Minisiter Malla Reddy: తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్న మంత్రి మల్లారెడ్డి.. ఆయన చుట్టే పేలుతున్న మాటల తూటాలు..
పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల దాడికి దారితీసింది మల్లారెడ్డి ఎపిసోడ్. అటు... మంత్రి మల్లారెడ్డి మాత్రం ఎటాక్..
మెడ్చల్ సభలో జరిగిన గొడవ తెలంగాణాలో హాట్ టాపిక్ అయింది. ఎవడైతే నాకేంటి రేంజ్‌లో రెచ్చిపోయి మాట్లాడే మల్లారెడ్డినే(Minisiter Malla Reddy) ఎటాక్ చేశారా అంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల దాడికి దారితీసింది మల్లారెడ్డి ఎపిసోడ్. అటు… మంత్రి మల్లారెడ్డి మాత్రం ఎటాక్ తర్వాత కూడా అదే స్పీడ్‌తో అంతే వేడిగా స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది తెలంగాణా సర్కారు. ఒక మంత్రిని పిలిచి మీరు చెప్పిందే మాట్లాడాలని శాసిస్తే ఎలా కుదురుతుంది అని ప్రశ్నించారు మరో మంత్రి తలసాని. తనను చంపాలన్న పెద్ద కుట్రతోనే దాడి జరిగిందన్నారు మంత్రి మల్లారెడ్డి. ఫేమస్ అవుతున్నానన్న అక్కసుతోనే వంద మంది రెడ్లను పంపి సభలో రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు మల్లారెడ్డి.
సభకొచ్చిన రెడ్లందరూ రైతులే తప్ప రౌడీలు కాదంటున్నారు కాంగ్రెస్ నేత హరివర్షన్ రెడ్డి. మల్లారెడ్డి ఎలిగేషన్స్‌లో నిజం లేదని ఆయన టీవీ9 డిబేట్‌లో చెప్పారు. మల్లారెడ్డిని చంపడం అంటే పిట్టను చంపడం లాంటిదే అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారాయన. దీన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మీద జరిగిన దాడిగానే పరిగణిస్తున్నాం అంటున్నారు కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి. మేనిఫెస్టోలో పెట్టిన రెడ్డి కార్పొరేషన్ గురించి కాకుండా, మిగతా విషయాల్ని ప్రస్తావించినందువల్లే మంత్రిపై దాడి జరిగిందన్నారు.
ఇలా మంత్రులపై దాడులు, కుట్రలు జరుగుతున్నట్టు ఆరోపణలొస్తుంటే… ప్రభుత్వం ఏం చేస్తోందని అడుగుతున్నారు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్క. నిన్నటి దాడికి కర్త-కర్మ-క్రియ అన్నీ మల్లారెడ్డే అంటున్నారు తెలంగాణాలో మరో కాంగ్రెస్ నేత మల్లు రవి. ఆయనే ఎటాక్ చేయించుకుని తర్వాత ఆయనే కేకలేస్తున్నారన్నది మల్లురవి మాట.
రెడ్ల సభలో జరిగిన పరాభవానికి సంబంధించి మంత్రి మల్లారెడ్డికి క్షమాపణ చెబుతున్నాం అన్నారు రెడ్డి జాగృతి సంఘం నాయకులు మాధవరెడ్డి. కానీ… మల్లారెడ్డి ఆరోపిస్తున్నట్టు ఆ సభకొచ్చినవారిలో రౌడీలే లేరని క్లారిటీ ఇచ్చారు.
అటు… మల్లారెడ్డి ఇష్యూ నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. తెలంగాణా కార్మిక మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై ఎటాక్ అంటూ నేషనల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. రెడ్ల సభలో కేసీఆర్‌ని ప్రశంసించడం వల్లే దాడి జరిగిందన్న వెర్షన్‌తో సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. రెడ్ల మధ్య ఇంత చిచ్చు పుట్టినప్పటికీ… దీన్ని ఇక్కడితో వదిలిపెట్టబోను అని హెచ్చరిస్తున్నారు మంత్రి మల్లారెడ్డి.