Lashkar Bonalu: ఘనంగా ప్రారంభమైన లష్కర్‌ బోనాలు.. తొలిబోనం సమర్పించిన మంత్రి పొన్నం

అమ్మలగన్నమ్మ.. భక్తుల కొంగుబంగారం… ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. లష్కర్ బోనాలు... భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకొచ్చాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారు జామునుంచి లష్కర్‌ బోనాలు ప్రారంభమయ్యాయి.

Lashkar Bonalu: ఘనంగా ప్రారంభమైన లష్కర్‌ బోనాలు.. తొలిబోనం సమర్పించిన మంత్రి పొన్నం
Lashkar Bonalu
Follow us

|

Updated on: Jul 21, 2024 | 7:49 AM

అమ్మలగన్నమ్మ.. భక్తుల కొంగుబంగారం… ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. లష్కర్ బోనాలు… భాగ్యనగరానికి కొత్త శోభను తీసుకొచ్చాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారు జామునుంచి లష్కర్‌ బోనాలు ప్రారంభమయ్యాయి. తలంటు స్నానం చేసి. వ్రతం ఆచరించి, భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించి మొక్కు తీర్చుకుంటున్నారు భక్తులు. . మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు తొలి బోనం సమర్పించారు.

బోనాలతో లష్కర్‌ శోభాయమానంగా వెలుగొందుతోంది. సికింద్రాబాద్‌ వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తోంది. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతరకు తెలంగాణాలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. 21వ తేదీ నాడు బోనాలు ఆదివారం అమ్మవారు బోనాలు ప్రారంభమయ్యాయి. 22వ తేదీ సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉజ్జయినీ మహాకాళి దర్శనానికి తరలివచ్చిన జనంతో ఆలయ పరిసరాలు కళకళలాడుతున్నాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపులతో.. ఆదివారం లష్కర్‌ బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పలు మార్గాల్లో ఆలయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం, వీఐపీల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతల పాస్‌ల కోసం ప్రత్యేకంగా మరో క్యూ లైన్‌ను ఏర్పాటు చేశారు.

భాగ్యనగరంలో ప్రత్యేక సంస్కృతికి ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అమ్మవారి దయవల్ల వర్షాలు సమృద్ధిగా పడి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. బోనాల జాతరకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు హైదరాబాద్ నగర ప్రజలు వారికి ఆతిథ్యం ఇచ్చి అమ్మవారి దర్శనం కలిగేలా చూస్తామన్నారు. ప్రజల సహకారంతోనే బోనాల జాతరను విజయవంతం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

వీడియో…

ఇంటి ఇల్లాలు తలంటు స్నానం చేసి, వ్రతం ఆచరిస్తారు. భక్తి శ్రద్ధలతో చక్కెర పొంగలి, బెల్లపు అన్నం, పసుపు అన్నం వండి.. కొత్త మట్టి కుండల్లో ఉంచుతారు. సున్నం, జాజు, పసుపు, కుంకుమలను రుద్ది.. వేపాకులతో అలంకరించి.. దాని మీద దీపం వెలిగిస్తారు. ఇలా బోనాన్ని తలమీద పెట్టుకుని.. డప్పుచప్పుల్ల మధ్య ఆలయానికి తరలివస్తున్నారు. అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

భక్తులు భారీ ఎత్తున హాజరవుతుండటంతో పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూంను.. పోలీస్ కమాండ్‌ కంట్రోల్‌ రూంకి అనుసంధానం చేసి సీసీ కెమెరాల నిఘా పెంచారు. దాదాపు 5లక్షల మంది బోనాలు సమర్పిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.