AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రపు నీరు ఉప్పగా ఎలా మారింది? ఆ నీటిలో తీపి తీసేసింది ఎవరో తెలుసా?

సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆ నీరు ఒకప్పుడు తియ్యగా ఉందని.. ఆ తర్వాతే ఉప్పగా మారిందనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. హిందూ పురాణాల ప్రకారం సముద్రడికి పార్వతీమాత ఇచ్చిన శాపం కారణంగానే సముద్రపు నీరు ఉప్పగా మారింది. సముద్రుడు మహా శివుడిని నిందించడం, పార్వతీదేవిని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవాలని అనుకోవడమే ఇందుకు కారణం.

సముద్రపు నీరు ఉప్పగా ఎలా మారింది? ఆ నీటిలో తీపి తీసేసింది ఎవరో తెలుసా?
Sea Water
Rajashekher G
|

Updated on: Jan 02, 2026 | 11:05 AM

Share

సనాతన ధర్మంలోని గ్రంథాలు, పురాణాలు అనేక సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను, సమాధానాలు చెబుతుంటాయి. మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన, ఆహ్లాదకరమైన విషయాలను అందిస్తుంటాయి. ఇవన్నీ మత విశ్వాసాలపై ఆధారపడినప్పటికీ.. చాలా మంది వాస్తవాలుగానే పరిగణిస్తారు. అలాంటి ఆసక్తికర విషయమే ఇప్పుడు తెలుసుకుంది. సముద్రం నీరు ఉప్పగా ఎందుకు ఉంటుంది. ఆ నీటిలోని తీపిని తీసేసింది ఎవరు? అనే విషయంపై శివపురాణం స్పష్టతనిస్తోంది. శాపం కారణంగానే సముద్రం నీరు ఉప్పగా మారిందని చెబుతోంది.

శివపురాణం ఏం చెబుతోంది?

హిమవంతుని కుమార్తె అయిన పార్వతిదేవి శివుడిని తన భర్తగా పొందేందుకు కఠోరమైన తపస్సు ప్రారంభించింది. సముద్ర తీరంలో ఈ కఠినమైన తపస్సు చేసింది. ఆమె తీవ్రమైన భక్తి మూడు లోకాలలోనూ ప్రకంపనలు సృష్టించింది. అయితే, సన్యాస దుస్తుల్లో ఉన్న ఆమె రూపాన్ని చూసిన సముద్రుడు ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత పార్వతీ దేవి ముందు ప్రత్యక్షమై తనను వివాహం చేసుకోవాలని కోరాడు.

సముద్రుడి వివాహ ప్రతిపాదనను తిరస్కరించిన పార్వతి

అయితే, సముద్రడిని వివాహ ప్రతిపాదనను పార్వతీదేవి ప్రశాంతంగా, గౌరవంగా తిరస్కరించింది. తన హృదయం, జీవితం మహా దేవుడు (శివుడు)కి మాత్రమే అంకితం చేసినట్లు సముద్రుడికి పార్వతీదేవి చెబుతుంది. ఆమె అప్పటికే శివుడ్ని వివాహం చేసుకుంటానని ప్రతిజ్జ చేసింది. పార్వతీదేవి ఆ మహా దేవుడిని ప్రశంసించడం విని సముద్రుడి అహం దెబ్బతింది. దీంతో ఆగ్రహంతో శివుడి గురించి చెడుగా, తక్కువ చేసి మాట్లాడటం ప్రారంభిస్తాడు.

శివుడిని అవమానించిన సముద్రుడు

శివుడు కేవలం బూడిద ధరించిన సన్యాసి అని సముద్రుడు అవమానిస్తాడు. ఆ తర్వాత సముద్రుడు తనను తాను ప్రశంసించుకుంటాడు. తాను సద్గుణాలతో నిండి ఉన్నానని. విశాలమైనవాడినని, మొత్తం ప్రపంచ దాహాన్ని తీరుస్తానని చెబుతాడు. ఆ గిరిజన సమాజాన్ని వీడి తనను వివాహం చేసుకుని సముద్ర రాణిగా కావాలని పార్వతీదేవిని సముద్రుడు కోరతాడు. ఇక, తనకు కాబోయే భర్తను అవమానించడాన్ని తట్టుకోలేని పార్వతీదేవి.. సముద్రుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

సముద్రుడికి పార్వతీ మాత శాపం

సముద్రుడిని గర్వాన్ని అణిచివేయాలని నిర్ణయించుకున్న పార్వతీ మాత.. అతడ్ని శపిస్తుంది. ‘సముద్ర నీటి తీపి, ఉపయోగం పట్ల నీకున్న గర్వం ఈరోజు నశిస్తుంది. నీ నీరు మానవులకు పనికిరానిదిగా మారుతుంది’ అని పార్వతీదేవి గర్జిస్తూ ప్రకటిస్తుంది. ‘ఈరోజు నుంచి నీ నీరు ఉప్పగా మారుతుంది. ఏ మానవుడు కూడా దాహం తీర్చుకోవడానికి నీ నీటిలో ఒక్క చుక్క కూడా తాగడు’ అని పార్వతీ మాత.. సముద్రుడిని శపిస్తుంది. ఇక నాటి నుంచి సముద్రం నీరు ఉప్పగా మారిపోయిందని విశ్వసిస్తారు.

Note: వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.