Kuna Ravi Kumar : ఎట్టకేలకు పొందూరు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయిన టీడీపీ నేత కూన రవి కుమార్
Kuna Ravi Kumar surrender : శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన రవికుమార్ ఎట్టకేలకు లొంగిపోయారు..
Kuna Ravi Kumar surrender : శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కూన రవికుమార్ ఎట్టకేలకు లొంగిపోయారు. కొంచెంసేపటి క్రితం ఆయన పొందూరు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు. ఇంతకీ కూన ఎందుకు పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చిందన్న లోతుల్లోకి వెళితే.. ఈ నెల 8 వ తేదీన పెనుబర్తిలో మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం అలమాజీపేటకు చెందిన టీడీపీ ఏజెంట్లు ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో పెనుబర్తిలో దారి కాచిన వైసీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి అనుచరులు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఆ గ్రామానికి రాత్రి తొమ్మిది గంటల సమయంలో చేరుకున్నారు. అప్పటికే గ్రామానికి చేరుకున్న పోలీసులు దాడులకు పాల్పడిన వైసీపీ వర్గీయులను విడిచి పెట్టి టీడీపీ కి చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారంటూ కూన ఆసమయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర తో వాగ్వివాదానికి దిగి అతని పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన పై పొందూరు పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మహేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కూన రవికుమార్ తో పాటు మరో 28 మందిపై కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న కున రవికుమార్ తో పాటు మరో ఎనిమిది మంది పరారు కాగా, మిగిలిన 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన కూన రవికుమార్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగారు. ఆయనను పట్టు కోవడంలో వైఫల్యం చెందడంతో పాటు, విధి నిర్వహణలో అలసత్వం వహించారంటూ ఆ సమయంలో ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించిన ఇన్ ఛార్జి టు టౌన్ సీఐ రమణ ఇప్పటికే సస్పెన్షన్ కు గురయ్యారు.
ఇక, ఏడు రోజుల అజ్ఞాతంలో వున్న రవి కుమార్ ఈ రోజు పొందూరు పోలీస్ స్టేషన్ లో లొంగి పోయారు. అతడిని అదుపులోకి తీసుకున్న పొందూరు పోలీసులు రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించి రవి కుమార్ ను రాజాం కోర్టుకు తరలించారు. న్యాయస్థానంలో రవికుమార్ బెయిల్ పై వాదనలు కొనసాగుతున్నాయి. కూన రవికుమార్ తో పాటు మిగిలిన 28 పై పోలీసులు 147,148, 353, 188, ఆర్ డబ్లూ 149 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read also : YS Sharmila: దీక్షలో ఆహార్యం మార్చిన వైఎస్ షర్మిల.. పోచంపల్లి చీరలో..