Telangana, AP MLC Elections 2021 updates : పలు చోట్ల ఘర్షణలు, ఉద్రిక్తతల నడుమ ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
Telangana, AP MLC Elections 2021 updates : పలు చోట్ల ఘర్షణలు, ఉద్రిక్తతల నడుమ ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, 50 శాతం నమోదయ్యే ఛాన్స్..
Telangana and AP Graduate MLC Elections 2021 updates : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా సాగింది. వరంగల్, ఖమ్మం,నల్గొండ నియోజకవర్గంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు 44 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి ఈ మూడు జిల్లాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే మధ్యాహ్నం ఇక్కడ పోలింగ్ మందగించింది. పోలింగ్ ముగిసే సమయం నాటికి 50 శాతం నమోదు అయ్యే అవకాశం కన్పిస్తోంది.
మరోవైపు భువనగిరిలో ఎమ్మెల్సీ పోలింంగ్ సెంటర్ పక్కనే టిఫిన్ సెంటర్ అడ్డగా చేసుకుని టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే వ్యాఖ్యలు కలకలం రేపాయి. మరోవైపు, భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ అంజనేయులు ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం రెండు గంటలవరకు 40 శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి కేటీఆర్. ఇంట్లో బయల్దేరే ముందు గ్యాస్ సిలిండర్‌కు మొక్కి వచ్చానన్న కేటీఆర్..అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని గెలిపించాలని కోరారు..మలక్‌పేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు హోంమంత్రి మహమూద్ అలీ
ఇటు బీజేపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి హైదరాబాద్‌లో ఓటు వేశారు. ఇటు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషనర్.
తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలనుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు భారీగా ఇండిపెండెంట్లు బరిలో నిలవడంతో జంబో బ్యాలెట్‌తో ఓటింగ్ ఆలస్యమైంది. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మోస్తరుగా సాగింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. అటు, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాలకు ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం బారులు తీరారు ఓటర్లు.
LIVE NEWS & UPDATES
-
ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, ఉదయం ముమ్మరం, మధ్యాహ్నం మందగమనం
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా సాగింది. వరంగల్, ఖమ్మం,నల్గొండ నియోజకవర్గంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు 44 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి ఈ మూడు జిల్లాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే మధ్యాహ్నం ఇక్కడ పోలింగ్ మందగించింది. పోలింగ్ ముగిసే సమయం నాటికి 50 శాతం ఓట్లు నమోదు అయ్యే అవకాశం కన్పిస్తోంది.
-
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్నాగేశ్వర్
హైదరాబాద్ హిమయత్ నగర్‌లోని ఉర్దూ పాఠశాలలో మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్నాగేశ్వర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ పోలింగ్‌లో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు నాగేశ్వర్. కొవిడ్ నిబంధనలను పాటించి పోలింగ్ లో పాల్గొనాలని ఆయన ఓటర్లకు సూచించారు.
-
-
ఓటు హక్కు వినియోగించుకున్న హరిప్రియ నాయక్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా టేకులపల్లి గవర్నమెంట్ కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్ లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకొన్న ఇల్లెందు నియోజకవర్గం ఎమ్మెల్యే, గులాబీ పార్టీలోని ఎమ్మెల్యేలలో అతి చిన్న వయస్కురాలైన బనోత్ హరిప్రియ నాయక్.
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన, పోలింగ్ సరళిపై ఆరా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. ఈ ఉదయం నుంచి ప్రారంభమైన పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ సరళిని స్థానిక నాయకులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఓటింగ్ తీరును ఆరా తీశారు. ప్రత్యేకించి ఓటింగ్ ఎలా జరుగుతోంది, ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారా… అనే విషయాలను ఆయన, స్థానిక నాయకులు, కార్యకర్తలతో అడిగి తెలుసుకున్నారు. అటు, పాలకుర్తి నియోజక వర్గంలోనూ మంత్రి పర్యటించారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి, నెక్కొండ, వరంగల్ అర్బన్‌జిల్లా, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్ద వంగర, జనగామ జిల్లా కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పల, జనగామ తదితర ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. పోలింగ్ ఎక్కువగా జరిగే విధంగా చూడాలని స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
-
ప.గో జిల్లాలో ప్రశాంతంగా ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మొత్తం 11మంది బరిలో ఉన్న ఈ ఎన్నికకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో 7,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీరిలో పురుషులు 4,716, మహిళలు 3,049 మంది ఉన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 49 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది మండలానికి ఒకటి చొప్పున 48 పోలింగ్ కేంద్రాలు, ఏలూరులో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సెయింట్ జేవియర్ స్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
-
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలపై దర్యాప్తు చేసి, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం : ఎన్నికల చీఫ్ అబ్జార్వర్ శశాంక్ గోయల్
టీఆర్ఎస్ అభ్యర్థి పీవీ వాణిదేవికి మద్దతు ప్రకటిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల రోజు బాంబు పేల్చిన నేపథ్యంలో సదరు వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలపై దర్యాప్తు చేస్తామని, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని ఎన్నికల చీఫ్ అబ్జార్వర్ శశాంక్ గోయల్ తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వ్యాఖ్యలపై ముఖ్యంగా దర్యాప్తు చేస్తామన్నారు. ఆదివారం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
-
కృష్ణా – గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 111 కేంద్రాల్లో పోలింగ్
కృష్ణా – గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. రెండు జిల్లాల్లో మెుత్తం 111 పోలింగ్ కేంద్రాల్లో13,505 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు.
