రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషికి 30 రోజుల సెలవు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె, స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం , కృతజ్ఞతలు తెలిపిన తల్లి
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి ఎ.జి.పెరారివలన్ కు తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ 30 రోజుల లీవు మంజూరు చేశారు.
మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి ఎ.జి.పెరారివలన్ కు తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ 30 రోజుల లీవు మంజూరు చేశారు. పెరారివలన్ తల్లి అర్పుతమ్మాల్ చేసిన అభ్యర్థనపై ఆయన ఈ సెలవుకు అంగీకారం తెలిపారు. ఈ సెకండ్ కోవిద్ వేవ్ తరుణంలో తన కొడుకు ఆరోగ్యం సరిగా ఉండడంలేదని ఆమె తన వినతిపత్రంలో పేర్కొన్నారు. తన కుమారుని ఆరోగ్యం హైరిస్క్ లో ఉందని జైల్లోని డాక్టర్ ఒకరు చెప్పారని, అతనికి ఈ సమయంలో చికిత్స ఎంతయినా అవసరమని ఆమె అన్నారు. లోగడ పెరారివలన్ కి కొద్ది రోజులు లీవు ఇచ్చినప్పటికీ అన్ని ఆసుపత్రులోని వార్డులను కోవిడ్ వార్డులుగా మార్చినందున అతనికి చికిత్స అందలేదన్నారు. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ నెల 7 న ఇచ్సిన ఉత్తర్వులను కూడా ఆమె ప్రస్తావించారు. అస్వస్థులై చికిత్స అవసరమైన ఖైదీలకు సెలవు ఇవ్వాలని కోర్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొందని ఆమె గుర్తు చేశారు. తన కుమారుడికి 30 రోజుల సెలవు ఇచ్చినందుకు ఆమె ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి అయిన ఈ ఖైదీని రాజ్యాంగంలోని 161 అధికరణం కింద విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం చేసిన సిఫారసు ఇంకా పెండింగులో ఉంది. పెరారివలన్ 30 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.కొంతకాలంగా అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేని విషయం తెలుసుకున్న అతని తల్లి.. తన కుమారుడిని తాత్కాలికంగానైనా విడుదల చేయాలనీ కోరింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ రైల్వే స్టేషన్ కు అసలు పేరే లేదు.. ఎందుకో, ఎక్కడో తెలుసా..?? ( వీడియో )