
హిందూ మతంలో అరటి మొక్కకు పవిత్ర స్థానం ఉంది. పురాణాల ప్రకారం అరటి చెట్టుని విష్ణువు నివాసంగా నమ్ముతారు. గురువారం రోజున అరటి మొక్కను పూజిస్తే విష్ణువు ప్రసన్నుడవుతాడని నమ్మకం. అంతేకాదు అరటి మొక్కలను పూజా కోసం మాత్రమే కాదు శుభ సమయంలో ఉపయోగిస్తారు. అయితే ఇంటి ఆవరణలో అరటి చెట్టుని పెంచుకోవచ్చా లేదా? ఇది మంచిదా చెడ్డదా అనే విషయంలో చాలా మందికి గందరగోళం ఉంది. దీనికి సంబంధించి ప్రముఖ జ్యోతిష్కులు చెప్పిన సలహాలు తెలుసుకుందాం..
హిందూ సంస్కృతిలో అరటి చెట్టుని దుర్వాస మహర్షి సృష్టించాడని నమ్ముతారు. కదళి దుర్వాస మహర్షి భార్య. ఒకసారి ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు.. కదళి దుర్వాస మహర్షిని వదిలి తన స్వస్థలానికి వెళుతుంది. తన భార్యను దుర్వాస మహర్షి ఇంటికి తిరిగి తీసుకురావాలని కోరుకున్నప్పుడు.. కదళి తన భర్తకు ఒక షరత్తు పెడుతుంది. తనకు అత్యంత రుచికరమైన పండు కావాలి. అయితే అది బ్రహ్మ సృష్టి కాకూడదని ఆమె ఒక షరతు పెడుతుంది. భార్య కోరిక తీర్చడం కోసం దుర్వాస మహర్షి అరటి పండును సృష్టిస్తాడు. ఈ పండు తిన్న తర్వాత కదళి తన భర్త మాటను మన్నించి తిరిగి ఆశ్రమానికి వచ్చిందట.. అందుకే ఈ పండుకు కదళి అనే పేరు వచ్చిందట.
దుర్వాస మహర్షి తన భార్య కదళితో పర్ణశాలలో నివశిస్తూ.. జపతపాదులు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అయితే దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ. దీంతో కదళి తన భర్తకు కోపం రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండేది. ఒకానొక సాయంసంధ్యా పడుతున్న సమయంలో దుర్వాసమహర్షి అలసటతో పర్ణశాల బయటి అరుగుపై నడుంవాల్చాడు. వెంటనే గాఢనిద్రలోకి జారుకున్నాడు. భార్య కదళి భర్త నిద్ర లేస్తాడని ఎదురు చూసింది. అయితే సాయం సంధ్య వార్చాల్సిన సమయం దాటిపోతుందన్న భయంతో దుర్వాస మహర్షిని తట్టి నిద్రలేపింది. నిద్రాభంగం అవడంతో దుర్వాస మహర్షి పట్టలేని ఆగ్రహంతో కళ్ళుతెరచి భార్యను చూశాడు. ఆయన కనుల నుంచి వెలువడిన అగ్నిజ్యాలలకు కదళి భస్మమైపోయింది. తర్వాత జరిగిన అనర్ధానికి దుర్వాసుడెంతో పశ్చాత్తపపడ్డాడు.
కొన్ని రోజున తర్వాత దుర్వాసుని మామగారు, తన కుమార్తెను చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. తన కుమార్తె గురించి అడగగా.. మామగారు తనని ఎక్కడ శాపిస్తాడో అనే భయంతో జరిగింది అంతా చెప్పి.. క్షమించమని కోరి తన తపోశక్తితో ఆభస్మం నుంచి ఒకచెట్టును సృష్టించాడట. అదే కదళీ మొక్క.. అంటే అరటిచెట్టు. కదళి అందరికీ ఇష్టురాలై కదళీఫలం రూపంలో అన్ని శుభకార్యాలలో భగవంతుని నివేదనకే కాక, మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ, నోముల్లోనూ, అన్ని శుభకార్యాల్లోనూ ప్రాముఖ స్థానంలో ఉండి గౌరవం పొందుతుందని వరమిచ్చాడుట.
కొన్ని నమ్మకాల ప్రకారం ఇంట్లో అరటి మొక్కను పెంచడం అశుభకరమని భావిస్తారు, ఎందుకంటే ఈ చెట్టు ఇంటి సంతానోత్పత్తికి ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు. అయితే ఇది వ్యక్తి వ్యక్తిగత నమ్మకాలు, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. అరటిపండ్లు కూడా శాంతిని కలిగిస్తాయని నమ్ముతారు. మొత్తం మీద ఇంటి ముందు అరటి చెట్టు నాటడం అనేది ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత నిర్ణయం అని జ్యోతిష్యులు వివరించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు