
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు అమ్మలగన్న అమ్మ కనక దుర్గమ్మ కొలువైన ఇంద్ర కీలాద్రి ముస్తాబవుతుంది. ప్రతి ఏడాదిలా నవ రాత్రి ఉత్సవాలు 9 రోజులు కాకుండా ఈ ఏడాది 11 రోజులపాటు దేవి నవరాత్రులు జరగనున్నాయి. తిధుల్లో మార్పులు కారణంగా ఈ ఏడాది 11 రోజులు దసరా ఉత్సవాలు అలాగే 11 అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ వైదిక కమిటీ ప్రకటించింది.. ఈ 11 రోజులపాటు ఇంద్రకీలాద్రిపై 15 లక్షల మందికి పైగా భక్తులు దుర్గమ్మ వారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వచ్చే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేసి.. అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. అవకాశం ఉన్నంతమేరా భక్తుల సౌకర్యాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో పడ్డారు.
దసరా ఉత్సవాల్లో ముఖ్యమైన రోజు మూలా నక్షత్రం. ఆరోజు అమ్మవారి పుట్టిన నక్షత్రం కావడంతో భక్తులు భారీ ఎత్తున దుర్గమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉండడంతో ఆరోజు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అంతేకాదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. 29వ తేదీ మూలా నక్షత్రం కావడంతో అదేరోజు మూడున్నర నుంచి నాలుగున్నర మధ్య సీఎం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్టోబర్ రెండో తేదీ 9:30కు పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ముగియనున్నాయి. ఇక నవరాత్రులన్ని రోజులు సాయంత్రం పూట నగరోత్సవం ఉత్సవముత్తుల ఊరేగింపు వైభవ వేదంగా జరగనుంది. నవరాత్రుల ముగింపు రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను హంస వాహన తెప్పోత్సవం పై ఊరేగించనున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..