Srisailam Adhaar: శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం.. ఆర్జిత సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి
శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం దేవస్థానంలో ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది.
Srisailam Temple Aadhaar Card: శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం దేవస్థానంలో ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఇకపై శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక దర్శనాలు, పూజల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డును అందజేయాల్సి ఉంటుంది. ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం పాలక మండలి పేర్కొంది. ఆర్జిత సేవల టిక్కెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఆలయం ఈవో లవన్న.
ప్రత్యేక పూజలతో పాటు వీఐపీ బ్రేక్, అభిషేకం టిక్కెట్లకు ఆధార్ కార్డుతో లింకు పెట్టారు అధికారులు. స్వామివారి ఆర్జిత టిక్కెట్లు దుర్వినియోగం అవుతున్నందుకే ఈ నిబంధన తెచ్చినట్లు చెబుతున్నారు ఆలయ అధికారులు. ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో, కరెంట్ బుకింగ్ ద్వారా పొందే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు ఈవో. ఈ సౌకర్యాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారాయన. ఆర్జిత సేవల టికెట్ల కోసం నేరుగా దేవస్థానంలో సంప్రదించాలని, దళారులను నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు ఈవో లవన్న. టికెట్ల విషయంలో ఏమైనా ఇబ్బందులు వస్తే ఆలయ అధికారులకు తెలపాలని సూచించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు ఈవో లవన్న.
అటు కొవిడ్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది దేవస్థానం. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మాస్కు ధరిస్తేనే మల్లన్న దర్శనం కల్పించాలని నిర్ణయించారు ఆలయ ఈవో లవన్న. ఇటీవల కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారాయన. భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని, కొవిడ్ నిబంధనలు పాటించాలని మైక్ ద్వారా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సూచనలు చేస్తున్నట్లు తెలిపారు ఈవో. మాస్కు ధరించకుండా శ్రీశైలం వీధుల్లో తిరిగేవారికి 100 రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు లవన్న. భక్తులకు టెంపరేచర్ చెక్ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు ఆలయ అధికారులు.
Read Also… Gold and Silver Price Today: గ్రాముకి ఒక రూపాయి తగ్గిన పసిడి ధర, స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు..