
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, టిబెటన్ బౌద్ధమత అధిపతి, 14 వ దలైలామా టెన్జిన్ గయాట్సో పుట్టిన రోజు నేడు. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యావత్ ప్రపంచానికి దలై లామా సుపరిచితులే అని చెప్పొచ్చు. ఆధ్యాత్మికతపై, రాజకీయాలపై, ప్రంపచంలో వెలుగుచూస్తున్న అణచివేతపై గళం విప్పిన గొప్ప వ్యక్తి దలైలామా. శాంతి సందేశాన్ని విశ్వ వ్యాప్తం చేయాలని కంకణం కట్టుకున్నారు దలై లామా. ఈ నేపథ్యంలోనే అనేక పుస్తకాలు రచించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాల్లో పాల్గొని శాంతి ప్రవచనాలు పలికారు. శాంతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. దలైలామా ఇచ్చే ప్రసంగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులున్నారు. మెక్లియోడ్ గంజ్‌లో నివాసం ఉంటుంన్న దలైలామా.. టిబెటన్ బౌద్దమత ఆధ్యాత్మిక అధిపతిగా, 14వ దలైలామాగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ ఆధ్యాత్మిక గురువు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్న తర్వాత..
దలైలామా టిబెట్‌లో అతిపెద్ద మత గురువు. 1959లో అప్పటి చైనా ప్రభుత్వం టిబెట్‌ను ఆక్రమించుకుంది. చైనా దురాగతాల కారణంగా దలైలామా భారత్‌కు వచ్చారు. దలైలామా రహస్యంగా భారతదేశానికి చేరుకున్న తర్వాత.. చైనా అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. దలైలామా మీది కోపాన్ని చైనా భారత్‌పై చూపించింది. దీంతో 1962 సంవత్సరంలో భారత్‌పై దాడి చేసింది. టిబెట్‌ను చైనా ఆక్రమించిన తర్వాతే భారత్‌తో సరిహద్దు గొడవలు మొదలయ్యాయి. గతంలో చైనా, భారత్ సరిహద్దుల మధ్య ప్రత్యేక టిబెట్ దేశంగా ఉండేది. దలైలామాతో పాటు ఆయన ప్రభుత్వంలోని వ్యక్తులు కూడా అక్కడి నుంచి భారత్‌కు వచ్చేశారు. అప్పటి నుంచి టిబెటన్ ప్రవాస ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో పని చేస్తోంది.
ఆయన టిబెట్ రాజధాని లాసా నుంచి భారతదేశానికి వచ్చారు. వాస్తవానికి ఇదే సమయంలో దలైలామాను చైనా తన బందీగా చేసుకొని బీజింగ్‌కు తీసుకెళ్లబోతున్నదన్న వార్తలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీని తరువాత చైనాకు వ్యతిరేకంగా టిబెట్ రాజధాని లాసాలో తిరుగుబాటు ప్రారంభమైంది. చైనా సైన్యాన్ని ఆపడానికి మానవ గోడను నిర్మించడానికి సుమారు 30వేల మంది దలైలామా ఆరామం వద్దకు చేరుకున్నారు. ప్రజలను తరలించడానికి చైనా సైన్యం ఫిరంగులు, తుపాకులతో మోహరించాల్సి వచ్చింది. ప్రజలను తీవ్రంగా కొట్టారు. దలైలామా అంగరక్షకులు కూడా చనిపోయారు.
ఈ పోరాటం చాలా రోజులపాటు సాగింది. ఆయనను కిడ్నాప్ చేయాలనే చైనా కుట్ర విఫలమైంది. చైనా సైనికుల కళ్లు కప్పి కొందరు టిబెట్ యోదులు దలైలామాను క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చారు. ఆ రోజు అతనితో 20 మంది యోదులు లాసాను విడిచిపెట్టి 15 రోజుల తరువాత న భారతదేశానికి చేరుకున్నారు. భారతదేశం అతనికి రాజకీయ శరణార్థిగా గుర్తించింది. అప్పటి నుంచి అతను భారతదేశంలోనే ఉంటున్నారు.