AP MPTC ZPTC Elections 2021 Highlights: ఏపీలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. ఓటింగ్ ఎంత జరిగిందంటే..
ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 2,46,71,002 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
AP MPTC ZPTC Polls 2021 Live voting: ఆంధ్ర ప్రదేశ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతోపాటు.. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా చోటుచేసుకున్న చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సూర్య భగవానుడి వేడి తాపం మరో వైపు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఆత్రుతతో ఓట్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే పోటీకి దూరమైన టీడీపీ పట్టు ఉన్న చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు కొందరు బరిలో నిలిచారు. పలుచోట్ల వివిధ కారణాలతో పలు రాజకీయ పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగినప్పటికీ పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితులను అదుపులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్ వద్ద క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.
రాష్ట్రంలో 13 జిల్లాల్లో 660 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 126 ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికలు జరగడంలేదు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పోటీలో ఉన్న 11మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 10,047 ఎంపీటీసీలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించడం లేదు. 81 మంది అభ్యర్థులు మరణించడంతో మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 18,782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 652 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు ఎన్నిక జరిగింది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారుల భారీ భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పరిషత్ ఎన్నికల కోసం 27,751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గుర్తించిన హింసాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ప్రతి సబ్ డివిజన్‌లో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచారు. అయితే, ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించినా.. ఎన్నికలు అధికార పక్షం ఊహించినంత ఏకపక్షంగా జరగడంలేదు. అయితే పోటీకి దూరమైన టీడీపీ పట్టు ఉన్న చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు కొందరు బరిలో నిలిచారు.
LIVE NEWS & UPDATES
-
క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం..
రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.
-
ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
ఆంధ్ర ప్రదేశ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగింది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలతోపాటు.. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా చోటుచేసుకున్న చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
-
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లా-46.46 శాతం విజయనగరం జిల్లా-56.57 శాతం విశాఖ జిల్లా- 55.29 శాతం తూర్పు గోదావరి- 51.64 శాతం
కడప జిల్లా- 43.77 శాతం కర్నూలు జిల్లా- 48.40శాతం అనంతపురం జిల్లా: 45.70 శాతం పశ్చిమగోదావరి జిల్లా-55.4 శాతం
కృష్ణా జిల్లా-49 శాతం గుంటూరు జిల్లా- 37.65 శాతం ప్రకాశం జిల్లా- 34.19 శాతం నెల్లూరు జిల్లా -41.8 శాతం చిత్తూరు జిల్లా-50.39 శాతం
-
మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన ఓట్ల శాతం..
ఏపీలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నెల్లూరు జిల్లాలో 41.87 శాతం, గుటూరులో 37.65 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే విజయనగరం జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 51.09 శాతం, కడపలో 39.42 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు.
-
ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది…
ఓటు వేయనివారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలని హీరో మంచు విష్ణు అన్నారు. ఓటు హక్కును వినియోగించుకుని దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో మంచు విష్ణు తన ఓటు వేశారు. యువత ఓటు వేస్తేనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. ఓటు వేసిన తర్వాతే.. సమస్యలు తీర్చాలని నాయకులు, అధికారులను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు మంచు విష్ణు.
-
-
గారపాడులో గొడవ.. తన్నుకున్న రెండు వర్గాలు..
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ మహిళ క్యూ లైన్‌లో నిల్చుని ఓటు వేసే విషయంలో తలెత్తిన గొడవ రచ్చగా మారింది. దీంతో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య గొడవకు దారి తీసింది. పోలీసులు కల్పించుకోవడంతో గొడవ సద్దుమనిగింది.
-
శ్రీకాకుళం జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ..