-
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతం
పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. చింతలపూడి సర్కస్ పరిధిలోని చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టీ నరసాపురం మండలాల్లో 345 మంది ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సౌకర్యాలు కల్పించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
-
కృష్ణాజిల్లా అవనిగడ్డలో మందకొడిగా పోలింగ్
కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 వరకు 40 శాతం నమోదైంది. అవనిగడ్డ డి.ఎస్.పి మహబూబ్ బాషా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అయితే, కొన్ని కేంద్రాల్లో ఓటింగ్ వేసే ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వెలవెలబోవడం కనిపించింది.
-
కేటీఆర్‌కు రాజాసింగ్ కూడా కౌంటర్, తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని హాట్ కామెంట్
ఓటు వేసేందుకు వచ్చేముందు గ్యాస్ సిలిండర్ కు మొక్కి వచ్చానంటూ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా స్పందించారు. కేటీఆర్ మొక్కాల్సింది భైంసా హిందువుల కాళ్లు అని, గ్యాస్ సిలిండర్‌కు కాదని ఫైర్ అయ్యారు. కేటీఆర్ లాంటి మంత్రి దొరకడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని తీవ్రంగా విరుచుకుపడ్డారు. హిందువులపై జరుగుతున్న దాడులు కేటీఆర్‌కు ఏమాత్రం కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా ఉందని ఫైర్ అయ్యారు. నాస్తికుడైన కేటీఆర్ సిలిండర్‌కు మొక్కి ఓటు వేశాననడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల సమస్యలపై కొట్లాడే వ్యక్తులకే ఓటు వేయాలని రాజాసింగ్ కోరారు.
-
నల్లగొండలో టీఆర్‌ఎస్ – బీజేపీ నేతల మధ్య ఘర్షణ
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నల్లగొండ నాగార్జున డిగ్రీ కళాశాల బూత్ నెం 30 లో ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ ఏజెంట్‌పై చేయి చేసుకోవడంతో కోలాహల వాతావరణం నెలకొంది. గుర్తింపు కార్డు లేకుండా ఎలా ఏజెంట్‌గా కూర్చున్నారంటూ బీజేపీ ఏజెంట్‌పై టీఆర్‌ఎస్ నేతలు చేతికి పనిచెప్పారు. దీంతో తోపులాట జరిగి పరిస్థితి అదుపు తప్పింది. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు భారీగా పోలింగ్ బూత్ దగ్గరకు చేరుకోవడంతో పరిస్థితిని అదుపులో తేవడానికి పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
-
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఘర్షణ, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి.!
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేళ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలింగ్ కేంద్రం దగ్గర ఘర్షణ చోటుచేసుకుంది. నెల్లికుదురులో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి పాల్పడ్డారు. పోలింగ్ బూత్‌లను పరిశీలిస్తున్న ప్రేమేందర్ రెడ్డి, హుస్సేన్ నాయక్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుంది. రంగంలోకి దిగిన పోలీసులుఅక్కడకు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
-
మధ్యాహ్నం 12 గంటల వరకు 21.77% పోలింగ్ శాతం నమోదు
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు సగటున 21.77% పోలింగ్ శాతం నమోదైంది. హైదరాబాద్‌లో 19.57, మహబూబ్‌నగర్ జిల్లాలో 22.67, రంగారెడ్డిలో 17.16, నాగర్‌కర్నూల్‌లో 21.29, నారాయణ్‌పేట్ జిల్లాలో 18.26, వికారాబాద్ జిల్లాలో 25.09, మేడ్చల్ జిల్లాలో 20.47, గద్వాల జిల్లాలో 26.36, వనపర్తి జిల్లాలో 28.83 శాతాల పోలింగ్ నమోదైంది.
