Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రామంలోని దేవుళ్లకు బీరు, సారాయి నైవేద్యం.. భక్తులకు తీర్ధం కూడా అదే..

లింగాపూర్ గ్రామానికి చెందిన కనకరయ్య, కెలవాడి గ్రామానికి చెందిన రంగనాథం ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరికీ సారాయి అందించడం ఇక్కడి ఆచారం. ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి తర్వాత ఆలయంలో జాతర జరుగుతుంది. ఈ జాతరకు వచ్చే భక్తులు తమ కోర్కెలు తీర్చమంటూ దేవుడికి మద్యం సమర్పించి తీర్థం పుచ్చుకోవడం విశేషం.

ఆ గ్రామంలోని దేవుళ్లకు బీరు, సారాయి నైవేద్యం.. భక్తులకు తీర్ధం కూడా అదే..
Liquor Naivedya Offering To God
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2024 | 12:16 PM

సాధారణంగా ఆలయంలో భక్తులకు కొబ్బరినీళ్లను లేదా పంచామృతన్ని తీర్థంగా, వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రసాదంగా అందజేస్తారు. అయితే దేవుడికి నైవేద్యంగా బీరుని సమర్పించడం, భక్తులకు తీర్థంగా ఇవ్వడం ఎప్పుడైనా చూశారా ? కర్ణాటక లోని కొన్ని ప్రాంతాల్లోని దేవుళ్లకు మద్యం నైవేద్యంగా పెట్టే ఆచారం ఉంది. బాగల్‌కోట్ జిల్లా గులేడగుడ్డ లోని లింగాపూర్ గ్రామంలో కనకరాయ దేవుడు నైవేద్యంగా మద్యం సమర్పిస్తారు.

గుడి ముందు కొంతమంది వరసగా దుకాణాలు పెట్టి సారాయి విక్రయిస్తారు. ఎందుకంటే ఈ ఆలయానికి  వచ్చే భక్తులు కనకరాయ స్వామికి సారాయి, వివిధ బ్రాండ్ల మద్యాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత తీర్థంగా భక్తులకు అందజేస్తారు. దీంతో పాటు ఐదు రకాల పప్పులను ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

లింగాపూర్ గ్రామానికి చెందిన కనకరయ్య, కెలవాడి గ్రామానికి చెందిన రంగనాథం ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరికీ సారాయి అందించడం ఇక్కడి ఆచారం. ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి తర్వాత ఆలయంలో జాతర జరుగుతుంది. ఈ జాతరకు వచ్చే భక్తులు తమ కోర్కెలు తీర్చమంటూ దేవుడికి మద్యం సమర్పించి తీర్థం పుచ్చుకోవడం విశేషం.

ఇవి కూడా చదవండి

సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన కనకరాయ, లక్ష్మీ రంగనాథ ఆలయ జాతరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మాత్రమే కాదు రాష్ట్రం వెలుపల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చుకోవడానికి వీలుగా మద్యం సీసా సమర్పించి పూజ చేయడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం.

జాతర మొదటి రోజున ఒకరోజు ముందుగా కనకరాయుడికి సారాయి నైవేద్యాన్ని సమర్పిస్తారు. కనకరాయ స్వామికి భక్తులు భారీ మొత్తంలో దేశీయ సారాయి సమర్పిస్తారు. కొందరు భక్తులు నైవేద్యాలు సమర్పించి తింటారు. ఈ సంప్రదాయం పూర్వ కాలం నుంచి కొనసాగుతోందని ఆలయ పూజారి చెప్పారు.

దేవుడికి బీరు లేదా సారాయిని నైవేద్యంగా సమర్పిస్తారని ప్రజలు చెబుతున్నప్పటికీ.. భక్తులు మాత్రం తీర్థం అని పిలుస్తారు. తాము కోరిన కోర్కె నెరవేరితే దేవుడికి ఇంత మద్యం, ఇన్ని బీరు ప్యాకెట్లు అందజేస్తామని మొక్కు కుంటారు. ఆ ప్రకారం జాతర సమయానికి వచ్చి బీరు, సారాయి సమర్పించి తీర్థంగా తీసుకుంటారు. సాధారణంగా అన్ని నైవేద్యాలతో పాటు బీరుని నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో తమకు మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే జాతర వచ్చిందంటే గర్భాలయమైన సాకు ఆలయ ఆవరణలో ఎక్కడ చూసినా సారాయి సీసాలతో నిండిపోతుంది.

శతాబ్దాలుగా సాగుతున్న ఆచారం

ఈ ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. గతంలో ఈ ప్రాంతంలో కరువు ఏర్పడి తాగునీరు లేక ప్రజలు నానా అవస్థలు పడుతుండటమే ఇందుకు కారణం. అప్పుడు మానవరూపం ధరించి వచ్చిన లక్ష్మీరంగనాథుడు పండ్ల రసంలో నీరు పోసి ఆ పండ్ల రసాన్ని ఇచ్చి ప్రజల దాహార్తిని తీర్చాడు. దేవుడు మనకు పండ్ల రసాన్ని అంటే సోమరసాన్ని ఇచ్చాడని తరువాత ప్రజలు గ్రహించారు.

అప్పటి నుంచి లక్ష్మీరంగనాథుడు, సోదరుడు కనకరాయలకు పండ్ల రసానికి బదులుగా సారాయి నైవేద్యాన్ని సమర్పించడం ప్రారంభించారని భక్తుల నమ్మకం. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు రొట్టెలు, అన్నం తెచ్చి అందరు కలిసి ప్రసాదంగా తింటారు. అందరినీ పిలిచి భోజనం పెడతారు. ఆశీర్వాదం తీసుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు