Chardham Yatra: ప్రారంభమైన చార్‌ధామ్ యాత్ర బుకింగ్స్.. 4 ఆలయ క్షేత్రాల ప్రారంభ, ముగింపు తేదీల వివరాలివే..

|

Feb 21, 2023 | 7:22 PM

ప్రతి ఏటా ఏప్రిల్-మే నెలల్లో అంటే వేసవి కాలంలో చార్‌‌ధామ్ యాత్ర ఉంటుంది. ఈ క్రమంలో భక్తులు, యాత్రికులు ఏప్రిల్-మే నుంచి అక్టోబర్- నవంబర్ వరకు..

Chardham Yatra: ప్రారంభమైన చార్‌ధామ్ యాత్ర బుకింగ్స్.. 4 ఆలయ క్షేత్రాల ప్రారంభ, ముగింపు తేదీల వివరాలివే..
Chardham Yatra
Follow us on

భారతదేశంలో శివరాత్రి పండుగ అయిపోయిందంటే వేసవి కాలం ప్రారంభమయినట్లే. ఈ నేపథ్యంలోనే చార్‌ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్‌ నాథ్, బద్రీనాథ్ ఆలయాల తలుపులు తెరచుకోనున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్-మే నెలల్లో అంటే వేసవి కాలంలో చార్‌‌ధామ్ యాత్ర ఉంటుంది. ఈ క్రమంలో భక్తులు, యాత్రికులు ఏప్రిల్-మే నుంచి అక్టోబర్- నవంబర్ వరకు చార్ ధామ్ యాత్రకు వెళ్లవచ్చు. చలికాలం ప్రవేశించగానే ఇక్కడి ఆలయాలు మంచుతో కప్పబడిపోతాయి. అప్పుడు ఈ యాత్రను మూసివేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 22వ తేదీ నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభంకానుంది.

అయితే ఈ ఛార్‌ధామ్ యాత్రకు సంబంధించిన 4 ఆలయ క్షేత్రాలు కూడా ఉత్తరాఖండ్‌లోనే ఉన్న నేపథ్యంలో.. యాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను స్వీకరించడం ప్రారంభించింది. చార్‌ధామ్ యాత్రకు హెలికాప్టర్ లో వెళ్లడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ బుకింగ్‌లను స్వీకరించడం మొదలుపెట్టింది. ఈ మేరకు నేటి నుంచి అంటే ఫిబ్రవరి 21వ తేదీ నుంచి IRCTC వెబ్‌సైట్‌లో బుకింగ్స్ చేసుకోవచ్చు. మరి 2023లో చార్‌ధామ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది..? అలాగే ఎప్పటితో ముగుస్తుందో..? అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బద్రీనాథ్ ప్రారంభ& ముగింపు తేదీలు:

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయ తలుపులు ఈ ఏడాది ఏప్రిల్ 27న తెరచుకుంటాయి. నవంబర్ 21న తాత్కాలికంగా ఆలయ తలుపులను మూసివేస్తారు. బద్రీనాథ్ ఆలయం ఎప్పుడు తెరచుకుంటుందో ఏటా వచ్చే వసంత పంచమి రోజు నిర్ణయిస్తారు. అలాగే ఆలయ తలుపులు ఎప్పుడు మూసివేయాలనేది విజయదశమి రోజు నిర్ణయిస్తారు.

ఇవి కూడా చదవండి

కేదార్‌నాథ్ ప్రారంభ& ముగింపు తేదీలు:

కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు ఈ ఏడాది ఏప్రిల్ 25న తెరచుకుంటాయి. అలాగే నవంబర్ 14న అంటే వచ్చే భాయీ దూజ్ రోజు ఆలయ ద్వారాలు ముసివేస్తారు. ఏటా కేదార్‌నాథ్‌ ఆలయం ఎప్పుడు తెరచుకుంటుందో మహా శివరాత్రి రోజున,  ఆలయాన్ని తాత్కాలికంగా ఎప్పుడు మూసివేయాలో కూడా అదే రోజు నిర్ణయిస్తారు.

