అయ్యప్ప నడిచిన మార్గం..ఎరుమెలి టూ శబరిమల కీంకారణ్యంలో.. రాళ్లు రప్పల్లో
ఎరుమెలి నుండి శబరిమల వరకు సాగే పెద్ద పాదం వనయాత్ర అయ్యప్ప దీక్షలోని అత్యంత కఠినమైన ఘట్టం. కొండలు, రాళ్లు, కీంకారణ్యంలో నడుస్తూ, భక్తులు భక్తితో ఈ మార్గాన్ని పూర్తి చేస్తారు. మహిషి వధించిన అళుదానది, కరిమల కొండ వంటి కీలక స్థలాలను దాటి, పంబా నది స్నానంతో ఈ పుణ్య యాత్ర ముగుస్తుంది. ఇది అయ్యప్ప స్వామి స్వయంగా నడిచిన దారి, భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది.

స్వామియే శరణం అయ్యప్ప..ఆ హరిహర పుత్రుని దీక్ష అత్యంత కఠినం. ఆ పద్దెనిమిది మెట్ల సోపానాదిపతిని చేరడం కూడా అత్యంత కఠినం. కొండలు దాటి కోనలు దాటి, రాళ్లు రప్పల దారులు దాటి కీంకారణ్యంలో అతి కష్టంగా సాగితే తప్ప అయ్యప్ప ను చేరడం సాధ్యం కాదు. మండలం కాలం దీక్ష చేసిన ప్రతి ఒక్క స్వామి వనయాత్ర చేస్తే ఆ శబరిగిరీశుని దర్శన భాగ్యం దక్కుతుందంటారు. ఆయన యాత్ర లో పెట్టే కాల పరీక్ష అత్యంత కఠినం.. ఎరుమెలి నుండి శబరి పీఠం వరకు సాగే పాదయాత్ర మరింత కఠినం. మారుతున్న కాలానికి తగ్గట్టు సదుపాయాలు మెరుగు పడుతున్నా.. ఆ ఒక్క పెద్దపాదంలో మాత్రం ఇంకా ఆనాటి ప్రయాణమే. సాక్ష్యాత్తు అయ్యప్ప నడయాడిన మార్గమే పెద్దపాదం. మరీ ఆ పెద్ద పాదం యాత్ర ఎలా ఉంటుంది.. ఎన్నిపరీక్షలు పెడుతుంది.. అడుగడుగున కాలం పెట్టే పరీక్షలకు ప్రకృతి ఎలా సహాకారం అందిస్తుంది.. ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
మండల కాలం అయ్యప్ప దీక్ష పూర్తి చేసి ఆ ఆనంద రూపాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. అయ్యప్ప ను చేరుకునేందుకు రెండు నడక మార్గాలు ఉండగా.. అందులో అత్యంత కీలక ఘట్టం పెద్ద పాదం నడకయాత్ర. మాల వేసిన స్వామి ఒక్కసారైనా నడిచి తీరాల్సిన దారి పెద్దపాదం. ఈ మార్గంలో నడక ఆశమాసి కాదు. అడుగడుగునా ప్రకృతి పరీక్షిస్తూనే ఉంటుంది కాలం ఓ కంటకనిపెడుతూనే ఉంటుంది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆ హరిహరసుతుని సన్నిధానానికి చేరుకోగలిగే మార్గాల్లో ఇదే ప్రధానమైనది.
‘పల్లికట్టు శబరిమలైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యప్పో – అంటూ ఈ మార్గాన నడుస్తారు భక్తులు.
పళ్లికట్టు శబరిమళైక్కి కల్లుమ్ ముల్లుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యప్పో – అయ్యప్పో స్వామియే.. అంటూ ఉత్సాహంగా సాగుతుంది ఈ వనయాత్ర. అదో అనిర్వచనీయమైన అనుభూతి. శబరిగిరీశుడి దర్శనానికి వెళ్లేందుకు అనేక మార్గాలున్నా, శబరిమల యాత్రలో అతి ప్రాచీనమైన మార్గం ఎరుమేలి. ఇది సాక్షాత్తూ అయ్యప్ప స్వామి నడిచి వెళ్లిన పుంగావనం. ఈ ఎరుమేలి మార్గం నుంచే శతాబ్దాలుగా భక్తులు సన్నిధానానికి చేరుకుంటారు. ఈ మార్గంలో పాదయాత్ర చేయాలంటే ఎరుమేలి నుండి నడక ప్రారంభించాలి. ఎరుమెలి నుండి పంబా నది చేరే వరకు సాగే మార్గాన్నే పెద్ద పాదం అంటారు. దాదాపు 58 కిలో మీటర్ల పైగా సాగే అత్యంత కఠినమైన యాత్ర. కఠినమైనా.. మోక్షమార్గాన్ని ప్రసాదించే యాత్ర కూడా ఇదే. అయ్యప్ప ఆశీర్వాదం తో ఇక అసలు విషయంలోకి అడుగు పెడుదాం…
పెద్ద పాదం మొదలయ్యేది.. ఇక్కడి నుండే..