-
వరంగల్ ఓట్ల గల్లంతుపై విచారణ జరుపుతాం: చీఫ్ ఎలక్షన్ కమిషన్
వరంగల్ లోని పోలింగ్ కేంద్రంలో ఓట్ల గల్లంతుపై విచారణ జరుపుతామని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషన్ శశాంక్ గోయల్ అన్నారు. భోగస్ ఓట్లపై ఫిర్యాదులు వచ్చాయని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థులపై ఫేక్ న్యూస్ చేయడం తప్పన్నారాయన. అలా జరిగితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ఫేక్ న్యూస్‌పై విచారణ జరుపుతున్నారని చెప్పారు.
-
మీర్‌పేట్‌లో ఓటు వేసే క్రమంలో కళ్ళు తిరిగి కింద పడిపోయిన 26ఏళ్ల యువతి
హైదరాబాద్ మీర్‌పేట్ సిర్లహిల్స్ లోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటర్ కు అస్వస్థత. ఓటు వేసే క్రమంలో అనూష (26) అనే ఓటరు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
-
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా 182 పోలింగ్ కేంద్రాల్లో 1,29,851 పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల విధుల్లో 808 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు అవుతుండడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1,161 పోలీసులు గస్తీ కాస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.
-
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జోరుగా పోలింగ్, సాయంత్రం 4 గంటల వరకూ టైం
తెలంగాణలోని మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ సిబ్బంది ఇచ్చిన పెన్నుతోనే ఓటరు అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ గడుల్లో ప్రాధాన్యతా నంబర్లు వేయాల్సి ఉంటుంది. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గం నుంచి 93 మంది, వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 71 మంది బరిలో ఉన్నారు. ఇక, రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల కోసం మొత్తంగా 1,530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 7వేల 560 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలో 5లక్షల 31వేల 268 మంది, వరంగల్-ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 5లక్షల 05వేల 565 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
-
మాటతూలిన హోం మంత్రి మహమూద్ అలీ, డోలాయమానంలో ఎమ్మెల్సీ ఓటు చెల్లుబాటు
తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ ఓటుపై ఆసక్తికర వివాదం నెలకొంది. తమ పార్టీ అభ్యర్థికి ఓటేసానని మహమూద్ అలీ చెప్పడంతో.. ఇప్పుడు ఆ ఓటు చెల్లుతుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఈ అంశంపై ఎన్నికల అధికారులు పరిశీలన చేస్తున్నారు. గతంలో ఏ అభ్యర్థికి ఓటు వేశారో చెప్పడంతో సదరు ఓటు చెల్లదని ఈసీ పరిగణించిన సంగతి తెలిసిందే. అయితే, హోంమంత్రి ఓటుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఆర్వో ఫిర్యాదు అందితే వెంటనే హోంమంత్రి ఓటు చెల్లుబాటుపై పరిశీలిస్తామని అధికారులు అంటున్నారు.
-
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్, పట్టభద్రులు, మేధావులు వారి మనస్సాక్షికి ఓటు వేయండి : బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రం లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. నిన్న రాత్రంతా మేధావుల్ని ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు అని ఆయన అన్నారు. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చి పట్టభద్రులను ప్రలోభ పెట్టె ప్రయత్నం చేశారు. ఉద్యోగుల్ని భయపెట్టే ప్రయత్నం జరిగింది అని చెప్పిన బండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. పట్టభద్రులు, మేధావులు వారి మనస్సాక్షికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టభద్రులు ఎక్కువ సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని ఓటు శాతం పెంచుతారని ఆశిస్తున్నా అని బండి పేర్కొన్నారు.
-
ఏపీలో జోరుగా ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఏపీలోని ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల జోరుగా సాగుతున్నాయి. ఈ రెండు స్థానాల నుంచి 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన రంపచోడవరం, ఎటపాక, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం డివిజన్‌ల పరిధిలోని కేంద్రాల్లో మాత్రం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. 17న ఓట్ల లెక్కింపు జరగనుంది.
-
కేటీఆర్‌కు కౌంటరిచ్చిన బీజేపీ ఎమ్మెల్సీ, నిరుద్యోగి ఎల్లాస్వామికి మొక్కి.. ఓటువేసేందుకు వచ్చానంటూ సెటైర్
గ్యాస్ సిలిండర్ ధరలపై పంచ్ వేస్తూ… నేను ఇంట్లో బయలుదేరే ముందు గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టుకుని వచ్చాను అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అంటే, దానికి కౌంటరిచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ రామ చందర్ రావు. నేను ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగి ఎల్లాస్వామికి మొక్కి ఎమ్మెల్సీ ఓటు వేశాను అంటూ ఆయన సెటైర్ వేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, పీఆర్సీ త్వరగా రావాలని దేవుడికి మొక్కుకుని వచ్చానన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే వస్తాయని ఆశిస్తున్నాను. నా విజ్ఞప్తి మేరకు ఆదివారం పోలింగ్ నిర్వహిస్తోన్న ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు అని రామ చందర్ రావు అన్నారు. శ్రమ అనుకోకుండా పట్టభద్రులు తమ ఓటును తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన కోరారు.