శ్రీకాకుళం జిల్లా బూర్జమండలం చిన్నలంక గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ తోపులాడుకున్నారు. ఇరు వర్గాల మధ్య వివాదం పెరిగే క్రమంలో ఒక వ్యక్తిపై దాడి చేశారు. ఈ గోడవలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
-
మధ్యాహ్నం ఒంటిగంట వరకు 37.26 శాతం పోలింగ్
ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుంతోంది. మధ్యా హ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 37.26 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా – 36.62 శాతం పోలింగ్ విజయనగరం జిల్లా – 44.38 శాతం పోలింగ్ విశాఖపట్నం జిల్లా – 42.1 శాతం పోలింగ్ తూర్పు గోదావరి జిల్లా – 41 శాతం పోలింగ్ పశ్చిమ గోదావరి జిల్లా – 41.9 శాతం పోలింగ్ కృష్ణా జిల్లా – 36.02 శాతం పోలింగ్ గుంటూరు జిల్లా – 27.26 శాతం పోలింగ్ ప్రకాశం జిల్లా – 27.44 శాతం పోలింగ్ నెల్లూరు జిల్లా – 34.2 శాతం పోలింగ్ కర్నూలు జిల్లా – 40.25 శాతం పోలింగ్ అనంతపురం జిల్లా – 37.79 శాతం పోలింగ్ కడప జిల్లా – 33.6 శాతం పోలింగ్ చిత్తూరు జిల్లా – 41.87 శాతం పోలింగ్
-
చిత్తూరు జిల్లాలో ఓటేసిన మంచు విష్ణు
పరిషత్ ఎన్నికల్లో భాగంగా చిత్తూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నా సినీ నటుడు మంచు విష్ణు. యువతరం ఓటేస్తేనే మార్పు వస్తుందంటున్నారు విష్ణు. ఓటుకు డబ్బులడిగేవారిని కుమ్మెయ్యాలి.. ఓటు వెయ్యకుంటే.. ప్రభుత్వ పథకాలు నిలిపి వెయ్యాల్సిందే అన్నారు.
-
ఓటేసిన డిఫ్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్
ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ నరసన్నపేట మండలం మబగాం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
ఆముదాలవలసలో ఓటేసిన స్పీకర్ తమ్మినేని
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసే పెద్ద ప్రక్రియలో ఓటు చాల ముఖ్యమైనదని ఆయన అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
-
పామూరులో బ్యాలెట్ పేపర్‌లో పార్టీ అభ్యర్థుల పేర్లు తారుమారు
ప్రకాశం జిల్లా పామూరులో బ్యాలెట్ పేపర్‌లో పార్టీ అభ్యర్థుల పేర్లు ఇష్టానుసారంగా ముద్రించారంటూ సీపీఐ నేతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిర్లక్ష్యంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన పోలీసులు నేతల్ని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం స్టేషన్‌కు తరలించారు.
-
చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కొణాపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ వర్గీయులపై కొంతమంది దాడి చేశారు. దాడిలో కారు ధ్వంసమైంది. నర్రా ఊరు, పుల్లయ్యగారి పల్లికి చెందిన వారిని ఓటు వేయడనీయడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
-
నరసరావుపేట మండలంలో వైసీపీ-టీడీపీ వర్గాల ఘర్షణ
నరసరావుపేట మండలం గొనెపూడిలో టీడీపీ ఏజెంట్లను, ఓటర్లను పోలింగ్ బూతుల దగ్గరికి రాకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికారులు, పోలీసులు వైసీపీకి కొమ్ముకాస్తున్నారంటూ ఆందోళనకు దిగాయి.
