Karthika Masam: శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీక లక్షదీపోత్సవం.. పుష్కరిణికి దశ హరతులు.. పోటెత్తిన భక్తులు
శ్రీశైలం క్షేత్రం కార్తీక శోభను సంతరించుకుంది. కార్తీక మాసంలోని మొదటి సోమవారం మల్లన్నను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాస లక్షదీపోత్సవం కన్నులపండువగా సాగినది. స్వామి పుష్కరిణి హరతి కార్యక్రమంలో అర్చకులు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ శైలం. ప్రముఖ శైవ పుణ్య క్షేత్రం శ్రీ గిరి క్షేత్రంలో కార్తీకమాసం సందడి నెలకొంది. కార్తీక మొదటి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, దశ హారతులిచ్చారు. కార్తికమాస మొదటి సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది. మల్లన్న పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేశారు. అర్చకులు వేదపండితులు దీపోత్సవ సంకల్పాన్ని పఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఉత్సవ మూర్తులకు, పుష్కరిణికి శాస్త్రోక్తంగా దశ హరతులిచ్చి భక్తులను దీవించారు, దశ హారతులను దర్శించుకునేందుకు పుష్కరిణి వద్ద భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీశైల మల్లన్న క్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఈ లక్షదీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దంపతులు, ఆలయ అధికారులు, భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..