Hyderabad: వైభవంగా కొనసాగుతోన్న గణనాథుల శోభాయాత్ర.. మధ్యాహ్నం వరకు కొనసాగనున్న నిమజ్జనాలు

|

Sep 18, 2024 | 7:35 AM

గణపతి నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌, సెక్రటేరియట్‌ దేదీప్యమానంగా వెలిగిపోయాయి. హుస్సేన్‌ సాగర్ తీరమంతా దీపాల కాంతుల్లో తీరొక్క గణపయ్యలతో కనుల విందు చేసింది. రాత్రి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షా 5 వేలకు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ట్యాంక్‌ బండ్ దగ్గర నిమజ్జనం భక్తిశ్రద్ధల మధ్య జరుగుతోంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.

Hyderabad: వైభవంగా కొనసాగుతోన్న గణనాథుల శోభాయాత్ర.. మధ్యాహ్నం వరకు కొనసాగనున్న నిమజ్జనాలు
Ganesh Immersion 2024
Follow us on

వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుని బొజ్జ గణపయ్యను మళ్ళీ వచ్చే ఏడాది రమ్మనమని కోరుకుంటూ గంగమ్మ ఒడికి చేర్చే కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. గణపతి బప్పా మోరియా నినాదం…  డప్పు చప్పుళ్లు.. తీన్మార్ స్టెప్పులతో హైదరాబాద్‌ వీధులు మోతెక్కిపోయాయి. అర్ధరాత్రి అయినా భక్తులు అలసిపోలేదు. తెల్లవారుజామునా ఎక్కడా ఉత్సాహం తగ్గలేదు. ట్యాంక్‌బండ్ కి వచ్చే రహదారులు అన్నీ  జాతరను తలపించాయి. గణనాథుని నామ స్మరణతో గల్లీలు మార్మోగాయి.

వినాయక నిమజ్జనోత్సవానికి ఒకప్పుడు ముంబై ఫేమస్‌. అయితే ఇప్పుడు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్ గా మారింది. చార్మినార్‌ నుంచి మొదలు పెడితే ట్యాంక్‌ బండ్ వరకు గ్యాప్‌ లేకుండా గణపయ్యలు దర్శనమిచ్చాయి. రాత్రయినా భక్తులు మాత్రం అలిసిపోలేదు. శోభాయాత్ర ప్రారంభమైనప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో నిమజ్జనం అయ్యేవరకు అంతే ఉత్సాహంగా కనిపించారు.

కోలాటాలు, నృత్యాలతో ట్యాంక్‌ బండ్ పరిసరాలు హోరెత్తాయి. ఏ దారి చూసినా ఏకదంతుడి భజనలతో మార్మోగాయి. భక్తులు బొజ్జ గణపయ్యకు అత్యంత భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌, సెక్రటేరియట్‌ దేదీప్యమానంగా వెలిగిపోయాయి. హుస్సేన్‌ సాగర్ తీరమంతా దీపాల కాంతుల్లో తీరొక్క గణపయ్యలతో కనుల విందు చేసింది.

ఇవి కూడా చదవండి

రాత్రి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షా 5 వేలకు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ట్యాంక్‌ బండ్ దగ్గర నిమజ్జనం భక్తిశ్రద్ధల మధ్య జరుగుతోంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.

నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. శోభాయాత్రలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ క్లియర్ చేశారు. నిమజ్జన ప్రక్రియను డీజీపీ కమాండ్‌ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించారు.

గతంలో ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం పూర్తవగానే త్వరత్వరగా మిగతా విగ్రహాల నిమజ్జనం జరిగేది. అయితే ఈ ఏడాది విగ్రహాలను టెయిల్ పాండ్‌ల దగ్గర నిమజ్జనం చేయకుండా ట్యాంక్‌ బండ్‌కు తరలిస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌ దగ్గరకు గణనాథులు భారీగా తరలివస్తుండటంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగనుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..