Telangana Governor : కొండరెడ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టిన గవర్నర్ తమిళి సై.. ఎందుకో తెలుసా..?
TS Governors Special Focus : తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆదిమజాతి అయిన కొండరెడ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రీషన్ చేసిన సర్వేలో కొండరెడ్ల గర్భిణులకు
TS Governors Special Focus : తెలంగాణ గవర్నర్ తమిళి సై ఆదిమజాతి అయిన కొండరెడ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూట్రీషన్ చేసిన సర్వేలో కొండరెడ్ల గర్భిణులకు, పిల్లలకు పోషకాహారం సరిగ్గా అందటం లేదని, సరైన పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తవని, సాధారణ ప్రజలలాగే జీవనం సాగిస్తారని గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవాణి శంకర్ అన్నారు. గవర్నర్ తమిళి సై ఆదేశాల మేరకు ఆదిమ తెగలలో పౌష్టికాహార లోపం నివారించేందుకు దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భవాణి శంకర్ మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎన్ఐఎన్, ఈఎస్ఐ వైద్య కళాశాల సహకారంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
ఈ కార్యక్రమ అమలు కోసం రాష్ట్రంలోని మూడు జిల్లాలోని ఆరు గిరిజన ఆదిమ తెగలున్న గ్రామాల్ని ఎంచుకున్నామన్నారు. గవర్నర్ ప్రత్యేకంగా తయారు చేసిన సర్వే పేపర్లతో ప్రతి ఇంటికీ వెళ్లి పౌష్టికాహార లోపాల పై అంచనా వేస్తామని, గవర్నర్ మార్గదర్శకాలతో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన కార్యచరణను చేపడతామని తెలిపారు. అనంతరం గ్రామస్తులకు హెల్త్ హైజినిక్ కిట్లు, మాస్కులు పంపిణీ చేశారు. తమ గ్రామాన్ని ఈ పథకం కింద ఎంపిక చేసి తమ అభివృద్ధికి పాటుపడుతున్న గవర్నర్ తమిళిసై కి కొండరెడ్లు హర్షతిరేకాలు వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియచేశారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యూనివర్శిటీల్లో కేవలం పదిరోజుల్లో వీసీలను నియమించాలని ఆమె ఆదేశించారు. ఈ మేరకు వీసీల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని 11వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉండగా ఛాన్సలర్ పోస్టులను ఇప్పటి వరకూ ఎందుకు భర్తీ చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలోని యూనివర్సిటీల్లో వేల సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.