ఎరుమేలి.. వనయాత్ర మొదలయ్యేది ఇక్కడి నుండే. భక్తులు తమ శరీరానికి తీరొక్క రంగులు పులుముకొని, పేటైతుళ్ళి అనే ఆటవిక నృత్యం చేసి, పేటయిల్ శాస్తాను దర్శించుకుంటారు. పేటయిల్ శాస్తాను వనంలో తమకు తోడుగా రమ్మని ప్రార్థించి చేసే పూజ ఇది. పేటయిల్ శాస్తానే.. వావర్ స్వామి అని అక్కడి చరిత్ర చెప్తున్నా.. దేశ నలుమూలల నుండి వస్తున్న సనాతన హైందవ భక్తులు వావర్ అనే పాత్ర కల్పితమని దశాబ్ద కాలం నుండి బలంగా నమ్ముతుంది. అది వేరే ముచ్చట అనుకొండి.. ఇక పెద్దపాదం యాత్రలోకి అడుగు పెడితే… క్రూరమృగాలు సంచరించే పెరియార్ అటవీ మార్గంలో సాగుతుంది అయ్యప్ప భక్తుల వనయాత్ర. ఈ వనంలో ఎదురయ్యే ఆటంకాలను స్వామి శరణుఘోషతో దరిచేరనీయకుండా ముందుకు సాగేలా చూస్తాడని భక్తుల ప్రగాడ విశ్వాసం.. అలా ఓ ఐదు కిలో మీటర్లు ముందుకు సాగాక మనకు స్వాగతం పలుకుతుంది కోట్టైప్పడి.
కోట్టైప్పడి..
అయ్యప్ప స్వామికి ప్రథమ సేవకుడు, స్నేహితుడు వావరు స్వామి కొలువుదీరిన పుణ్యస్థలి అని ప్రసిద్ది. కోట్టైపడి. ‘పేరూర్తోడు’ అని పిలిచే ఈ ప్రదేశంలో ప్రవహించే కాలువలో చేపల కోసం ప్యాలాలు (మరమరాలు) వేయడం సంప్రదాయం. అలా అలా సాగుతూ వెళుతుంటే.. కాళైకట్టి ఎదురై స్వాగతం పలుకుతుంది. హరిహరసుతుడు అయ్యప్ప స్వామివారు మహిషితో యుద్ధం చేస్తుండంగా సాక్షాత్తూ పరమశివుడు దరణికి దిగివచ్చి తన వాహనం నందిని కట్టి ఉంచాడని స్థలపురాణం చెపుతుంది. మలయాళంలో నందిని ‘కాళై’ అంటారు. ఆ నందిని కట్టిన స్థలమే కాళై కట్టి..
అలా నడక సాగిస్తుంటే రాళ్లు రప్పలు ఎదురొస్తాయి.. కాళ్లు ముళ్లను తాకుతాయి.. శరీరం అలసి పోతున్నట్టుగా మారుతుంది. ఆ సమయంలో శరీర బారాన్ని తీర్చేందుకు ఆ అళుదా నదే ఎదురొచ్చి పుణ్య స్నానానికి ఆహ్వానిస్తుంది. మహిషిని హరిహరసుతుడు వధించిన స్థలమే అలుదా. అయ్యప్పతో యుద్ధం చేసిన మహిషి.. స్వామి బాణాలకు తాళలేక రోదిస్తూ కన్నీరు కార్చిందంట. ఆ కన్నీరు అక్కడ ప్రవహిస్తోన్న అలసా నదీలో కలవడం వల్ల దానికి అళుదానది పేరు వచ్చిందని చెపుతారు. ఈ నదిలో స్నానమాచరించిన భక్తులు రెండు రాళ్లను తీసుకొని యాత్రామార్గంలోని కల్లిడుకుండ్రుంలో విసురుతారు. అళుదా నదిలో స్నానం ముగిసిన తర్వాత భక్తులు ఎక్కే నిటారైన కొండయే అళుదామేడు. సుమారు 5 కి.మీ. మేర ఉండే ఈ కొండ ఎత్తైన గుండ్రాళ్లతో ఉంటుంది. ఈ కొండ ఎక్కడమంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సాగడమే. మండల కాలంలో చేసిన కఠిన దీక్ష ఈ కొండను ఎక్కడానికి బలాన్ని ఇస్తుంది. అయ్యప్పమాల దరించని భక్తులు సైతం సివిల్ స్వాములుగా ఈ కొండను ఎక్కుతారు.. వారికి సైతం వారి వారి పుణ్య కాలమే తోడుగా నిలుస్తుందన్నది ఇక్కడి స్థలపురాణం చెపుతుంది. అలా ముందుకు సాగితే ఓ 15 కిలోమీటర్ల నడక మార్గం ముగిసాక ఎదురొస్తుంది.. కలిడుంకుండ్రు అనే మార్గం.
కలిడుంకుండ్రు..
మహిషిని వధించిన స్వామి ఆమె కళేబరాన్ని ఆకాశంపైకి విసరగా అది నేలపై పడిన స్థలంమే కలిడంకుండ్రు. బ్రహ్మహత్యా దోషం నుంచి బయటపడటానికి అళుదానదిలో స్నానమాచరిస్తున్న దేవతలు, మహిషి కళేబరం పెరగడం గమనించి, ఆ నదిలో నుంచి తమ చేతికి దొరికిన రాళ్లను తీసి దానిపైకి వేసి సమాధి చేశారంట. అందుకే అళుదానదిలో స్నానం చేసే సమయంలో ఓ రెండు రాళ్లను తీసి భద్రపరుచుకోమని మన వెంట వచ్చే గురుస్వాములు చెబుతారు. ఆ రాళ్లను కలిడుండకుండ్రులో విసిరి మహిషి కళేబరానికి నమస్కరించి, హారతి వెలిగించి యాత్రను కొనసాగిస్తారు.
ఇంజిప్పారకోట..
కలిడుంకుండ్రు తర్వాత వనయాత్రలో చేరే ప్రాంతం ఇంజిప్పారకోట. ఇక్కడే అయ్యప్ప స్వామి ఉదయనుడు అనే బందిపోటు దొంగను హతమార్చారు అని చెప్తారు. ఇక్కడ శిథిలమైన కోట అవశేషాలు కూడా ఉన్నాయి. ఇక్కడ భక్తులు విశ్రాంతి తీసుకుంటారు. అలా విశ్రాంతిలోకి జారుకున్న ఈ దేహాం మళ్లీ తిరిగి ప్రయాణం సాగించేందుకు నూతన ఉత్తేజాన్ని తెచ్చుకుని ముందుకు సాగుతుంది. కానీ అసలు సిసలు పరీక్ష ఇక్కడి నుండి మొదలువుతుంది. అదే ప్రాణం పోతుందేమో ఇక నేను నడవలేనేమో అని అనిపించే సమయం..
కరిమల.. యాత్ర కఠినం కఠినం..
పెద్ద పాదం యాత్రలో అత్యంత కఠినమైన ఘట్టం.. కరిమలను చేరడం. సుమారు 15 కిలో మీటర్లు ఏటవాలుగా ఉండే కొండను ఎక్కడమంటే ఆ హరిహర సుతుడి అండదండలు మెండుగా ఉండాల్సిందే. కరిమల శబరి యాత్రలోనే ఎత్తయిన కొండ. ఇది నిట్టనిలువుగా ఉండటంతో శ్వాస ఆగిపోతుందేమో అన్న భయం కలుగుతుంది. సుమారు 10కి.మీ. ఎత్తుకుపోయిన తర్వాత కరిమల శిఖరాన్ని చేరుకుంటారు భక్తులు. ఇది ఆకాశాన్ని తాకే కొండ.. ఇదే ఉన్నత స్థానం.. భూమి ఆకాశం కలిసిందా అన్నట్టుగా కనిపించే స్థలం. ఇంత ఎత్తులో కూడా కొండపై అతి ప్రాచీనమైన బావి దర్శనం ఇస్తుంది. ఇదే చోట జలపాతం సైతం తారసపడుతుంది. ఇంత ఎత్తులో జలపాతం కనిపించడం ఒక్క శబరిమల యాత్రలో తప్ప మరెక్కడా కనపడదేమో. కరిమల ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతకు మించిన కష్టమే.. కానీ స్వామి శరణుఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. ఇంత శ్రమ పడి కరిమల చేరాక ఓ పిల్ల కాలువా అడ్డొచ్చి కాసేపు నా చెంత సేద తీరమంటుంది. ఆ ప్రాంతమే వలియాన వట్టం. ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువ. వన్యమృగాలూ సంచరిస్తుంటాయి. చీకటి పడే సమయానికి ఈ ప్రాంతం నుంచి వదిలి వెళ్లాలని ఆంక్షలు ఉంటాయి. అలుదానది దాటిన తర్వాత నుండి దాదాపు కరిమల దిగేంత వరకు ఏనుగుల కీంకారాలు రమ్యంగా వినిపిస్తూనే ఉంటాయి. నిజానికి ఈ నడక దారంతా ఆ ఏనుగులు నడిస్తే ఏర్పడిన మార్గమే.