యమునోత్రి ప్రారంభ& ముగింపు తేదీలు:

యమునోత్రి ఆలయ ద్వారాలు ఏప్రిల్ 2న తెరచుకుంటాయి. ఇక నవంబర్ 14న ఆలయ తలుపులు మూసుకుంటాయి.

గంగోత్రి ప్రారంభ& ముగింపు తేదీ:

గంగోత్రి ఆలయ తలుపులు ఏప్రిల్ 22న తెరచుకుంటాయి. నంవబర్ 13వ తేదీ అంటే దీపావళి రోజున గంగోత్రి ఆలయ తలుపులు మూసుకుంటాయి. గంగోత్రి పవిత్ర క్షేత్రాన్ని ఏటా వచ్చే అక్షయ తృతీయ రోజున తెరచుకుంటాయి. అలాగే దీపావళి రోజున మూసుకుంటాయి.

చార్‌ధామ్ యాత్ర కోసం హెలికాప్టర్ సర్వీస్ బుక్ చేసుకోవడం ఎలా..?:

మీ వాట్సాప్, మొబైల్ అప్లికేషన్ ద్వారా చార్‌ధామ్ యాత్ర కోసం హెలికాప్టర్ సర్వీసులు బుక్ చేసుకోవచ్చు. యాత్ర కోసం అధికారిక వెట్‌సైట్‌లో లాగిన్ అయ్యాక యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. హెలికాప్టర్‌లో ప్రయాణించాలనుకునే వారు హెలికాప్టర్ సర్వీసుల వైబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

చార్‌ధామ్ యాత్ర హెలికాప్టర్ సర్వీస్ ధర:

చార్‌ధామ్ యాత్ర హెలికాప్టర్ ద్వారా మొత్తం 5 రోజుల పాటు ఉంటుంది. ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో ఒక వ్యక్తికి దాదాపు రూ.1.5 లక్షలు ఖర్చు అవుతుంది. డెహ్రాడూన్ నుంచి కూడా హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చాలా మంది ఆపరేట్లు ఉన్నందున సర్వీస్ ప్రొవైడర్లను బట్టి ధరలు మారుతూ ఉంటాయి.

చార్ ధామ్ యాత్ర హెలికాప్టర్ సర్వీస్ రూట్:

మొదటి రోజు: సహస్త్రధార రోడ్డులో ఉన్న డెహ్రాడూన్ ప్రభుత్వ హెలిప్యాడ్ నుంచి యమునోత్రికి ఛాపర్ రైడ్ ఉంటుంది. చార్ ధామ్ హెలికాప్టర్ యాత్ర ఇక్కడే మొదలై.. ఇక్కడే పూర్తవుతుంది. ఆ క్రమంలో యమునోత్రి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ల్యాండింగ్ ప్లేస్ వద్ద దిగుతారు. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే రాత్రి బస చేస్తారు.

రెండో రోజు: యమునోత్రి నుంచి హెలికాప్టర్ బయలుదేరుతుంది. గంగోత్రికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్సిల్ వద్ద ల్యాండ్ అవుతుంది. ఆ రోజు యమునోత్రి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే బస చేయాల్సి ఉంటుంది.

మూడో రోజు: మూడో రోజు హర్సిల్ నుంచి ఫాటా హెలిప్యాడ్‌కు వెళ్తారు. అక్కడి నుంచి మరో ఛాపర్‌లో కేదార్‌నాథ్‌కు ప్రయాణం ఉంటుంది. దర్శనం అనంతరం అక్కడి నుంచి గుప్తకాశీకి వెళ్తారు. అక్కడే మూడో రోజు రాత్రి బస చేస్తారు.

నాలుగో రోజు: నాలుగో రోజు గుప్తకాశీ నుంచి బద్రీనాథ్‌కు సమీపానికి వెళ్తారు. బద్రీనాథ్ దర్శనం అయ్యాక రాత్రి అక్కడే బస చేస్తారు

ఐదో రోజు: బద్రీనాథ్ రాత్రి బస అయ్యాక ఐదో రోజు అక్కడి నుంచి డెహ్రాడూన్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..