-
బంగ్లాదేశీలకు అనుగుణంగా టీఎంసీ వ్యవహరిస్తోంటే… మజ్లీస్ కు అనుగుణంగా టిఆర్ఎస్ వ్యవహరిస్తోంది : కిషన్ రెడ్డి
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని మరోసారి టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ మమత బెనర్జీని ఆదర్శంగా తీసుకున్నారు.. పశ్చిమ బెంగాల్ లో బంగ్లాదేశీలకు అనుగుణంగా టీఎంసీ వ్యవహరిస్తోంటే… మజ్లీస్ కు అనుగుణంగా టిఆర్ఎస్ వ్యవహరిస్తోంది అంటూ ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ మేధావులు, ప్రజలు రాష్ట్ర పరిస్థితులను అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేంద్రం, మోడీ పై టిఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ విమర్శలు చేయడం అలవాటుగా మారిందని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కుమారుడు తెలంగాణను శాసిస్తున్నాడు.. అన్ని మంత్రిత్వశాఖలపై పెత్తనం చేలాయిస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. బైంసాలో దాడులు జరిగితే కేటీఆర్ మాట్లాడలేదు.. ఇచ్చిన హామీలు మరిచిపోయి కేంద్రం పై విమర్శలు చేస్తూ ఉంటే చేతులు ముడుచుకుని కూర్చోం అని ఆయన తేల్చిచెప్పారు. ఇంకా ఆట మొదలు కాలేదు. బిజెపి ఆట మొదలు పెడితే టీఆర్ఎస్ కు దిమ్మ తిరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
-
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధికే మా మద్దతన్న జనసేనాని పవన్ కళ్యాణ్, తెలంగాణ బీజేపీపై తీవ్ర ఆగ్రహం
బీజేపీ అవమానించింది..మా మద్దతు టీఆర్ఎస్ అభ్యర్ధికే అని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. హైదరాబాద్‌లో జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడిన సేనాని..తెలంగాణ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కేంద్ర నాయకత్వం మాతో ఉన్నా..తెలంగాణ బీజేపీ మమ్మల్ని అవమానించింది. జనసేనను చులకన చూసేలా మాట్లాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్ధి పీవీ నరసింహారావు కుమార్తె వాణికి మద్దతిస్తున్నామన్నారు. పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడని కొనియాడారు.
-
ఓటు వేసేందుకు ఇంట్లోనుంచి బయల్దేరే ముందు గ్యాస్ సిలిండర్‌కు మొక్కి వచ్చా : కేటీఆర్
హైదరాబాద్‌లోని షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి కేటీఆర్. ఇంట్లో బయల్దేరే ముందు గ్యాస్ సిలిండర్‌కు మొక్కి వచ్చానన్న కేటీఆర్..అభివృద్ధికి పాటుపడే మంచి వ్యక్తికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. విద్యావంతులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు కేటీఆర్.
-
ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు, పువ్వాడ అజయ్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరిక
ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా..కాంగ్రెస్ శ్రేణుల పట్ల పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఖమ్మం పీఎస్‌కు చేరుకున్నఆయన..కాంగ్రెస్ కార్యకర్తలను అకారణంగా అరెస్ట్ చేశారని విరుచుకుపడ్డారు. పోలీసులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిగే క్రమంలో రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన వారే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు భట్టి విక్రమార్క. పదవులను ప్రజల సంక్షేమం కోసం వాడుకోవాలన్నారు..స్వార్థపూరిత రాజకీయాల కోసం ఇతర పార్టీల వారిని అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని మంత్రి పువ్వాడ అజయ్‌ను హెచ్చరించారు. మీ ఆగడాలు, ఒత్తిళ్లకు భయపడేది లేదని..ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని భట్టి హెచ్చరించారు.
-
ప్రజలను బిచ్చగాళ్లలా మార్చిన వాళ్లని ఎన్నికల్లో చెప్పుతో కొట్టినట్లుగా బుద్ధి చెప్పండి : కోమటిరెడ్డి
రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నికలివి.. రాష్ట్రాన్ని ఏడేళ్లుగా నియంతలాగా పాలిస్తూ.. వేల కోట్ల రూపాయలను దోచుకున్నారు అని ఆరోపించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ముఖ్యమంత్రి పదవిని చెప్పుతో పోలుస్తూ..ప్రజలను బిచ్చగాళ్లలా మార్చారని విమర్శించారు. ప్రజల్ని ఆయన కాలి కింద చెప్పుల్లాగా చూస్తున్నందుకు .. ఈ ఎన్నికల్లో చెప్పుతో కొట్టినట్లుగా బుద్ధి చెప్పాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.
Published On - Mar 14,2021 4:41 PM