-
నీటి తొట్టిలో బ్యాలెట్ బాక్స్
నెల్లూరు జిల్లా ఎఎస్‌పేట మండలం పొనుగోడులో పరిషత్ ఎన్నికల పోలింగ్ నిలిచిపోయింది. శుక్రవారం రీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ ఏజెంట్ ప్రసాద్ బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లి నీటితొట్టిలో వేయటంతో వివాదం నెలకొంది. అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను ప్రసాద్ తోసేసి బాక్స్ ఎత్తుకెళ్లాడు. పరారీలో ఉన్న బీజేపీ ఏజెంట్ ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
వరాహపురంలో జనసేన, వైసీపీ వర్గీయుల ఘర్షణ
గుంటూరు జిల్లా వరాహపురం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. వేమూరు మండలం వరాహపురం పోలింగ్ కేంద్రం వద్ద జనసేన, వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
-
గూడెం మాధవరంలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం గూడెం మాధవరంలో వైసీపీ-టీడీపీ వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. టపాసుల విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
-
కొండెపి మండలంలో ఓటు లాక్కున్న వాలెంటీర్
ప్రకాశం జిల్లా కొండెపి మండలం పెట్లూరు పోలింగ్ బూత్ 41/6 వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓటు వెయ్యడానికి వచ్చిన వ్యక్తులు దగ్గర నుండి వాలెంటీర్ ఓటు లాకోవడంతో వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. పోలింగ్ బూత్‌కు చేరుకున్న పోలీసులు ఇరు పార్టీల వారిని చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు.
-
రవీంద్ర వాహనంపై రాళ్ల దాడి
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరాంపురంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే వేణుగోపాల్ సోదరుడు రవీంద్ర వాహనంపై వైసీపీ రెబల్స్ రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
-
వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రత్యేక నిఘా మధ్య కొనసాగుతుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ తెలిపారు. అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. 3,530 మందితో నిరంతరం వెబ్ కాస్టింగ్ జరుగుతోందని తెలిపారు.
-
జిల్లాల వారీగా పోలింగ్ నమోదు శాతాలు
ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుంతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా పోలింగ్ నమోదు శాతాలుః
శ్రీకాకుళం జిల్లాలో 19.32 శాతం విజయనగరం జిల్లాలో 25.68 శాతం విశాఖపట్నం జిల్లాలో 24.14 శాతం తూర్పుగోదావరి జిల్లాలో 25.00 శాతం ప.గో జిల్లాలో 23.40 శాతం కృష్ణా జిల్లాలో 19.29 శాతం గుంటూరు జిల్లాలో 15.85 శాతం ప్రకాశం జిల్లాలో 15.05 శాతం నెల్లూరు జిల్లాలో 20.59 శాతం కర్నూలు జిల్లాలో 25.96 శాతం అనంతపురం జిల్లాలో 22.88 శాతం వైఎస్ఆర్ జిల్లాలో 19.72 శాతం చిత్తూరు జిల్లాలో 24.52 శాతం
-
మాచిరెడ్డిపల్లెలో పోలింగ్ బహిష్కరణ
కడప జిల్లా వల్లూరు మండలంలోని మాచిరెడ్డిపల్లెలో టీడీపీ కార్యకర్తలు పోలింగ్ ను బహిష్కరించారు. టీడీపీ అభ్యర్థులు బరిలో లేకపోవడంతో పోలింగ్ బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.
-
కొటియా గ్రామాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
విజయనగరం జిల్లా వివాదాస్పద కొటియా గ్రామాల్లో.. పరిషత్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేరేళ్లవలస, సారిక దగ్గర.. స్థానికులు ఓటు వేయకుండా ఒడిశా పోలీసులు, పలువురు ప్రజాప్రతినిధులు.. అడ్డుకుంటున్నారు. తోనామ్, మోనంగి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాకుండా రోడ్డుకడ్డంగా బండరాళ్లు పెట్టారు. అయినా సరే ఎలాగైనా తాము ఓటు హక్కు వినియోగించుకొని తీరుతామంటున్నారు ఓటర్లు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
-
గంటన్నర ఆలస్యంగా పోలింగ్..
పార్టీ గుర్తు లేదంటూ జనసేన కార్యకర్తల ఆందోళన చేయడంతో.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలంలో సాకురుగున్నేపల్లిలో పోలింగ్ గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. జనసేన గుర్తు లేకపోవడంతో జనసైనికులు ఆందోళన నిర్వహించారు.
-
జనసేన నాయకుడి ఇంటిపై దాడిని ఖండించిన నాదేండ్ల..
