మార్చే ఈ సంప్రదాయం హిందువుల విశ్వాసానికి చిహ్నం మాత్రమే కాదు.. ఇది జగన్నాథుడి పట్ల భక్తి, అంకితభావానికి కూడా చిహ్నం. ఈ సంప్రదాయం ఆలయ దైవత్వాన్ని, దాని గొప్పదనాన్ని ప్రతిబింబిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.