పెచ్చులూడిన తెలంగాణ అసెంబ్లీ ఎలివేషన్.. భవనం పటిష్టంగానే ఉందన్న కార్యదర్శి నర్సింహాచార్యులు

తెలంగాణ శాసన సభ పాత భవనం ఎలివేషన్‌ పెచ్చులూడి కింత పడ్డాయి. పెద్ద శబ్దం చేస్తూ ఎలివేషన్‌ గోపురం ఊడి పడింది. పాత అసెంబ్లీ భవనం తూర్పు వైపు..

  • K Sammaiah
  • Publish Date - 5:47 pm, Tue, 23 February 21
పెచ్చులూడిన తెలంగాణ అసెంబ్లీ ఎలివేషన్.. భవనం పటిష్టంగానే ఉందన్న కార్యదర్శి నర్సింహాచార్యులు

తెలంగాణ శాసన సభ పాత భవనం ఎలివేషన్‌ పెచ్చులూడి కింత పడ్డాయి. పెద్ద శబ్దం చేస్తూ ఎలివేషన్‌ గోపురం ఊడి పడింది. పాత అసెంబ్లీ భవనం తూర్పు వైపు ఉన్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కార్యాలయ భవనం పైకప్పు గోపురం కూలిపోయింది. దీంతో ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది పరుగులు తీశారు. శిధిలాలు గార్డెన్ ఏరియాలో పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీకి వందేళ్ల చరిత్ర ఉంది. 1905లో ప్రజల చందాలతో ఆరో నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ పనులు ప్రారంభించారు. 1913 డిసెంబర్‌ నాటికి ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో భవనం అందుబాటులోకి వచ్చింది. మొదట్లో దీన్ని ‘మహబూబియా టౌన్‌హాల్‌’గా పిలిచేవారు. తర్వాతి కాలంలో దాన్నే అసెంబ్లీగా మార్చారు. తాజా ఘటనతో వందేళ్లనాటి భవనం పటిష్టతపై సర్వత్రా అనుమానాలు నెలకొన్నాయి.

అయితే ఈ ఘటనపై శాసన సభ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహా చార్యులు స్పందించారు. ఏటా పాత భవనం గోడలు, సీలింగ్ నుంచి సున్నం, గచ్చు పెచ్చులు జారడం సహజమని నరసింహాచార్యులు పేర్కొన్నారు. అసెంబ్లీ ఇంజనీరింగ్ విభాగం ఆయా ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపడతూ ఉందన్నారు. ప్రధాన స్ట్రక్చర్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పటిష్టంగా ఉన్నదని, అధికారులు, ఇంజనీరింగ్ విభాగం నిత్యం శాసనసభ భవనంతో పాటుగా అనుబంధ కార్యాలయాలు ఉన్న భవనాలను పరిశిలిస్తున్నారని చెప్పారు.

ఎల్లవేళలా, అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన మేరకు మరమ్మతులు చేపడుతున్నామని నరసింహాచార్యులు చెప్పారు. పాత భవనం నిర్మించి వందేళ్ళకు పైగా అయిందని, అప్పటి టెక్నాలజీ ప్రకారం డంగు సున్నంతో నిర్మించారని చెప్పారు. భవనం పటిష్టతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Read more:

రేపు తెలంగాణ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం.. ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నకేటీఆర్‌