AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీపై బిజెపి కన్ను.. ఆకర్ష్ ప్లాన్ అదుర్స్

ఆ రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీని వీక్ చేస్తున్నాయి.. ఇది నిన్నటి మాట. ఇప్పుడు ఆ రెండు పార్టీలే ఆకర్ష్‌ స్కీమ్‌లో నువ్వా నేనా అనుకునే పరిస్థితి. ఇది నేటి మాట. ఎస్.. ఈ వార్త బిజెపి, వైసీపీల గురించే. అయితే.. ఈ ఆకర్ష్‌ ఆపరేషన్‌‌లో ప్రస్తుతం బిజెపిదే దూకుడు కనిపిస్తోంది. సూత్రధారి బిజెపి అధిష్టానం అయితే.. కీలక పాత్రధారి మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి అని క్లియర్ కట్‌గా కమలం పార్టీ నుంచి సంకేతాలు […]

వైసీపీపై బిజెపి కన్ను.. ఆకర్ష్ ప్లాన్ అదుర్స్
Rajesh Sharma
| Edited By: Nikhil|

Updated on: Nov 22, 2019 | 4:30 PM

Share

ఆ రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీని వీక్ చేస్తున్నాయి.. ఇది నిన్నటి మాట. ఇప్పుడు ఆ రెండు పార్టీలే ఆకర్ష్‌ స్కీమ్‌లో నువ్వా నేనా అనుకునే పరిస్థితి. ఇది నేటి మాట. ఎస్.. ఈ వార్త బిజెపి, వైసీపీల గురించే. అయితే.. ఈ ఆకర్ష్‌ ఆపరేషన్‌‌లో ప్రస్తుతం బిజెపిదే దూకుడు కనిపిస్తోంది. సూత్రధారి బిజెపి అధిష్టానం అయితే.. కీలక పాత్రధారి మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి అని క్లియర్ కట్‌గా కమలం పార్టీ నుంచి సంకేతాలు అందుతున్నాయి. మొన్నటి వరకు టిడిపి నేతలతో రహస్య మంతనాలు కొనసాగించిన సుజనా చౌదరి ఇప్పుడు పార్లమెంటు సెషన్ వేదికగా వైసీపీ ఎంపీలకు గాలమేసే పనిలో పడ్డారట.

న్యూఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా హస్తినలోనే మకాం వేశారు. సుజనాచౌదరి తన యాక్షన్ ప్లాన్‌కు ఈ సెషన్‌లోనే శ్రీకారం చుట్టారు. అంతకు ముందు టిడిపికి చెందిన వల్లభనేని వంశీ, కరణం బలరామ్ తదితరులతో సుదీర్ఘ మంతనాలు సాగించిన సుజనా చౌదరి తాజాగా చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కాక పుట్టిస్తోంది. వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు బిజెపికి టచ్‌లో వున్నారన్నది సుజనా చేసిన ప్రకటన సారాంశం.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షం (వైసీపీ) నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని సుజనాచౌదరి వెల్లడించారు. వైసీపీ నుంచి తొమ్మిది మంది కాదు.. మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు తమ టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. అయితే వారు తమతో సత్సంబంధాలు పెట్టుకుంటున్నా.. ఇప్పటికిప్పుడు బీజీపీలో చేర్చుకోబోమని, తగిన సమయం, సందర్భం వచ్చినప్పుడే పార్టీలో వారిని చేర్చుకుంటామన్నారు. టచ్‌లో ఉన్న ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరని ప్రశ్నించగా ఇప్పుడు చెప్పడం అప్రస్తుతమని బదులిచ్చారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఢిల్లీ వచ్చి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారన్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ.. ఇప్పటి నుంచే తాము పార్టీల పొత్తుల కోసం వెంపర్లాడడం లేదని, ఆ అవసరం కూడా ఇపుడు తమకు లేదన్నారు. పవన్‌ ఎవరితో మాట్లాడుతున్నారు.. తమ పార్టీలో ఎవరి టచ్‌లో ఉన్నారో తనకు మాత్రం తెలియదని, తనతో మాత్రం టచ్‌లో లేరని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాధికారం చేపట్టి దిశగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెప్పారు.

సుజనా ప్రకటనతో ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. అధికార పార్టీ ఎంపీలను బీజేపీ టార్గెట్‌ చేసినట్టు క్లియర్‌గా అర్థమవుతోంది. దాదాపు 20 మంది ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది. బీజేపీలో చేరేందుకు వారు సిద్ధంగా ఉన్నా, సమయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు సుజనాచౌదరి. దీంతో అధికార వైసీపీలో కలకలం మొదలైంది. దీంతో బీజేపీతో టచ్‌లో ఉన్న ఎంపీలు ఎవరని అధికార వైసీపీలో గుబులు మొదలైంది.

సుజనాచౌదరికి తోడుగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా ఇతర పార్టీల నేతలు తమతో టచ్‌లో వున్నారని అన్ని పార్టీ నేతలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని 2024లో అధికారంలోకి రావడమే లక్ష్యమన్నారు వీర్రాజు.

బిజెపి నేతల ప్రకటనల నేపథ్యంలో అందరి కంటే ముందు అందరి దృష్టి నర్సాపురం నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజుపైనే పడింది. దానికి కారణం ఇటీవల తనకు ఎదురు పడిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ రఘురామకృష్ణంరాజునుద్దేశించి.. ‘‘రాజు గారు’’ అంటూ పలకరించడమే. రఘురామకృష్ణంరాజు గతంలో బిజెపిలో కొంతకాలం పనిచేసినందునే ఆ పరిచయంతో మోదీ ఆయన్ను పలకరించినట్లు తెలుస్తోంది.

అది.. ప్రధాని సంస్కారం

పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో ప్రధాని మోదీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు భుజం మీద చెయ్యేసి.. ‘రాజు గారూ’ అంటూ ఆప్యాయంగా పలకరించినట్లు వచ్చిన వార్తలను ప్రస్తావించగా.. ‘నమస్కారం పెడితే.. ప్రతి నమస్కారం చేయడం ప్రధాని మోదీ సంస్కారం. అంతమాత్రాన ఏదో ఊహించుకోవడం సరికాదు’ అని సుజనా పేర్కొన్నారు.

మొత్తానికి బిజెపి నేతల దూకుడు అధికార వైసీపీలో కలవరం సృష్టిస్తోంది. ఎంపీలు ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటున్న పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని పేరు ప్రస్తావించడానికి ఇష్టపడని ఓ వైసీపీ ఎంపీ మీడియా ముందు వాపోయారు.