ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరవగా.. ఈ రోజు బద్రీ నాథుడి ఆలయ తలుపులు తెరవబడ్డాయి. భక్తుల కోసం బద్రినాథుడు ఆలయ తలపులు రోజు ఉదయం 7:10 గంటలకు తెరవబడ్డాయి. దీంతో బద్రీనాథ్ స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తుల నిరీక్షణకు నేటితో తెరపడింది. దర్శనం కోసం ఒక రోజు ముందు అంటే బుధవారం నాడు వేలాది మంది భక్తులు బద్రీనాథ్ ధామ్‌కు చేరుకున్నారు. భక్తులందరిలో చాలా ఉత్సాహం కనిపించింది. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులందరూ చాలా సంతోషించారు. బద్రీనాథ్ ధామ్ ఆలయం మొత్తం 15 క్వింటాళ్ల పూలతో అలంకరించబడింది.
ఈ పుణ్యక్షేత్రాన్ని ఒకసారి సందర్శించి, దర్శనం పొందిన వ్యక్తి, తల్లి గర్భంలోకి ప్రవేశించినట్లు అని.. మళ్ళీ జన్మ ఉండదని.. ముక్తి లభిస్తుందని బద్రీనాథ్ భగవంతునిపై ఒక నమ్మకం. గత సారి మాదిరిగానే ఈసారి కూడా బద్రీనాథ్ ద్వారం తెరిచే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద దేవుడి తొలి హారతి నిర్వహించారు. అదే సమయంలో బద్రీనాథ్‌లో మంచు కురుస్తూ వర్షం కురుస్తోంది. అయినప్పటికీ భక్తుల ఉత్సాహంలో ఏమాత్రం తగ్గడం లేదు.
చార్ ధామ్ యాత్ర ప్రారంభం
ఛోటీ చార్ ధామ్ యాత్రగా పిలువబడే ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర అక్షయ తృతీయ నుండి ప్రారంభమైంది. చార్ ధామ్‌లో, గంగోత్రి, యమునోత్రి తలుపులు మొదట 22 ఏప్రిల్ 2023న తెరవబడ్డాయి, అదే విధంగా కేదార్‌నాథ్ ఆలయ తలుపులు ఇటీవల 25 ఏప్రిల్ 2023న పూర్తి సాంప్రదాయాలతో తెరవబడ్డాయి.
The portals of #BadrinathDham opened amid melodious tunes of the Army band and chants of Jai Badri Vishal by the devotees.#TV9News pic.twitter.com/BBD588TTWm
— Tv9 Gujarati (@tv9gujarati) April 27, 2023
బద్రీనాథ్ ఆలయం మతపరమైన ప్రాముఖ్యత
దేశంలోని ప్రసిద్ధ విష్ణు దేవాలయాలలో ఒకటైన బద్రీనాథ్ వైకుంఠ ధామం వలె పూజించబడుతుంది, ఈ బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అలకనంద నది ఒడ్డున నార, నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ బద్రీనాథ్ విగ్రహం చతుర్భుజ భంగిమలో ఉన్న శాలిగ్రామ శిలతో చేయబడింది. దక్షిణ భారతదేశంలోని పూజారులు ఈ ఆలయంలో ఆయనకు పూజలు చేస్తారు. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి భక్తులు ప్రతి సంవత్సరం వస్తుంటారు.
బద్రీనాథ్ ధామ్ తలుపులు 19 డిసెంబర్ 2022న మూసివేశారు. దీంతో చార్ ధామ్ యాత్ర ముసిగిసింది. ఇక గతేడాది 17 లక్షల 60 వేల 646 మంది భక్తులు బద్రినాథుడిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం చార్ ధామ్ యాత్ర గంగోత్రి, యమునోత్రి ద్వారాలు తెరవడంతో ప్రారంభమవుతుంది. బద్రినాథుడు ఆలయ తలుపులు మూసివేయడంతో ముగుస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..