అలా వలియాన వట్టం దాటి ముందుకు నడిస్తే శిరియాన వట్టం ఎదురొస్తుంది. ఈ ప్రాంతలో ఒకప్పుడు ఇక్కడా ఏనుగుల సంచారం బాగా ఉండేది. కాలక్రమేణ భక్తుల రద్దీ పెరగడంతో ఏనుగులు ఈ ప్రాంతానికి రావడం కనుమరుగైంది. ఇక్కడి చేరుకోవడంతో పెద్దపాదం యాత్ర కీలక ఘట్టానికి చేరుకుంటుంది. మరో కిలో మీటర్ నడకసాగిస్తే పంబ నది దర్శనం ఇస్తుంది. కానీ శిరియాన వట్టానికి చేరాక శరీరం అలసి సొలసి పోతుంది.. పాదం ఇక ముందుకు నడవలేనంటుంది. చాలా మంది స్వాములు అయ్యప్ప భక్తులు ఈ శిరియాన వట్టం లో సేదతీరుతారు. పంబ వరకు విడిది ఏర్పాటు చేసుకుని వంటలు చేసుకొని భుజించి, విశ్రమిస్తుంటారు. విశ్రాంతి అనంతరం పావన పంబాను చేరుకుంటారు. పంబా నది స్నానంతో పెద్ద పాదం వన యాత్ర ముగుస్తుంది.
పావన పంబా నది.. పాపాలు కడిగే ఔషదీయ తల్లి
పంబానది ఔషధ మూలికల సారంతో ప్రవహించే నది. ఈ నదిలో స్నానం చేస్తే వనయాత్ర అలసట ఒక్కసారి మటుమాయమవుతుంది. దీనినే దక్షిణ గంగా అని కూడా అంటారు. త్రేతాయుగంలోని ఈ నది ప్రస్తావన ఉంది. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే ఏడు తరాల వారు మోక్షం పొందుతారని నమ్మకం. ఎరుమేలి నుంచి కాలినడకన వచ్చే వారూ, నిలక్కల్ మీదుగా వాహనాల్లో వచ్చేవారూ ఇక్కడ కలుస్తారు. ఇరుముడులకు పూజలు చేసి.. ఇరుముడిలోని ఓ టెంకాయను తీసి పెట్టుకుంటారు. ఇక్కడ నుండి చిన్నపాదం యాత్ర మొదలువుతుంది. పంబ నది దాటి కాస్త ముందుకు సాగితే కన్నెమూల మహాగణపతి దర్శనమిస్తాడు. ఇరుముడి నుండి తీసిన టెంకాయను మనసారా మొక్కి గణపతికి సమర్పించి యాత్ర ముందుకు సాగిస్తారు భక్తులు.
నీలిమల.. అప్పాచ్చిమేడు.. శరంగుత్తి.. శబరిపీఠం.. చిన్నపాదంలో నడక సాగించే మార్గాలు. అయ్యను దర్శించుకునేందుకు మండల కాలం పూర్తి చేసుకుని చిన్నపాదం నడక సాగిస్తూ ఇరుముడితో పావన పదునెట్టాంబడి పై పాదం మోపి.. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని చూడాలనుకునే ఆత్రుత ఇక్కడి నుంచే మొదలవుతుంది. కరిమల నుండి సన్నిదానం వరకు నడక అంతా మెట్ల మార్గమే.. కరిమల దాటగానే అప్పాచ్చిమేడు ఎదురొస్తుంది. ఈ చోట మన పూర్వీకుల ఆత్మల శాంతి, ప్రీతికోసం నీలిమల శిఖరం రెండు వైపుల నున్న లోయలో భక్తులు బియ్యపు ఉండలను విసురుతారు భక్తులు. నడక మార్గంలో నడిచొచ్చిన భక్తుల భక్తిని పరిశీలించి, కపట భక్తులకు ఆత్మ ప్రబోధ కల్పించడానికి దేవతలు ఇక్కడ వేచి ఉంటారని స్థల పురాణం.
