AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్లు… ఇవీ వికాస్‌ దూబే నిత్య కృత్యాలు

ఇటు రాజకీయనాయకులతో, అటు పోలీసులతో సత్సంబంధాలు పెట్టుకుని అంచెలంచెలుగా ఎదిగిన వికాస్‌ దూబేను ఊరివాళ్లు పండిట్‌జీ అని పిల్చుకుంటారు.

హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్లు... ఇవీ వికాస్‌ దూబే నిత్య కృత్యాలు
Balu
|

Updated on: Jul 04, 2020 | 4:58 PM

Share

VikasDubey a criminal for police but Panditji for villagers: వికాస్‌ దూబే..! ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసులను పొట్టనపెట్టుకున్న నరరూప రాక్షసుడు.. కన్నతల్లి సైతం ఈసడించుకునేంత దుర్మార్గుడు.. పోలీసుల దృష్టిలో కరుడుకట్టిన నేరస్తుడు.. అయితే కాన్పూర్‌లోని అతగాడి సొంత ఊరుకు వెళితే మాత్రం భిన్నస్వరాలు వినిపిస్తాయి.. ఇటు రాజకీయనాయకులతో, అటు పోలీసులతో సత్సంబంధాలు పెట్టుకుని అంచెలంచెలుగా ఎదిగిన వికాస్‌ దూబేను ఊరివాళ్లు పండిట్‌జీ అని పిల్చుకుంటారు. ఎనిమిది మంది పోలీసు అధికారులను, పోలీసులను కాల్చి చంపాడన్న సంగతే తమకు తెలియదని కొందరు గ్రామస్తులు చెప్పడం విశేషం.

అక్కడ ఏ ఎన్నిక జరిగినా సాయం కోసం రాజకీయపార్టీలన్నీ వికాస్‌ దూబే ఇంటిచుట్టూ తిరుగుతాయి.. అసలు గ్రామ ప్రధాన్‌ పదవిలో ఎవరున్నా.. ఏ పార్టీవాడున్నా దూబే కుటుంబ కనుసన్నలలో మెలగాల్సిందే! కాదూ కూడదంటే ఖతమే! వివిధ రాజకీయ నేతలతో కలిసి వికాస్‌ దూబే దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. భయం వల్లో, మరో కారణం వల్లో తెలియదు కానీ ఊళ్లో అన్ని వర్గాల ప్రజలు వికాస్‌కు కాసింత గౌరవం ఇస్తారు.. పలుకుబడి ఉన్న నేతగా భావిస్తుంటారు.. పండిట్‌జీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రనియాన్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు దారులు కూడా వేసుకున్నాడు వికాస్‌.. ఎస్పీ, బీఎస్పీకి చెందిన నేతలు ఇతడితో సన్నిహితంగా మెలిగేవారు. ఆ మాటకొస్తే బీజేపీ వారితో కూడా ఇతడికి సఖ్యత ఉంది.

వికాస్‌ దూబే చేసిన నేరాలు పేపర్లలో చదివాకే తెలిశాయని, ఊళ్లో చిన్నపాటి నేరం కూడా అతడు చేయలేదని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. గ్రామ ప్రధాన్‌ పదవిలో ఉన్నప్పుడు పేదలకు ఎంతో సాయం చేశాడట పెళ్లిళ్లు పేరంటాలు తన సొంత ఖర్చుతో జరిపించాడట! ఎంతో మందిని ఆర్ధికంగా ఆదుకున్నారట! అతడి మంచితనమంతా ఊరు వరకే.. తవ్వి తీయాలే కానీ అతడికి బోలెడంత నేర చరిత్ర ఉంది. హత్యలు, దోపిడీలు, లూటీలు, అత్యాచారాలు.. ఒకటేమిటి సమస్త నేరాలు చేశాడు.. వికాస్‌ దూబే మీద 65కు పైగా క్రిమినల్‌ కేసులున్నాయంటే ఎంత కరుడుకట్టినవాడో అర్థమవుతుంది. అనేక కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.. జైలులో ఉంటూనే శివరాజ్‌పుర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. రాజకీయంలో రౌడీయిజాన్ని మిక్స్‌ చేసి చెలరేగిపోయాడు.

17 ఏళ్ల వయసులోనే మర్డర్‌ చేసిన వికాస్‌ దూబే అటు పిమ్మట అనేక నేరాలకు పాల్పడ్డాడు. 2000 సంవత్సరంలో తారాచంద్‌ ఇంటర్‌ కాలేజీ ఉద్యోగి సిద్ధేశ్వర్‌ పాండేను దారుణంగా హత్య చేశాడు.. కారణం మామూళ్లు ఇవ్వలేదనే! ఆ మరుసటి ఏడాది ఉత్తరప్రదేశ్‌కే చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు, అప్పటి ఆ రాష్ట్ర మంత్రి సంతోష్‌శుక్లాను కూడా చంపేశాడు.. ఈ మర్డర్‌ తర్వాత వికాస్‌ దూబే ఎవరన్నది దేశమంతటా తెలిసి వచ్చింది. వికాస్‌కు భయపడి సంతోష్‌శుక్లాకు అనుకూలంగా ఎవరూ సాక్ష్యం చెప్పలేదు. దాంతో నిర్దోషిగా అతడు జైలు నుంచి బయటకు వచ్చాడు. తర్వాత మరింత రెచ్చిపోయాడు.. తనకు పోటీగా వస్తున్నాడన్న ఈర్ష్యతో దగ్గర బంధువు అనురాగ్‌ పత్నితో పాటు అతడి నలుగురు ముఖ్య అనుచరులను దారుణంగా చంపేశాడు.. 2000 సంవత్సరంలో ప్రముఖ రాజకీయ నాయకుడు రామ్‌బాబు యాదవ్ హత్య కేసులో వికాస్ జైలుకు వెళ్లాడు. 2004లో జైల్లో ఉంటూనే తన సమీప బంధువు దినేష్ దూబేని చంపించాడు.. తనకు పోటీగా వస్తున్నాడన్న అక్కసే ఇందుకు కారణం.

స్థానిక పోలీసులలో చాలా మందితో వికాస్‌కు సన్నిహితంగా మెలిగేవాడు. కొందరు ఇన్‌ఫార్మర్లుగా కూడా వ్యవహరించారు. అన్నట్టు ఊళ్లో వికాస్‌ దూబే కుటుంబీకులెవరూ ఉండరు.. అతడి భార్య, ఇద్దరు పిల్లలు లక్నోలోని కృష్ణనగర్‌లో నివాసముంటున్నారు. ఆమె కూడా సమాజ్‌వాదీ పార్టీలో సభ్యురాలు. వికాస్‌ వెంట ఎప్పుడూ పాతికమంది యువకులు ఉండేవారు.. వారి ఖర్చులు గట్రాలు అన్నీ వికాసే చూసుకునేవాడు.. ఇప్పుడు ఊళ్లో వికాస్‌ కంటూ ఓ ఇల్లు కూడా లేకుండా పోయింది. కారణం ఇంటిని పోలీసులు కూల్చివేయడమే! ఇల్లు కూల్చడమే కాదు.. దొరికితే చంపేయాలన్న కసితో ఉన్నారు పోలీసులు.. ఆచూకి చెప్పినవారికి నగదు బహుమతి కూడా అందిస్తామని అనౌన్స్‌ చేశారు..