Nagma: 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ఇంతేనా..? నగ్మా షాకింగ్ కామెంట్స్..
Congress Leader Nagma: అభ్యర్థులను ప్రకటించిన వెంటనే విమర్శలు మొదలయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో కీలక నేతలను పక్కనబెట్టి బయటివారికి అవకాశం ఇవ్వడంపై కొందరు నాయకులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎంపిక కొంత మంది సీనియర్ నేతలను..
కాంగ్రెస్ పార్టీలో నిరసరాగాలు మొదలయ్యాయి. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారుతోంది. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే విమర్శలు మొదలయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో కీలక నేతలను పక్కనబెట్టి బయటివారికి అవకాశం ఇవ్వడంపై కొందరు నాయకులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎంపిక కొంత మంది సీనియర్ నేతలను అసంతృప్తికి గురిచేసింది. రాజ్యసభ సీటు ఆశించి భంగపాటుకు గురైన పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ట్విటర్ వేదికగా తన అసహనాన్ని వెళ్లగక్కారు. ‘‘నా తపస్సులో ఏదైనా తగ్గి ఉంటుందేమో..?’’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ ముంబై యూనిట్ వైస్ ప్రెసిడెంట్, నటి నగ్మాకు ఈ సారి టికెట్ దక్కకపోవడంతో ఆమె కూడా అదే తరహాలో స్పందించారు. వెంటనే ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ‘‘నా 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ (మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ ఎంపిక చేసిన అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హిని కోడ్ చేస్తూ) ముందు తక్కువైంది’’ అంటూ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘2003-04లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు స్వయంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే నన్ను రాజ్యసభకు పంపుతానని మాటిచ్చారు. అప్పటి నుంచి ఈ 18 ఏళ్లలో వారు నాకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్‌ను ఎంపిక చేశారు. ఆ పదవికి నేను తక్కువ అర్హురాలినా?’’ అంటూ నగ్మా ప్రశ్నించారు.
Congratulations to all those who made it to the Rajya Sabha @ShuklaRajiv ji Ranjeet Ranjan ji @ajaymaken ji @Jairam_Ramesh ji @VTankha ji @ShayarImran ji @rssurjewala ji @MukulWasnik ji @pramodtiwari700 ji & @PChidambaram_IN ji. And to all those who r selected to the Rajya Sabha https://t.co/GSQ070QgOk
— Nagma (@nagma_morarji) May 30, 2022
వచ్చే నెల 10వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఆదివారం పది మంది అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని తమిళనాడు నుంచి పోటీలోకి దింపారు. పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, ఉత్తర్‌ప్రదేశ్ నేత ప్రమోద్ తివారీలను రాజస్తాన్ నుంచి పోటీకి నిలిపింది. కర్ణాటక నుంచి జైరాం రమేశ్‌కు, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ టంకాలకు అవకాశం కల్పించింది. వీరితోపాటు రాజీవ్ శుక్లా (ఛత్తీస్‌గఢ్), మాజీ ఎంపీ పప్పూ యాదవ్ సతీమణి రంజీత్ రంజన్ (బిహార్), అజయ్ మాకెన్ (హరియాణా), ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి (మహారాష్ట్ర)లను బరిలోకి దింపింది. ఇందులో చిదంబరం, జైరాం రమేశ్, వివేక్ టంకాలు మాత్రమే వారి సొంత రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతో పెద్దల సభలో కాంగ్రెస్ బలం కాస్త పెరగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 29గా ఉంది. కొత్తగా జరిగే ఎన్నికల్లో రాజస్థాన్‌లో 3; ఛత్తీస్‌గఢ్‌లో 2; తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలను హస్తం పార్టీ గెలుచుకోవడం దాదాపు ఖాయం. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే హరియాణా, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లోనూ ఒక్కో స్థానాన్ని ఖాతాలో వేసుకోవచ్చు. దీంతో పెద్దల సభలో కాంగ్రెస్ బలం 33కు పెరిగే ఉంది. అయితే పార్టీలో ఇలాంటి విమర్శలు రావడం.. ఈ మధ్య సీనియర్లు పార్టీకి రాజీనామాలు చేయడం.. పార్టీకి మరింత ఇబ్బందిగా మారుతోంది.