కిరణ్ రీ-ఎంట్రీపై జోరుగా కథనాలు..ఇంతకీ నిజమేంటంటే?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. బిజెపిలో ఆయన చేరుతున్నారని కొందరు అంటుంటే.. మరికొందరు కాదు..కాదు.. కిరణ్ కుమార్ రెడ్డి ఏపిసిసి అధ్యక్షుడు కాబోతున్నారని కథనాలు అల్లుకుని మరీ రాసేస్తున్నారు. ఇంతకీ కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారు ? అసలాయన వ్యూహం ఏంటి ? టీవీ9 వెబ్‌సైట్ ప్రతినిధికి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్పారు ? రీడ్ దిస్ స్టోరీ.. నల్లారి […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. బిజెపిలో ఆయన చేరుతున్నారని కొందరు అంటుంటే.. మరికొందరు కాదు..కాదు.. కిరణ్ కుమార్ రెడ్డి ఏపిసిసి అధ్యక్షుడు కాబోతున్నారని కథనాలు అల్లుకుని మరీ రాసేస్తున్నారు. ఇంతకీ కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారు ? అసలాయన వ్యూహం ఏంటి ? టీవీ9 వెబ్‌సైట్ ప్రతినిధికి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చెప్పారు ? రీడ్ దిస్ స్టోరీ..
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. స్పీకర్‌గా వున్న కిరణ్ కుమార్ రెడ్డి చాప కింద నీరులా పైరవీ చేసుకుని, ఏకంగా ముఖ్యమంత్రి పదవి కొట్టేశారు. సీఎం సీటు కోసం ఆయన చేసిన సీక్రెట్ ఆపరేషన్ ఇప్పటికీ రహస్యమే. హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ వెళితే పార్టీ వర్గాలు, మీడియా కూపీ లాగుతాయని.. అత్యంత రహస్యంగా బెంగళూరు, చెన్నైల మీదుగా ఢిల్లీకి ఆయన జరిపిన పర్యటనల గురించి మీడియా మిత్రులు ఇప్పటికీ చర్చించుకుంటూనే వుంటారు.
ఏకంగా ముఖ్యమంత్రిగా సీల్డ్ కవర్ రూపంలో హైదరాబాద్‌లో ల్యాండయ్యే వరకు సూపర్ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి.. మంచి వ్యూహకర్తగా పేరుపొందిన కిరణ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర విభజన సందర్భంలో పేలవమైన పాలిటిక్స్ ప్లే చేసి.. ఆల్‌మోస్ట్ అందరిలో చులకనయ్యారు. చివరికి కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్రం విడిపోయిన సందర్భంలో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి.. దానికి చెప్పు గుర్తు తెచ్చుకుని గమ్మత్తైన పాలిటిక్స్ చేశారు. చివరికి 2014 ఎన్నికల తర్వాత అంతర్ధానమైపోయారు. అడపాదడపా.. హైదరాబాద్ కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు దగ్గర మార్నింగ్ వాక్‌లో కొందరికి కనిపించారు కిరణ్ కుమార్ రెడ్డి. ఇక ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రారు అని చాలా మంది ఫిక్సయిపోయారు.
కానీ.. ఇటీవల ఆయన పేరు మీడియాలోను, సోషల్ వెబ్ సైట్లలోను తెగ నానుతోంది. కిరణ్ కుమార్ బిజెపిలో చేరుతున్నారని కొందరు.. కాదు కాంగ్రెస్ పార్టీలోనే చేరుతున్నారని మరికొందరు కథనాలు రాసేశారు. గురువారం అయితే ఏకంగా ఏపీసీసీ అధ్యక్షుడుగా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపడుతున్నారంటూ కథనాలొచ్చాయి. దానికితోడు తిరుపతి విమానాశ్రయంలో కొందరు ఆయన రాక సందర్భంగా హడావిడి కూడా చేశారు.
అయితే.. ఈ కథనాలపై కిరణ్ కుమార్ రెడ్డిని సంప్రదించింది టీవీ9 వెబ్ సైట్.. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే…
కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి తనకు పార్టీ చేరాలని, తగిన పదవితో గౌరవిస్తామని ఆఫర్ వచ్చిందని కిరణ్ కుమార్ తెలిపారు. అయితే.. తనకు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరే ఉద్దేశం ఏమీ లేదని సున్నితంగా తప్పించుకున్నారు కిరణ్. అదే సమయంలో బిజెపి నుంచి కూడా కొన్ని సంకేతాలు వచ్చినా ఏ నిర్ణయం ఇంకా తీసుకోలేదని కిరణ్ కుమార్ చెబుతున్నారు. అయినా.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అటు జాతీయ స్థాయిలోను, ఇటు రాష్ట్ర స్థాయిలోను ఏమంత ఆశాజనకంగా లేనపుడు తానెందుకు ఆ పార్టీలో చేరతానని అంటున్నారాయన. సో.. వచ్చే ఎన్నికల దాకా ఇలాగే ఐడియల్‌గా వుండాలన్నదే తన అభిమతమని, ఆ తర్వాత పరిణామాలు, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నదే కిరణ్ కుమార్ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.