Puri Jagannath Temple: జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే నిజంగానే పుణ్యం పోతుందా?
Jagannath Temple 22 Steps: పూరీ జగన్నాథ ఆలయంలోని 22 మెట్లలో మూడో మెట్టును 'యమశిల'గా ఎందుకు పిలుస్తారు? ఈ మెట్టుపై భక్తులు అడుగు పెట్టడానికి ఎందుకు భయపడతారు? యమధర్మరాజుతో ముడిపడిన పురాణ కథ, 22 మెట్ల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, స్థానిక విశ్వాసాల వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలను తెలుసుకోండి.

Puri Jagannath Temple: ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయం ఎన్నో ఆశ్చర్యకరమైన విశేషాలకు ప్రసిద్ధి. ఆలయ శిఖరంపై ఎగిరే జెండా గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడటం, ఆలయ గోపురంపై పక్షులు ఎగరవని విశ్వాసం, మహాప్రసాదానికి సంబంధించిన ప్రత్యేకతలు.. ఇలా ఎన్నో కథనాలు భక్తులను ఆకర్షిస్తుంటాయి. అయితే వీటన్నింటికంటే ఎక్కువగా చర్చకు వచ్చే అంశం ఆలయంలోని 22 మెట్లలో మూడో మెట్టు. దీనిని స్థానికులు ‘యమశిల’ అని పిలుస్తారు. పురాణ కథనాలు, స్థానిక విశ్వాసాల ప్రకారం ఈ మూడో మెట్టుకు ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. చాలామంది భక్తులు ఈ మెట్టుపై నేరుగా అడుగు పెట్టకుండా జాగ్రత్తపడతారు. ఒకవేళ పొరపాటున అడుగు పడితే వెంటనే చేతులు జోడించి జగన్నాథ స్వామిని క్షమాపణ కోరుతూ నమస్కరిస్తారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది.
యమశిల వెనుక ఉన్న పురాణ కథ
పురాణాల ప్రకారం, కలియుగంలో జగన్నాథ స్వామిని దర్శించుకోవడం ద్వారా భక్తుల పాపాలు తొలగిపోతుండటంతో, మృత్యుదేవుడైన యమధర్మరాజు ఆందోళన చెందాడట. దీంతో ఆయన జగన్నాథ స్వామిని ఆశ్రయించి, కర్మ-ఫలితాల సమతుల్యత దెబ్బతింటోందని వివరించాడని చెబుతారు. అప్పుడు జగన్నాథుడు యమధర్మరాజుకు ఆలయంలోని మూడో మెట్టుపై స్థానం కల్పించాడని, అప్పటి నుంచి ఆ మెట్టును ‘యమశిల’గా పిలవడం ప్రారంభమైందని స్థానిక విశ్వాసం. అందుకే దర్శనం అనంతరం ఆ మెట్టుపై అడుగు పెడితే సంపాదించిన పుణ్యంలో కొంత తగ్గుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది.
22 మెట్ల ఆధ్యాత్మిక ప్రాధాన్యం
జగన్నాథ ఆలయంలోని ఈ 22 మెట్లను ‘బైసీ పహాచా’ అని పిలుస్తారు. ప్రతి మెట్టుకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉందని చెబుతారు. మనిషి భగవంతుడిని చేరుకునే ముందు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం వంటి అంతర్గత దుర్గుణాలను అధిగమించాల్సిన అవసరాన్ని ఈ మెట్లు సూచిస్తాయని విశ్వసిస్తారు. మరికొన్ని ఆధ్యాత్మిక భావనల ప్రకారం, ఈ 22 మెట్లు పంచభూతాలు, ఇంద్రియాలు, ప్రాణశక్తి, చైతన్యం, ఆత్మజ్ఞానం వంటి వివిధ స్థాయిలకు ప్రతీకలు. అందువల్ల ప్రతి మెట్టు భక్తుడి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశగా భావిస్తారు.
ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం
యమశిలపై ఉన్న నమ్మకాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇవి ప్రధానంగా పురాణ కథనాలు, స్థానిక సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలపై ఆధారపడినవే. కాబట్టి పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించే భక్తులు అక్కడి ఆచారాలను గౌరవించడం, ఆలయ సంప్రదాయాలను పాటించడం ఉత్తమంగా భావిస్తారు. యమశిలకు సంబంధించిన విశ్వాసాన్ని కూడా అదే భక్తిశ్రద్ధతో చూస్తారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




