AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TELANGANA POLITICS: దూకుడుగా తెలంగాణ పార్టీలు.. నెల రోజుల వ్యవధిలో ముగ్గురు బీజేపీ అగ్ర నేతల రాక.. రాహుల్ డిక్లరేషన్‌తో జనంలోకి కాంగ్రెస్

నెల రోజుల వ్యవధిలో జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మే ఆరవ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్, హైదరాబాద్ నగరాల్లో పర్యటించారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా కొన్ని హామీలతో కూడిన వరంగల్ డిక్లరేషన్ అంశాలను బహిరంగ సభ వేదికగా వెల్లడించారు.

TELANGANA POLITICS: దూకుడుగా తెలంగాణ పార్టీలు.. నెల రోజుల వ్యవధిలో ముగ్గురు బీజేపీ అగ్ర నేతల రాక.. రాహుల్ డిక్లరేషన్‌తో జనంలోకి కాంగ్రెస్
Telangana Politics
Rajesh Sharma
|

Updated on: May 19, 2022 | 8:39 PM

Share

Telangana Politics heating further Prime Minister Narendra Modi to arrive in: తెలంగాణ పాలిటిక్స్ మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార, విపక్షాల నేతల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు విమర్శలు, ఆరోపణలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒకరు ఒకరోజు మాట్లాడితే మర్నాటి వరకు కూడా ఆగకుండా అదే రోజు ప్రత్యర్థి మాటలను తిప్పికొట్టేందుకు సిద్దమవుతున్నారు రాజకీయ నాయకులు. ఈక్రమంలో నెల రోజుల వ్యవధిలో జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మే ఆరవ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వరంగల్(warangal), హైదరాబాద్(hyderabad) నగరాల్లో పర్యటించారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా కొన్ని హామీలతో కూడిన వరంగల్ డిక్లరేషన్ అంశాలను బహిరంగ సభ వేదికగా వెల్లడించారు. రాహుల్ గాంధీ పర్యటన ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) నేతలు పల్లె బాట పట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇటు తెలంగాణాలో అధికారాన్ని సాధిస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్న బీజేపీ కూడా మరింత దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నెల రోజుల వ్యవధిలో బీజేపీ(Telangana Bjp) అగ్రనేతలు రాష్ట్రానికి రావడం కమలనాథుల దూకుడుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఏప్రిల్ 14న టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjya) చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రలో పలువురు జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మే 5వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా(JP Nadda) తెలంగాణలో పర్యటించారు. మహబూబ్‌నగర్ జిల్లా( Mahabubnagar district) భూత్పూర్ సమీపంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కేసీఆర్(CM KCR) ప్రభుత్వంపై సమర శంఖం పూరించారు. ఆయన వచ్చి వెళ్ళిన వారం రోజులకు అంటే మే 14వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద భారీ ఎత్తున నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా(Amit Shah) ప్రసంగించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు జాతీయ నేతలు రానవసరం లేదని, కేసీఆర్‌ను ఓడించేందుకు బండి సంజయ్ ఒక్కరే చాలన్నారు అమిత్ షా. నడ్డా, అమిత్ షా పర్యటనతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తింది. ఇదిలా కొనసాగుతుండగానే.. తెలంగాణకు ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాక ఖరారు కావడంతో కమలం పార్టీలో మరింత ఉత్సాహం వ్యక్తమవుతోంది. నిజానికి మోదీ(PM modi) అధికారిక పర్యటనకు వస్తున్నారు. ఆయన రాక పార్టీ పరంగా కాదు. మే 26న మోదీ రానున్న నేపథ్యంలో దానిలో పార్టీ కార్యక్రమాలను జోడస్తారా అన్నదింకా తేలలేదు. కానీ అవకాశమైతే వుంది. మే 26న హైదరాబాద్ రానున్న ప్రధాని.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ Indian School of Business #ISB కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని రాకను పార్టీ పరంగానూ వాడుకునేందుకు తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇలా ఒక్క మే నెలలోనే ముగ్గురు జాతీయ నేతలు అది కూడా అగ్ర నేతల రాక తెలంగాణ బీజేపీలో కదనోత్సాహాన్ని నింపుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో మూడు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి చక్రం తిప్పుతూ వ్యూహాలు రచిస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎప్పుడో అధికారంలోకి రావాల్సిన వాళ్ళమంటూ కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాలే హైలైట్‌గా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత ఎన్నికల్లో (2018) కేవలం ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే (రాజాసింగ్)ని గెలిపించుకున్న భారతీయ జనతా పార్టీ  (Bharatiya Janata Party)ఆ తర్వాత కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతోను, జాతీయస్థాయిలో పెరిగిన నరేంద్ర మోదీ Narendra Modi చరిష్మాతోను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతోంది. ముందుగా చెప్పుకోవాలంటే అధికార టీఆర్ఎస్ గురించే చెప్పుకోవాలి. జాతీయ స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టి.. మోదీకి వ్యతిరేకంగా లైక్ మైండెడ్ పీపుల్‌ని ఒక్కటి చేయాలని చూస్తున్న కేసీఆర్.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇన్‌పుట్స్ ఆధారంగా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. జాతీయాంశాలపై ఒక డ్రాఫ్టు రూపొందించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, జాతీయాంశాలపై పట్టున్న వారిని ఇటు హైదరాబాద్ ప్రగతి భవన్‌కు, అటు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కు పిలిపించుకుని సుదీర్ఘంగా మంతనాలు కొనసాగిస్తున్నారు. వారి అభిప్రాయాలతో పాయింట్లను సిద్దం చేసుకుంటున్నారు. అదేసమయంలో జాతీయ స్థాయిలో బీజేపీని ఇరకాటంలో పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా జరిగిన రైతు సమాఖ్య ఆందోళనలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు వెళుతున్నారు. ఒక్కో మృతుని కుటుంబానికి మూడు లక్షల రూపాయలను కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వం తరపున అందించబోతున్నారు. కేసీఆర్ జాతీయాంశాలపై దృష్టి సారించిన నేపథ్యంలో.. తెలంగాణ పాలిటిక్స్‌కు సెంటర్‌గా మారిన మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీ నేతలను ఓ ఆటాడుకుంటున్నారు. పదునైన పదజాలంతో రెండు పార్టీల నేతలను చీల్చి చెండాడుతున్నారు. కొన్ని సార్లు ఆయన ప్రయోగిస్తున్న పదజాలం సోషల్ మీడియాలో విమర్శల పాలవుతున్నా.. తగ్గేదేలే అంటున్నారు కేటీఆర్. తాజాగా ఆయన దావోస్ సదస్సులో పాల్గొనేందుకు విదేశీ పర్యటనకు వెళ్ళడంతో తెలంగాణలో ఆరోపణల పర్వానికి కాస్త బ్రేక్ పడింది.

