తలంటు స్నానం: ఏ రోజున చేయాలి? ఏ రోజున చేయకూడదో తెలుసా? ఫలితాలు కూడా తెలుసుకోండి
హిందూ సంప్రదాయాల ప్రకారం తలంటు స్నానం చేయడానికి కొన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. సరైన రోజుల్లో చేస్తే శుభఫలితాలు లభిస్తాయని, చేయకూడని రోజుల్లో చేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, స్త్రీ, పురుషులకు, వివామైన వారికి ఈ నిబంధనలు కొంత వేరుగా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయాల ప్రకారం తలంటు స్నానం చేయడానికి కొన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. సాధారణంగా పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లోనే చాలా మంది తలంటు స్నానం చేస్తుంటారు. తలంటు స్నానం కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు.. హిందూ సంప్రదాయాల ప్రకారం ఇది మన ఆరోగ్యం, మనసు, అదృష్టంపై ప్రభావం చూపుతుంది.
అందుకే తలంటు స్నానం చేయడానికి కొన్ని రోజులు శుభంగా, కొన్ని రోజులు అశుభంగా భావిస్తారు. మరి ఏ రోజున చేయాలి? ఏ రోజున చేయకూడదు? ఇప్పుడు తెలుసుకుందాం.
తలస్నానం, తలంటు స్నానం అంటే?
తలపై నీళ్లు పోసుకుని చేసే స్నానం.. తలస్నానం అంటారు.
తలకు, శరీరానికి నూనె పట్టించి స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటారు.
ఆదివారం తలంటు స్నానం చేయకూడదు. చేస్తే అందం తగ్గడం, ఆరోగ్యం పాడవుతుందని శాస్త్రోక్త నమ్మకం. తప్పనిసరిగా చేయాల్సి వస్తే.. నూనెలో ఏదైనా ఒక పువ్వు వేసి తలంటు స్నానం చేస్తే దోషం ఉండదు.
సోమవారం తలంటు స్నానం శుభప్రదం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనోధైర్యం పెరుగుతుంది.
మంగళవారం తలంటు స్నానం చేయరాదు. చేస్తే గొడవలు, ఆపదలు వచ్చే అవకాశం ఉంది. ఆయుష్ తగ్గే ప్రమాదం ఉంది. స్త్రీలు మంగళవారం తలంటు స్నానం చేస్తే పతి హాని కలుగుతుందని నమ్మకం. కాబట్టి మగవాళ్లు, ఆడవాళ్లు ఎవ్వరూ చేయరాదు.
బుధవారం అత్యంత శుభదినం. అన్ని విధాల కలిసివస్తుంది. వ్యాపారం, ఆదాయం పెరుగుతుంది. శత్రుబాధలు తొలగిపోతాయి.
గురువారం తలంటు స్నానం చేయకూడదు. తలంటు స్నానం చేస్తే.. మానసిక ఆందోళన, విద్యా నష్టం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక నష్టం, వృధా ఖర్చులు సంభవించవచ్చు. విద్యార్థులు గురువారం అస్సలు తలంటు స్నానం చేయరాదు. అత్యవసరమైతే.. నూనెలో చిన్న గరికపోచ వేసి తలంటు స్నానం చేస్తే దోషం ఉండదు.
శుక్రవారం పురుషులకు అశుభంగా భావిస్తారు. మానసిక అశాంతి, వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే, స్త్రీలకు అత్యంత శుభం అని చెబుతారు. లక్ష్మీప్రదం, ఐశ్వర్యాన్ని ఇస్తుందని అంటారు. స్త్రీలు శుక్రవారం తలస్నానం లేదా తలంటు స్నానం ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాలి.
శనివారం ఈరోజు తలంటు స్నానం పురుషులు, స్త్రీలు ఇద్దరికీ శుభం. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కొత్త వస్తువులు లభిస్తాయి.
అయితే, వివాహం అయిన తర్వాత పురుషులు ప్రతిరోజూ సాధారణ తలస్నానం చేయాలి. స్త్రీలు ప్రతిరోజూ తలస్నానం చేయకూడదు. అవసరమైన రోజుల్లో మాత్రమే చేయాలి. సాధారణ రోజుల్లో కంఠస్నానం చేసి హరిద్రోదకం శిరస్సుపై జల్లుకుని, నిత్య పూజలు చేసుకోవచ్చు.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.
