Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amuktamalyada: భోగాలు కేవలం భౌతిక సంపదలు.. వాటిని ఉచితంగా కాకుండా కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాని తెలిపే కథ

Moral Story in Amuktamalyada: శ్రీకృష్ణ దేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం కావ్యం "ఆముక్తమాల్యద". దీనిని "విష్ణుచిత్తీయం" అని కూడా పిలుస్తారు. ఆముక్తమాల్యద తెలుగు..

Amuktamalyada: భోగాలు కేవలం భౌతిక సంపదలు.. వాటిని ఉచితంగా కాకుండా కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాని తెలిపే కథ
Amuktamalyada
Follow us
Surya Kala

|

Updated on: Oct 17, 2021 | 3:42 PM

Moral Story in Amuktamalyada: శ్రీకృష్ణ దేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం కావ్యం “ఆముక్తమాల్యద”. దీనిని “విష్ణుచిత్తీయం” అని కూడా పిలుస్తారు. ఆముక్తమాల్యద తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలులో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం.. ఆ కావ్యానికి హృదయం వంటిదని ఖ్యాతిగాంచింది. ఇందుకు కారణం ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానంలోని కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, ఉచితంగా ఇస్తే తీసుకుంటే చోటు చేసుకునే ఫలితం.. ఇలా అనేక విశేషాలను తెలియజేస్తాయి. ఈ ఖండిక్య లోని రాజు కర్తవ్యం ఏమిటి.. ఉచితంగా ఏదీ ఎందుకు తీసుకోరాదో తెలియజేసే ఒక కథను ఈరోజు తెలుసుకుందాం..

పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు. ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.

తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. అయితే రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు.. తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.

ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు.

సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో ఈ కథే ఉదాహరణ. ఇలాంటి కథలను నేటి తరానికి అందించాలని.. అప్పుడు బాల్యం ధార్మిక పథంలోకి నడుస్తుందని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయని అది ఇచ్చిన మన సాహిత్యం గొప్పదనం గుర్తించి భావితరాలకు అందించాలని కోరుకుంటున్నారు.

Also Read:  దామోదరం సంజీవయ్య సీఎంగా ఉంది రెండేళ్లే.. ఎన్నో అభివృద్ధి పనులు ఆయన చలవేనన్న జనసేనాని