ఇక రేవంత్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత యాక్టివేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలపై పోరాటం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి.. తనదైన శైలిలో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. అదేసమయంలో పార్టీలోకి కొత్త నేతలను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త నేతలకు గాలమేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కుటుంబాన్ని మే 19న న్యూఢిల్లీలో అగ్రనేత ప్రియాంక గాంధీ వధేరా సమక్షంగా కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. మే 6వ తేదీన రాహుల్ గాంధీ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు టీపీసీసీ కార్యాచరణ రూపొందించింది. ముఖ్య నేతలంతా పల్లెబాట పట్టాలని టీపీసీసీ ఆదేశించింది. వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన హెచ్చరిక కూడా టీ.కాంగ్రెస్ నేతల్లో కదలిక తీసుకువచ్చింది. పార్టీ కార్యాలయాల్లో వుండే వారికి కాదు.. ప్రజల్లో వుండేవారికే పార్టీ టిక్కెట్లంటూ రాహుల్ గాంధీ ఓరుగల్లులో ప్రకటించారు. దాంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్న నేతలిపుడు పల్లె బాటపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఓవైపు వరంగల్ డిక్లరేషన్ అంశాలు.. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో ప్రచారం చేసేందుకు టీపీసీసీ సిద్దమైంది. ఇందుకు కావాల్సిన స్టడీ మెటీరియల్ పార్టీ నేతలకు పంపిణీ చేస్తున్నారు గాంధీ భవన్ వర్గాలు.

ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత పేలవమైన ప్రదర్శన చేసిన భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల విజయాలిచ్చిన ఉత్సాహంతో దూకుడు పెంచారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా బండి సంజయ్ Bandi Sanjay ఎంపిక అయిన తర్వాత పార్టీ వర్గాలను నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేరిట పరుగులు పెట్టిస్తున్నారు. ఓవైపు బండి సంజయ్ క్యాంపు.. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్యాంపు.. తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరికెవరు తీసిపోమన్నట్లుగా ఈ రెండు క్యాంపుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రెండో విడత ప్రజా సంగ్రామ పాద యాత్రను ముగించుకున్న బండి సంజయ్ అదే దూకుడుగా మరిన్ని కార్యక్రమాలకు కార్యాచరణ చేస్తున్నారు. నడ్డా, అమిత్ షాల రాక తర్వాత వచ్చే మూడు నెలల కార్యక్రమాల రూపకల్పనకు కమలనాథులు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ రానుండడంతో దానికి పొలిటికల్ మైలేజీకి వాడుకునేందుకు బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీలైతే పార్టీ కార్యాలయానికి మోదీని రప్పించి, సమావేశంతో కీలక నేతలకు దిశానిర్దేశం ఇప్పించాలని అనుకుంటున్నట్లు సమాచారం. లేని పక్షంగా ఎయిర్ పోర్టులోనే రాష్ట్ర స్థాయి నేతలు, జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి మోదీతో గైడ్‌లైన్స్ ఇప్పించాలనుకుంటున్నారని బీజేపీ కార్యాలయ వర్గాలంటున్నాయి. ఏది ఏమైనా మోదీ కూడా తన హైదరాబాద్ (Hyderabad) పర్యటనలో పార్టీకి కాస్త సమయమిచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకునేలా తెలంగాణ (Telangana) కమలం నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.