బీజేపీనేతల మధ్య చిచ్చు రాజేసిన లింగోజీగూడ డివిజన్ బైపోల్.. కేటీఆర్‌ను కలిసిన వారిపై బండి సంజయ్ గుర్రు
లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నిక బీజేపీ నేతల మధ్య వివాదం రాజేసింది. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి బీజేపీ సీనియర్ నేతలు...మంత్రి కేటీఆర్‌ను కలవడంపై టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు.
Lingojiguda division by poll: లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నిక బీజేపీ నేతల మధ్య వివాదం రాజేసింది. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి బీజేపీ సీనియర్ నేతలు…మంత్రి కేటీఆర్‌ను కలవడంపై టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై నిజనిర్థాణ కమిటీ వేశారు. ఈ కమిటీ పార్టీ సీనియర్ నేతలను ఇబ్బంది పెట్టడానికేనంటూ ప్రచారం జోరుగా సాగింది. వాస్తవాలను తెలుసుకోవడానికే కమిటీ వేశామని బండి సంజయ్ వివరణ ఇచ్చారు.
రంగారెడ్డి అర్బన్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఉపఎన్నిక బీజేపీలోని ముఖ్యనాయకుల మధ్య చిచ్చురేపింది. ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి రంగారెడ్డి జిల్లా బీజేపీ కమిటీతోపాటు ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు.. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీలో పెట్టడంలేదని కేటీఆర్ వారితో చెప్పినట్లు సమాచారం.
అయితే, ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సమాచారం ఇవ్వకుండా జరిగినట్లు వార్తలు వచ్చాయి. సోషల్‌మీడియాలో కూడా బండి వర్సెస్ ఇతర బీజేపీ నాయకులంటూ విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌ను కలవడంపై అసహనంతో ఉన్న బండి సంజయ్.. దీనిపై నిజనిర్థాణ కమిటీ వేశారు. అయితే, ఈ కమిటీ సీనియర్ నేతలను ఇబ్బంది పెట్టడానికే ఏర్పాటు చేశారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో బండి సంజయ్ వివరణ ఇచ్చారు. కేటీఆర్ కలవడానికి దారి తీసిన పరిస్థితులపై వాస్తవాలు తెలుసుకోవడానికి మాత్రమే బీజేపీ రాష్ట్ర పార్టీ నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పినట్లు సమాచారం.
లింగోజీగూడలో బీజేపీ బలంగా ఉందని..మరోసారి పోటీ చేయడానికి సిద్ధమైందని బండి సంజయ్ అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపార్టీకి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు కూడా సమాచారం లేకుండా, విషయాన్ని చర్చించకుండా కేటీఆర్‌ను కలవడంపై బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని బండి సంజయ్ ప్రకటించారు. ఇది పార్టీ ప్రయోజనాలను దెబ్బతీయడంతోపాటు తొందరపాటు చర్యగా రాష్ట్రపార్టీ భావిస్తోందన్నారు.
మరోవైపు, ఈ సంఘటన తర్వాత కొన్ని పత్రికలు, మీడియాలో బీజేపీ నాయకులపై తప్పుడు కథనాలను ప్రసారం చేయడాన్ని రాష్ట్రపార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రధానంగా సోషల్‌మీడియాతోపాటు వివిధ ఛానళ్లలో వచ్చిన కథనాలలో ఏ మాత్రం వాస్తవం లేదని బీజేపీ నేతలు కొట్టిపారేశారు.
Read Also… వింత చెట్లు… వాటిని నరికితే బెరడ్ల నుంచి రక్తం వస్తుంది. దానితో ఏం చేస్తారంటే..?