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని రేగాటిపల్లిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైసీపీ వర్గం దాడికి పాల్పడటంపై నాదేండ్ల తీవ్రంగా ఖండించారు. ఇది హేయమైన చర్యంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
-
జనసేన నాయకుల ఇళ్లపై… మహిళలపై దాడులు హేయకరం: నాదేండ్ల మనోహర్
ఎన్నికల్లో బలమైన పోటీగా నిలిచారనే రాజకీయ కక్షతో జనసేన నాయకులు, మహిళ కార్యకర్తలపై అధికార పక్షం నేతలు దాడులు చేస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇది హేయమైన చర్య అంటూ జనసేన నాయకుడు నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు.
-
గుంతపల్లిలో ఓటర్ల ఆందోళన
అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం గుంతపల్లిలో ఓటర్ల ఆందోళన నిర్వహించారు. ఓట్లు వేసేందుకు వెళ్తే వైసీసీ నాయకులు కొట్టారంటూ.. ఆరోపించారు.
-
బాచుపల్లిలో ఆందోళన..
ఆళ్లగడ్డ కౌన్సిలర్ భర్త.. బాచుపల్లి పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ గా కూర్చొవడంపై విపక్షపార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తిని ఎలా అనుమతించారంటూ అధికారులపై ఆగ్రహం..
-
బ్యాలెట్ పేపర్ బయటకు తెచ్చిన అభ్యర్థి అరెస్ట్
కడప జిల్లా.. చాపాడు మండలం రాజువారిపేట పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి రాజేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాలెట్ పేపర్ బయటకు తీసుకురావడంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.
-
అంటిపేటలో పోలింగ్ రేపటికి వాయిదా..
విజయనగరం జిల్లా సీతానగరం మండలం.. అంటిపేటలో పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పేపర్లో తప్పులు ఉండటంతో పోలింగ్ ను అధికారులు రేపటికి వాయిదా వేశారు. అభ్యర్థులకు బదులు విత్ డ్రా చేసుకున్న వారి పేర్లు బ్యాలెట్లల్లో నమోదయ్యాయి.
-
జిల్లాల వారీగా ఉదయం 9 గంటల వరకు పోలింగ్ వివరాలిలా..
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 7.76 శాతం పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 8.99 శాతం విజయనగరం జిల్లాలో 9.01 శాతం విశాఖపట్నం జిల్లాలో 8.83 శాతం తూర్పుగోదావరి జిల్లాలో 4.59 శాతం పశ్చిమగోదావరి జిల్లాలో 9.26 శాతం కృష్ణా జిల్లాలో 9.32 శాతం పోలింగ్ గుంటూరు జిల్లాలో 7.52 శాతం ప్రకాశం జిల్లాలో 6.53 శాతం నెల్లూరు జిల్లాలో 6.36 శాతం చిత్తూరు జిల్లాలో 7.29 శాతం వైఎస్ఆర్ కడప జిల్లాలో 4.81 శాతం కర్నూలు జిల్లాలో 9.58 శాతం అనంతపురం జిల్లాలో 7.76 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
-
వివాదాస్పద కొటియా గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత..
ఓటు వేసేందుకు వస్తున్న నేరేళ్ల వలస, సారిక వద్ద ఓటర్లను ఒడిషా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఉద్రికత్త నెలకొంది. ఓటర్లను ఆపేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు.. పలువురు యత్నం.
-
ఓటేసి.. సోషల్ మీడియలో పోస్టులు..
తూర్పుగోదావరి జిల్లా మమ్మడివరంలోని పల్లంకుర్రులో ఓటేసి ఓ వ్యక్తి ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో విపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
-
సాకుర్రుగున్నేపల్లిలో ఉద్రిక్తత
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం సాకుర్రుగున్నేపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్యాలెట్ పత్రాలపై గుర్తులు లేకపోవడంతో అభ్యర్థులు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో జనసేన కార్యకర్తలు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అధికారులు పోలింగ్ ను నిలిపివేశారు
-
అవనిగడ్డలో..
అవనిగడ్డలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతోపాటు పలువురు నేతలు కూడా తరలివచ్చారు.
