Dasara 2024: దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి.. పెండింగ్ పనులను చకచకా పూర్తి చేస్తున్న సిబ్బంది
ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు 2024 అక్టోబర్ 03వ తేదీ గురువారం ఘట స్థాపనతో మొదలై.. అక్టోబర్ 12, శనివారం విజయ దశమి వేడుకతో ముగుస్తాయి. ఈ సమయంలో తొమ్మది రోజులు దుర్గాదేవి అవతారాలను శక్తి, జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. ఈ నేపధ్యంలో దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు జరుగనున్న దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయాధికారులు.
దసరా నవరాత్రులు లేదా శరన్నవరాత్రులను భారతదేశం అంతటా గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. నవరాత్రులు పదవ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు 2024 అక్టోబర్ 03వ తేదీ గురువారం ఘట స్థాపనతో మొదలై.. అక్టోబర్ 12, శనివారం విజయ దశమి వేడుకతో ముగుస్తాయి. ఈ సమయంలో తొమ్మది రోజులు దుర్గాదేవి అవతారాలను శక్తి, జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. ఈ నేపధ్యంలో దసరా నవరాత్రులకు ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు జరుగనున్న దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయాధికారులు. నవరాత్రులకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉండటంతో పనులు శరవేగంగా చేస్తున్నారు.
సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్న అధికారులు
ఇంద్రకీలాద్రిపై ప్రతి ఏడాది దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దసరా వచ్చిందంటే చాలు నవరాత్రుల్లో సుమారు 14 లక్షల మంది భక్తులు దుర్గమ్మను సందర్శించుకుంటారు. తొమ్మిది రోజుల పాటు రోజుకో అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. 9 రోజుల పాటు జరిగే నవరాత్రుల కోసం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. గతేడాది దసరా ఉత్సవాలకు 13 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య కన్నా మరో లక్ష అదనంగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.
సామాన్య భక్తులకు అధికారులు పెద్ద పీట వేస్తున్నారు. సర్వ దర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు అన్ని దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా విపరీతమైన ఎండ కాసినా.. వర్షం వచ్చినా క్యూలైన్లలో ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటిలాగే వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూ లైన్స్ ఘాట్ రోడ్డు మీదుగా ఇంద్రకీలాద్రికి వెళ్తాయి.
ప్రోటోకాల్ దర్శనాలకు కొంత సమయం
ప్రతి ఏడాది ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్, వీఐపీ దర్శనాలతో సాధారణ భక్తులకు తీవ్ర అంతరాయం కలిగేది. క్యూ లైన్ల వద్ద ప్రతి ఏటా గొడవ సర్వసాధారణమైంది. అయితే ఈ సారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రోటోకాల్ దర్శనాలకు కొంత సమయాన్ని కేటాయించారు. ఆ సమయంలో మాత్రమే అమ్మవారిని దర్శించకునేలా వీఐపీలు రావాల్సి ఉంటుందని తెలియచేస్తున్నారు.
దసరాకు కేవలం 20 రోజుల సమయం
ఇంద్రకీలాద్రిపై ఇప్పుడు కొండ చరియలు ఓ పెద్ద సవాల్‌గా మారాయి. వరదలు, భారీ వర్షాల వల్ల ఇప్పటికే కొండ నలుమూలల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ పనులు ఇంకా పూర్తి కూడా కాలేదు. దసరాకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రమాదకరంగా ఉన్న చోట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మొన్నటి వర్షానికి గుడి కింద హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పాటు ఘాట్ రోడ్‌లోనూ కొండపై చాలా చోట్ల బండరాళ్లు పడ్డాయి. దీనిపైన దృష్టి పెట్టిన అధికారులు ప్రత్యేకమైన నిపుణుల బృందం సహాయం తీసుకుంటున్నారు. ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా శాశ్వత, తాత్కాలిక పరిష్కారం దిశగా అడుగులు వేయబోతున్నారు. ఇప్పటికైతే పెండింగ్‌లో ఉన్న పనులను చకచకా పూర్తి చేస్తున్నారు.
అసలే వానలు, వరదలతో విజయవాడ వాసులు నానా అగచాట్లు పడ్డారు.. తమ కష్టాలను దుర్గమ్మకు మొరపెట్టుకుందామనుకుంటున్న స్థానికులకు, అలాగే నవరాత్రుల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ సారి ఎలాంటి అవాంతరాలు, అవరోధాలు కలుగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..