ఓరుగల్లులో కొలువైన వెరైటీ గణనాథులు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రతియేటా కొత్త కొత్త ఆకారాలు, అలంకారాలలో గణపతిని తయారుచేసే ఉత్సవ కమిటీలు ఈసారి కూడా వింత వింత ఆకారాలతో గణపతిని ప్రతిష్టించి నవరాత్రులు పూజలు చేస్తున్నారు. భారీ గణపతులు.. ఎత్తైన గణపతి విగ్రహాలే కాదు.. డిఫరెంట్ ఆకారాలు అలంకరణలతో ప్రతిష్టించిన గణేష్ విగ్రహాలు ఓరుగల్లు లో చూపరులను అబ్బుర పరుస్తున్నాయి. వివిధ ఆకారాలలో ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్టించిన గణపతి విగ్రహాలు చూడడం కోసం భక్తులు బారులు తీరుతున్నారు.
వరంగల్ రామన్నపేటలో ప్రతిష్టించిన బాదంపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన గణనాధుని విగ్రహం చూపరులను ఆశ్చర్య పరుస్తుంది. రామన్నపేట బొడ్రాయి వద్ద తాపీ మేస్త్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో పోకవక్కలు, నిర్మల్ వక్కలతో వెరైటీ గణనాధుని ఏర్పాటు చేశారు.. అదే ప్రాంతంలో ఎక్కడలేని విధంగా బఠానీల గింజలతో విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్టించారు.
ప్రతిసారి ఏదో ఒక విభిన్నమైన ఆకారంలో రూపొందించే వరంగల్ గీత భవన్ వారు ఈసారి ప్లాస్టిక్ తో తయారు చేసిన వివిధ రకాల పూలతో గణనాధుని ప్రతిష్టించారు.. ఎస్ ఎస్ కె సమాజ్ వద్ద శ్రీఫల వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇలా వరంగల్ లో వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న గణపతి విగ్రహాలను చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..