-
ఓటు వేసిన ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు
పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లా చందర్లపాడులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
ఓటు హక్కు వినియోగించుకున్న పాడేరు ఎమ్మెల్యే..
ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలోనే పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగూలీ భాగ్యలక్ష్మి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
తంపతాపల్లి పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం తంపతాపల్లి పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల నచ్చజెప్పడంతో గొడవ సర్ధుమణిగింది.
-
పెద్దచెప్పలి ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్
కడప జిల్లా కమలాపురం మండలం పెద్దచెప్పలి ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి నాగ రాజాచారి ని అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉండగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వెంటనే అతన్ని విడుదల చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
-
రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంలో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
-
విశాఖ మన్యంలో పోలింగ్ ప్రశాంతం
విశాఖ జిల్లా మన్యంలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ముంచింగ్‌పుట్ మండలంలోని బంగారుమెట్ట పోలింగ్ కేంద్రంలో ప్రజలు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ కడుతున్నారు.
-
ఓటేసిన ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి
ఏపీ పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు తరలివసున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావు పాలెంలో ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-
ఓటేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
గుంటూరు జిల్లా పెదకాకానిలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
జమ్మలమడుగు నియోజకవర్గంలో బారులు తీరిన ఓటర్లు
పరిషత్ ఎన్నికల పోలింగ్ కోనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ఉదయం నుంచే ఓటర్లు భారులు తీరారు.
-
టీడీపీ – వైసీపీ వర్గాల మధ్య వాగ్వివాదం
కడపజిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. చాపాడు మండలం అయ్యవారిపల్లి ఎంపీటీసీ ప్రాదేశిక నియోజకవర్గంలోని రాజోలిపేట పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి రాజేశ్వరి తరఫున ఏజెంట్ కూర్చో పెట్టే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
-
కర్నూలులో కొనసాగుతున్న పోలింగ్
కర్నూలు జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్నాయి.
-
భారీ భద్రత నడుమ పోలింగ్
పరిషత్ ఎన్నికల కోసం 27,751 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తించిన అధికారులు అదనపు బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. ప్రతి సబ్ డివిజన్‌లో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అప్రమత్తంగా ఉంచారు
-
ఓటు వేసిన వృద్ధులు
విశాఖ జిల్లాలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో వృద్ధులు ఉత్సాహంగా ఓటు వేశారు.
-
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,058 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల బరిలో 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పరిషల్ ఎన్నికల పోలింగ్‌లో 2,46,71,002 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
-
విశాఖ జిల్లా 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
విశాఖ జిల్లాలో పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే భారీగా తరలివచ్చిన ఓటర్లు బారులు తీరారు. కోవిడ్ నిబంధనల అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
-
జిల్లాల వారీగా పోలింగ్ జరిగే స్థానాలు
శ్రీకాకుళం: 37 జెడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలు విజయనగరం: 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలు విశాఖపట్నం: 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలు తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ స్థానాలు పశ్చిమగోదావరి: 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలు కృష్ణా: 41 జెడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలు గుంటూరు: 45 జెడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలు ప్రకాశం: 41 జెడ్పీటీసీ, 387 ఎంపీటీసీ స్థానాలు నెల్లూరు: 34 జెడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలు చిత్తూరు: 33 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలు వైఎస్‌ఆర్ జిల్లా: 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలు కర్నూలు: 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలు అనంతపురం: 62 జెడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలు
-
రాష్ట్రవ్యాప్తంగా 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు జరగడం లేదు. 81 మంది అభ్యర్థులు వివిధ కారణాల దృష్ట్యా మరణించారు. మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 18,782 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
-
515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్
రాష్ట్రంలో 660 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 126 ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికలు నిలిచిపోయాయి.గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పోటీలో ఉన్న 11మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది పోటీలో ఉన్నారు.
-
కృష్ణా జిల్లాలో మొదలైన పోలింగ్
కృష్ణా జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తిరువూరు, ఏ.కొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు.
Published On - Apr 08,2021 5:35 PM