ఇక కన్య స్వాముల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శరంగుత్తి. తొలిసారి అయ్యప్పస్వామి మాల ధరించిన భక్తులను కన్నెస్వాములు అంటారు. కన్నెస్వాములు తమ కన్నెయాత్రకు నిదర్శనంగా, వనములోని రక్షాదండంగా ఎరుమేలి నుంచి తెచ్చిన శరములను ఇక్కడ గుచ్చుతారు. అప్పటి వరకూ మనకు మార్గం చూపి, వెన్నంట నడిచివచ్చిన కరుప్పస్వామి అక్కడే ఆగిపోతారని ప్రతీతి. శ్రీ మాలికపురత్తమ్మ అమ్మవారు ప్రతి ఏడాది ఏనుగు అంబారి మీద వచ్చి కన్నె స్వాములు గుచ్చిన శరములని చూసి బాధతో వెనుతిరిగి వెళుతుందంట.
ఇంకెప్పుడయ్యా నీ దర్శనం ఇంకెంత ఎంత దూరమయ్యా నీ కొండ అని తలుస్తున్న వేళ
శబరిమాత నిర్గుణోపాసనతో అయ్యప్పస్వామి దర్శనం పొందిన ప్రదేశం దర్శనం ఇస్తుంది. ఆ స్థలమే శబరి కొండ.. భక్తులకు కొండత అండ. ఆ చోటకి చేరగానే అయ్యప్పా.. నా జన్మ దన్యం అన్న భావన కలుగుతుంది. కారణం ఎదుట నిలిచి నీ రాక కోసమే ఎదురు చూస్తున్నా.. నీ జన్మకు సార్థకత కోసమే నేనున్నా అన్నట్టుగా ఎదుట దర్శనమిస్తుంది పదినెట్టాంబడి.
వనయాత్రలో అత్యంత పవిత్రమైనది ఈ పదినెట్టాంపడి ఘట్టం. పవిత్రత నిండిన దైవాంశమైన మూడార్ల సోపానాలనీ, ముక్తికి మెట్లనీ వీటిని అంటారు. మండల కాల దీక్షా వ్రతం లేని వారు ఈ మెట్లను ఎక్కడానికి అనర్హులు. మెట్లు ఎక్కేముందు ఎడమ వైపున కొబ్బరికాయ కొట్టి, కరుప్పస్వామికి మనసారా మొక్కుతూ.. స్వామియే శరణమయ్యప్ప అనే శరుణు ఘోషతో మెట్లెక్కాలి. పదునెట్టాంపడి ఎక్కే సమయంలో ఇరుముడి ఎట్టి పరిస్థితుల్లో తలపైనే ధరించాలి.
అలా ఆ పద్దెనిమిది మెట్లెక్కి అయ్య సన్నిధి లోకి అడుగు పెట్టగానే ఎంతెంత దూరాల నుండి వచ్చామో అన్న విషయమే మరిచిపోతాం. సన్నిదిలోకి చేరగానే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. అనంతరం మణి మండపం, మహా గణపతి, సర్పరాజును దర్శిస్తూ ప్రదక్షిణంగా వస్తే అప్పుడు కనిపిస్తాడు అయ్యప్ప. చిన్ముద్ర దారుడై.. బాల రూపంలో శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప దివ్యమంగళ స్వరూపం సాక్షాత్కరిస్తాడు. ఆ రూపం అద్బుతం అనిర్వచనీయం.. చిన్ముద్ర ధారియై ఉన్న స్వామిని కనులారా వీక్షించి, ఆ స్వరూపాన్ని గుండెల్లో ప్రతిష్ఠించుకుంటా ఇరుముడిని స్వామివారికి చూపించి నెయ్యభిషేకం వైపు కదులుతారు భక్తులు. అనంతరం ఇరుముడి విప్పి మాలికపురత్తమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని కానుకలు, మొక్కులు తీర్చుకుని చల్లగా చూస్తే మళ్ళీ వస్తాం స్వామి అని తిరుపడి కాయ ( కొబ్బరికాయ ) కొట్టి తిరుగు ప్రయాణం అవుతారు.
