Chanakya Niti
ఆచార్య చాణక్యుడు మానవుల జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. ఆర్ధిక శాస్త్రం సహా అనేక నీతి శాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు చెప్పిన విధానాలను జీవితంలో అమలు చేయడం ద్వారా మనలోని అనేక సమస్యల తీరి బాధల నుంచి విముక్తి పొందవచ్చు. చాణక్య నీతి అనేది జీవితం, విజయం, నీతిపై 700 శ్లోకాలతో కూడిన పురాతన గ్రంథం. ఇది సంక్షోభ సమయాలను ఎదుర్కోవటానికి వివిధ మార్గాలతో సహా జీవితంలోని ప్రతి అంశంపై మార్గదర్శకత్వం అందిస్తుంది. చాణక్యుడి ప్రకారం విపత్కర సమయాల్లో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, సహనాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
ఆచార్య చాణక్యుడు చెప్పిన 10 ముఖ్యమైన విషయాలు కష్ట సమయాల్లో ఉపయోగపడతాయి.
- సానుకూలతను కాపాడుకోండి
చాణక్య నీతి ప్రకారం ఎంత చెడు సమయం వచ్చినా ప్రతికూల ఆలోచనలు మీ మనస్సుపై ఆధిపత్యం చెలాయించవద్దు. ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆశాజనకంగా ఉండండి.
- ఓపికపట్టండి
సంక్షోభ సమయాల్లో సహనం చాలా ముఖ్యం. కష్టాలు వచ్చినప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఓపికగా వాటిని ఎదుర్కోవాలి.
- విచక్షణ ఉపయోగించండి
భావోద్వేగాల ప్రభావంతో ఏ నిర్ణయం తీసుకోకండి. ఎల్లప్పుడూ తెలివితేటలను, విచక్షణను ఉపయోగించుకుని జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి.
- ప్రియమైనవారి నుంచి సహాయం
జీవితంలో అవసరమైతే కుటుంబం, స్నేహితుల సహాయం అడగడానికి వెనుకాడవద్దు. అవి చెడు కాలంలో ఉపయోగపడతాయి.
- సరైన పని చేస్తూ ఉండండి
ఎప్పుడూ చేస్తున్న పనులను వదులుకోవద్దు. సరైన పని అనిపిస్తే ఆ పనిని చేస్తూ ఉండండి. పని చేయడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం లభిస్తుంది. క్రమంగా సంక్షోభం నుంచి బయటపడతారు.
- ఆరోగ్యం పట్ల శ్రద్ధ
ఆచార్య చాణక్య చెప్పిన ప్రకారం సంపద, స్నేహితులు, భార్య , రాజ్యం ప్రతిదీ తిరిగి పొందవచ్చు.. కానీ ఈ శరీరాన్ని తిరిగి పొందలేము. అందువల్ల ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోండి. తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
- ఆధ్యాత్మికత వైపు అడుగులు
ధ్యానం, యోగా లేదా ప్రార్థన వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు కష్ట సమయాల్లో మానసిక ప్రశాంతతను అందిస్తాయి. కనుక జీవితంలో ఆధ్యాత్మికతకు స్థానం ఇవ్వండి.
- సమయం ప్రాముఖ్యత
విపత్కర సమయాల్లో సమయం ప్రాముఖ్యత చాలా పెరుగుతుందని చాణక్యుడు చెప్పాడు. అందువల్ల చెడు సమయాల్లో సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుని తద్వారా పరిస్థితులను మెరుగుపరచుకోవచ్చు.
- శక్తి వినియోగం
శారీరక బలాన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా సంక్షోభ సమయాల్లో పరిస్థితిని మెరుగుపరచవచ్చు. మీలోని లోపాలను గుర్తించండి.. మీ లక్షణాలను సరిగ్గా ఉపయోగించుకోండి అని చాణక్యుడు చెప్పాడు.
- ధైర్యం
ఎవరికైనా ఆపద ఎదురైతే ఆ సమయంలో ధైర్యంగా ఉండాలి. ఎవరినా కష్టాలు వచ్చాయని ధైర్యం కోల్పోతే ఆ క్లిష్ట పరిస్థితి నుంచి అతను ఎప్పటికీ బయటపడలేడు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు