Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే న్యూస్. నగరంలో మరో రెండు భారీ స్టీల్ ఫ్లైఓవర్లు.. ఈ ఏరియాలోనే..
హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరం నడిబొడ్డులో మరో రెండు స్టీల్ ఫ్లైఓవర్లు రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. బంజారాహిల్స్ ప్రాంతంలో వీటి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నిధుల సర్దుబాటు కూడా చేసింది. త్వరలోనే వీటి నిర్మాణం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. నగరంలో మరో రెండు స్టీల్ ఫ్లైఓవర్లు, ఒక అండర్ పాస్ రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వీటి నిర్మాణానికి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీవీ9 సిగ్నల్ వల్ల ఒక స్టీల్ ఫ్లైఓవర్ రానుండగా.. బంజారాహిల్స్ ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వద్ద మరో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. దాదాపు రూ.368 కోట్లతో ఈ ఫ్లైఓవర్లను నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. అలాగే ఒక అండర్ పాస్ కూడా ఇక్కడ నిర్మించున్నారు. దీని వల్ల పంజాగుట్ట, శ్రీనగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పంజాగుట్ట నుంచి టీవీ9, బంజారాహిల్స్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణంలో సిగ్నల్ ఫ్రీ జర్నీ చేయవచ్చు.
రెండు స్టీల్ ఫ్లైఓవర్లు, ఒక అండర్ పాస్
ప్రభుత్వం ఈ రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్ పాస్‌కు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ఇక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు పంపగా.. వీటికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3, జీవీకే మాల్ వైపు రెండు లైన్లతో వన్ వే స్టీల్ ఫ్లైఓవర్ ఉంటుంది. దీని నిర్మాణానికి రూ.147 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇక టీవీ9 జంక్షన్ నుంచి ముగ్ద జంక్షన్ మీదుగా ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వరకు 3 లైన్లతో ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఇందుకోసం రూ.62 కోట్ల వ్యయం కానుంది. ఇక ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ వైపు రెండు లైన్ల అండర్ పాస్ రూ.159 కోట్లతో నిర్మించాలని సమగ్ర రిపోర్ట్ తయారుచేశారు.
ట్రాఫిక్‌పై అధ్యయనం
గతంలో ప్రతిపాదించిన రిపోర్ట్ ప్రకారం ఒక ఫ్లైఓవర్, ఒక అండర్ పాస్ మాత్రమే నిర్మించాలని భావించారు. కానీ ట్రాఫిక్ రద్దీపై అధ్యయనం చేసిన తర్వాత రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్ పాస్ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ప్రాజెక్ట్ వ్యయం రూ.210 కోట్ల నుంచి రూ.368 కోట్లకు పెరిగింది. హెచ్ సిటీ ప్రాజెక్ట్ కింద ఈ ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. స్ట్రక్చరల్ స్టీల్ టెక్నాలజీతో ఈ రెండు ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. దీని వల్ల నిర్మాణం కాలం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. బంజారాహిల్స్ కారిడార్‌గా దీనిని అధికారిక పత్రాల్లో దీనిని పేర్కొన్నారు.