ఇంతటీ యాత్రలో అడ్డొచ్చే గండాలెన్నో.. ఆ గండాలను దాటిస్తూ ముందు సాగేలా దీవిస్తాడు ఆ దేవదేవుడు అయ్యప్ప. శబరి యాత్రలో పెద్ద పాదం నుండి మొదలు చిన్నపాదం యాత్ర ముగింపు వరకు అలుదా, పంబా పుణ్య నదుల్లో స్నానాలు.. కరిమల గిరులల్లో దట్టమైన వృక్షాల మీదుగా వచ్చే ఔషధ గాలులను పీల్చుకుంటూ సాగే ప్రయాణం అత్యద్బుతం.
ఈ వనయాత్రలో అతి కష్టమైన నడకమార్గ శిఖరాలంటే కరిమల, నీలిమల. అత్యంత కష్టమైన ఈ మార్గాలని దాటేందుకు స్వయంగా స్వామివారే సహాయం చేస్తారని భక్తుల విశ్వాసం. మరో ముఖ్యమైన విషయం.. ఈ వనయాత్ర చేసే భక్తులు, ముఖ్యంగా తొలిసారి వెళ్లే కన్నెస్వాములు, తలపై ఇరుముడి ధరించి మాత్రమే వెళ్లాలి. అలసినసమయంలో ఆ ఇరుముడిని గురు స్వాముల ఆజ్ఞతోనే కిందికి దింపాలి. తలపై ఇరుముడితో చేసే యాత్రనే దివ్యం పలానిస్తుంది. అయితే పెద్ద పాదం శబరిమల ఆలయం తెరిచిన ప్రతిసారీ తెరిచి ఉండదు. కేవలం మకరవిళక్కు సమయంలో తెరిచి.. తిరిగి మకర జ్యోతి అనంతరం ఆ దారిని మూసి వేస్తారు. అక్కడి స్థానికులు సైతం ఆ సమయంలో మాత్రమే ఈ దారిగుండా రాకపోకలు సాగిస్తారు.
ఇక ఈ ఏడాది మండల కాలం ఈ నెల నవంబర్ 16 నుంచి ప్రారంభమైంది. కేరళ ప్రభుత్వం ఈ అటవీ మార్గం గుండా భద్రతా ఏర్పాట్లు కోసం పది లక్షల టెండర్ లను కేటాయించింది. ఈసారి మాత్రం రాత్రిపూట నడక నిషేధం, పగటిపూట కొన్ని ఆంక్షలతో ఈ యాత్రకు కావల్సిన అన్ని సన్నహాలను సిద్ధం చేసింది కేరళ సర్కార్. పెద్ద పాదం మార్గంలో అడవి జంతువుల బెడద రీత్యా రహదారిపై రాత్రి ప్రయాణం, పగటిపూట ప్రవేశ పరిమితులు కొనసాగుతాయని ఎరుమేలి అటవి శాఖ తెలిపింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉందని సూచించింది. అలాగే అడవి జంతువులు ఉనికిని ముందుగా తెలియజేసేలా హెచ్చరికలు, జాగ్రత్తలు వంటి భద్రతా చర్యలు తీసుకునేలా ప్రత్యేకంగా అటవీశాఖకు చెందిన స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇవి అయ్యప్ప వన యాత్ర విశేషాలు.
ఆద్యంత రహితమౌ నీ విశ్వరూపం
అజ్ఞాన తిమిరమ్మునణుచు శుభదీపం
ఈ నాల్గు దిక్కులు పదునాల్గు భువనాలు
పడిమెట్లుగా మారె ఇదో అపురూపం..
అంటూ స్వామిని దర్శించుకుని మురిసిపోయిన భక్తులు అయ్యప్ప ఆజ్ఞాతో మళ్లీ వచ్చే ఏడాది నీ కొండకు వస్తామంటూ తిరుగు ప్రయాణం అవుతారు. స్వామిని దర్శించుకున్న జన్మ ధన్యం.. మళ్లీ మళ్లీ దర్శించుకునే అదృష్టం రావడం మహద్బాగ్యం. స్వామియే శరణమయ్యప్ప.




