AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయ ప్రతిష్ట వేళ మరో అపూర్వ ఘట్టం.. శ్రీరామ అక్షింతలకు పూజా కార్యక్రమం

హైందవ సమాజం కంటున్న సనాతన కల త్వరలోనే సాకారం కానుంది. అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆదిపురుష్‌ రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి వేళయింది... భవ్య ముహూర్తం 22 జనవరి 2024గా నిర్ణయించారు. 

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయ ప్రతిష్ట వేళ మరో అపూర్వ ఘట్టం.. శ్రీరామ అక్షింతలకు పూజా కార్యక్రమం
ఈ మేరకు భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. సాధువులతో సహా ఆహ్వానితులతో పాటు.. 12 వేల నుంచి 15 వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తుంది.
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Nov 03, 2023 | 6:38 PM

Share

రాఘవుడు కొలువు దీరనున్న అయోధ్య రామాలయ ప్రతిష్ట సందర్భంగా మరో అపూర్వ ఘట్టం జరగబోతోంది. రాముని అక్షింతలు… ప్రత్యేక పూజా కార్యక్రమాల తర్వాత దేశంలోని ప్రతి లోగిలికీ చేరబోతున్నాయి. విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రాముడికి సమర్పించిన అక్షింతల్ని దేశవ్యాప్తంగా 5 లక్షల గ్రామాలకు పంపిణీ చెయ్యబోతోంది ట్రస్ట్‌. వీహెచ్‌పీ నేతృత్వంలో జరగబోతోంది ఈ కార్యక్రమం.

హైందవ సమాజం కంటున్న సనాతన కల త్వరలోనే సాకారం కానుంది. అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆదిపురుష్‌ రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి వేళయింది… భవ్య ముహూర్తం 22 జనవరి 2024గా నిర్ణయించారు.

24 మెట్లు ఎక్కితే రామ మందిర ప్రాంగణం, అద్భుతమైన సింహద్వారం, మూడు అంతస్తుల్లో రాఘవుడు కొలువుండే గర్భగుడి… ఎదురుగా వీర భక్త హనుమాన్‌ సన్నిధి . సూర్యోదయం వేళ భానుడి తొలి కిరణాలు రామచంద్రుడికి పాదాలు తాకేలా ఏర్పాటు ఇలా అయోధ్యపురి కోసం సర్వం సిద్ధమైంది.

ఇక జగదాభిరాముడి కొలువుదీరడమే తరువాయి. జనవరి 22న రామయ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ వేడుకలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా పాతిక వేల మంది హిందూ సంఘాల నేతలకు, మరో పాతిక వేల మంది సన్యాసులకు, ఇంకో పదివేల మంది ప్రత్యేక అతిథులకు ఆహ్వానాలు వెళ్తున్నాయి.

నిర్మాణంలోని అయోధ్య రామాలయం..

12 రోజుల పాటు సాగే ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనా. ఈ మహోత్సవాన్ని కనులారా చూడలేని భక్తజనం కోసం మరో ఏర్పాటు చేసింది శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు. స్వామి వారి అక్షింతల్ని దేశంలోని ప్రతీ లోగిలికీ చేర్చే ప్రయత్నం జరుగుతోంది. ఈనెల ఐదున అంటే.. వచ్చే ఆదివారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామ అక్షింతలకు పూజా కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరేసి ప్రతినిధుల్ని ఎంపిక చేసి.. వారి ద్వారా అక్షింతల పంపిణీ షురూ చేస్తారు.

శ్రీ రామ అక్షింతలు అందుకుని తెలంగాణా రాష్ట్ర ప్రతినిధులు సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. శోభాయాత్రగా వెళ్లి వారికి ఘనంగా స్వాగతం పలుకుతారు. ప్రత్యేక వాహనంలో RCI రోడ్, బడంగ్‌పేట్, అల్మాస్ గూడ, మీర్ పేట్, జిల్లెలగూడ మీదుగా అక్షింతల్ని కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయానికి తీసుకొచ్చి… స్వామిజీల సమక్షంలో పూజిస్తారు.

ఈ సందర్భంగా జనవరి 1 నుంచి 15 వరకూ దేశ వ్యాప్తంగా జన జాగరణ కార్యక్రమం జరగనుంది. శ్రీరాముని అక్షింతలు, శ్రీరాముని చిత్రపటంతో పాటు రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతి హిందూ కుటుంబం నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలు అందజేస్తారు. జనవరి 22న బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ప్రతి కుటుంబం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తారు. జన జాగరణలో ఇచ్చిన శ్రీరామ అక్షింతలు నెత్తిపై చల్లుకొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవాలని, ఆ రోజు రాత్రి ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని సూచిస్తోంది ట్రస్ట్.

అటు.. శ్రీరామ అక్షింతలు చేరుకునే 6వ తేదీ సోమవారం కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు భాగ్యనగరంలో భక్తజనం. రాములోరి అక్షింతలకు స్వాగతం పలకడానికి సకల ఏర్పాట్లు చేపట్టింది శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు.