Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahma Muhurta: పెద్దలు బ్రాహ్మీముహర్తంలో నిద్రలేవమని చెబుతారు ఎందుకో తెలుసా.. అలా నిద్రలేవడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో

Brahma Muhurta:మన పెద్దలు రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.. అలా బ్రాహ్మిమూర్తంలో నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిదని చెప్పేవారు.. ఇలా ఉదయాన్నే నిద్రలేవాలని చెప్పే తరాలు..

Brahma Muhurta: పెద్దలు బ్రాహ్మీముహర్తంలో నిద్రలేవమని చెబుతారు ఎందుకో తెలుసా.. అలా నిద్రలేవడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో
Brahma Muhurta
Follow us
Surya Kala

|

Updated on: Aug 17, 2021 | 7:50 AM

Brahma Muhurta:మన పెద్దలు రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.. అలా బ్రాహ్మిమూర్తంలో నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిదని చెప్పేవారు.. ఇలా ఉదయాన్నే నిద్రలేవాలని చెప్పే తరాలు వెళ్లిపోయాయి. తరం మారుతున్న కొద్దీ మనిషి జీవవనశైలి మారుతుంది. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి. ఇప్పటికే పని చేయడానికీ, నిద్రపోవడానికీ రాత్రీపగలుతో సంబంధమే లేనట్లు తయారైంది.. మనిషి అవసరాలు జీవన శైలి. అయితే ఇప్పటికీ కొన్ని ఇళ్లలో.. పల్లెల్లో “బ్రాహ్మీముహూర్తం” అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రాహ్మీముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల ప్రయోజనం ఏంటి అనే విషయాలను గురించి ఈరోజు తెలుసుకుందాం..

సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే ఋతువులను బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి. కనుక తెల్లవారు జామున 4:00-4:30 మధ్య కాలాన్ని బ్రాహ్మీముహూర్తంగా పెద్దలు చెప్పారు. బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఉపయోగాలను అనేకం. ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది. ఆ సమయంలో వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏకైక కాలంలో కలిగి ఉండే సమయం ఇదన్నమాట. అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు కనుక ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది.

మనలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం… ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. ఆయుర్వేదమే తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రాహ్మీముహూర్తంలో లేవాలి` అని చెబుతోంది. పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం ‘వాత’ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలనీ, ఆలోచనలనీ, రక్తప్రసరణనీ ప్రభావితం చేసేది ఈ ‘వాత’ లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం. ప్రశాంతంగా ఉండగలం.. మంచి ఆలోచనలు చేయగలం చదివినదానిని ఆకళించు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం.

ధ్యానం చేయాలనుకునేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయిని యోగుల నమ్మకం. బ్రాహ్మీముహూర్తంలో సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి… ధ్యానం చాలా సులువుగానూ, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందట. ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగా, ధ్యానం, చదువు… చాలా తేలికగా ప్రభావవంతంగా సాగుతాయి. రోజువారీ చేయాల్సిన విధులకు ముందు కాస్త సమయం చేజిక్కుతుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల… మన మనసు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి.

గుండెజబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందనీ వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే ‘థ్రోంబస్‌’ అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు వైద్యులు. పైగా ఇదే సమయంలో మనం హడావుడిగా లేచి విధుల్లోకి చేరాలనే టెన్షన్‌లో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని… స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిని తరువాత బ్రాహ్మీముహూర్తంలో లేవడాన్ని ఛాదస్తమని అనుకోకుండా బద్ధకించకుండా తెల్లవారుజామున నిద్రలేచి.. ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి.

Also Read:  నేటి తల్లులకు పిల్లల పెంపకానికి ప్రామాణికం.. మహాభారతంలోని ఇద్దరు శక్తివంతమైన మహిళలు