తమిళనాట సరికొత్త రాజకీయాలు, అందరి మన్ననలు అందుకుంటున్న సీఎం స్టాలిన్
అందరూ ఏదేదో ఊహించుకున్నారు. తమిళనాడులో ప్రతీకార రాజకీయాలకు మళ్లీ తెరలేస్తుందని కథనాలు అల్లేసుకున్నారు. తమిళనాడు నూతన సారథి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ఊరుకునేవారు కాదని భావించారు.
అందరూ ఏదేదో ఊహించుకున్నారు. తమిళనాడులో ప్రతీకార రాజకీయాలకు మళ్లీ తెరలేస్తుందని కథనాలు అల్లేసుకున్నారు. తమిళనాడు నూతన సారథి ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ఊరుకునేవారు కాదని భావించారు. కానీ స్టాలిన్ మాత్రం సరికొత్త రాజకీయాలకు తెరతీశారు. విద్వేష, ప్రతీకార రాజకీయాలకు తాను దూరమన్న సంకేతాలు ఇచ్చారు. మిగిలిన ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజునుంచే తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రతిపక్షాలు కూడా నిర్మోహమాటంగా స్టాలిన్‌ను శభాష్ అంటున్నాయి. అసలు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలబ్బా అని అనుకునేలా చేస్తున్నారు స్టాలిన్.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘనవిజయం సాధించింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే స్టాలిన్ సుదీర్ఘ స్వప్నం నెరవేరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మరు నిమిషం నుంచే పరిపాలన విషయంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు స్టాలిన్. అందరినీ కలుపుకుంటూ వెళుతున్నారు. విపక్షాల సలహాలు స్వీకరిస్తున్నారు. వారిని కలుపుకుంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన కొన్ని మంచి పనులను రద్దు చేయలేదు. ప్రజలకు ఏది అవసరం అనుకుంటే దాన్ని కొనసాగిస్తున్నారు. జయలలితన పేరట వెలిసిన అమ్మ క్యాంటిన్లను తీసేయకుండా కొనసాగిస్తున్నారు. అమ్మ క్యాంటిన్ల వల్ల అన్నా డీఎంకేకు మంచి పేరు వస్తుందని భావించలేదు. అతి తక్కువ ధరకు పది మందికి కడుపు నిండా అన్నం పెట్టే అమ్మ క్యాంటిన్ల పట్ల ఉదారంగా వ్యవహరించారు స్టాలిన్. ప్రత్యేకించి లాక్‌డౌన్ సమయంలో అలాంటివే కడుపు నింపుతాయన్న స్పృహ స్టాలిన్‌కు ఉంది కాబట్టే ఆ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు కూడా కాలేదు కానీ తన మార్క్ పాలనతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. విరుచుకుపడుతున్న కరోనాను కట్టడి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారాయన! అధికారులతో ఇప్పటికే పలు మార్లు సమీక్ష జరిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. డాక్టర్లతో మాట్లాడారు. వారిలో ధైర్యం నింపారు. కరోనా పేషంట్లతో ముచ్చటించారు. వారికి తానున్నాంటూ భరోసా ఇచ్చారు. ఆసుపత్రుల్లో తక్షణం నిధులు కేటాయించారు. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆక్సిజన్ నిల్వలు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. చెంగల్‌పట్టలో ఆక్సిజన్ అందక 13 మంది మరణించిన సంఘటన స్టాలిన్‌ను బాగా కదిలించింది. అందుకే ఆక్సిజన్‌పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ విషయంపై మోదీకి లేఖ కూడా రాశారు.
ప్రతీకార రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న తమిళనాడులో ఓ సరికొత్త మార్పు కనిపిస్తోంది. కరోనాపై పోరులో భాగంగా స్టాలిన్ ఓ సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఇందులో 13 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు. విశేషమేమిటంటే ఇందులో 12 మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే కావడం. అన్నాడీఎంకే వారున్నారు. బీజేపీ వారున్నారు. కాంగ్రెస్ వారున్నారు. ఇతర పార్టీల వారు కూడా ఉన్నారు. అన్నా డీఎంకే నేత, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి విజయ్ భాస్కర్ కూడా ఉన్నారు. ఈ సలహామండలికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. కరోనాను ఎదుర్కునేందుకు రాజకీయాలను పక్కనపెట్టి అందరం కలిసి పనిచేద్దామన్నారు స్టాలిన్ . ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల అవసరం ఎలాంటిదో స్టాలిన్‌కు తెలుసు కాబట్టే అంత గొప్ప నిర్ణయం తీసుకోగలిగారు. అన్నట్టు డీఎంకే అధికారంలోకి రాగానే కొందరు కార్యకర్తలు అత్యుత్సాహం కొద్దీ అమ్మ క్యాంటిన్‌లపై దాడులు చేశారు. జయలలిత పోస్టర్లను చించేశారు. ఇది తెలుసుకున్న స్టాలిన్ వారిపై కేసులు పెట్టారు. తమ పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టగలిగిన ధైర్యశాలి స్టాలిన్. ఆ తర్వాత నుంచి డీఎంకే కార్యకర్తలు క్రమశిక్షణతో మెలగడం మొదలు పెట్టారు.మధురైకి చెందిన ఓ బాలుడు తాను సైకిల్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులను… కరోనా కోసం ప్రభుత్వానికి ఇస్తే… వెంటనే స్పందించిన సీఎం స్టాలిన్…. ఆబాలుడిని మెచ్చుకుంటూ అతని ఇంటికే సైకిల్ ను పంపిన విషయం తెలిసిందే కదా! అంతేనా ఆ బాలుడితో తానే ఫోన్లో మాట్లాడి మంచి చెడ్డలు చెప్పడం చాలా మందిని ఆకట్టుకుంది. రోజూ కరోనా జాగ్రత్తలు చెబుతున్నారు. మాస్క్ ఎలా ధరించాలో.. చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో వివరిస్తున్నారు. రోజూ తాను ఏం చేస్తున్నారో తానే ఓ వీడియో రికార్డు చేసి ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. ఇదంతా ఎందుకంటే పారదర్శకత కోసమని చెబుతున్నారాయన. ట్విట్టర్‌లో ఎవరు ఎలాంటి సాయం కోరినా తక్షణమే స్పందిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలను నుంచి కంప్లయింట్లు తీసుకునేందుకు ప్రత్యేకంగా కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఫిర్యాదులన్నింటినీ వందరోజుల్లోగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇవ్వడమే కాదు సమస్యల పరిష్కారం కోసం అధికారులను నియమించారు.
ఇంతకు ముందు తాను చదివిన పాఠశాల ఆవరణ ఆక్రమణలకు గురవుతుందని, తరగతి గదులు మరమ్మతులకు నోచుకోవడం లేదని ఓ బాలిక రాసిన లేఖకు వెంటనే స్పందించారు సీఎం. విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామెళిని వెంటనే అక్కడికి పంపించారు. సమస్య పరిష్కారం అయ్యేలా చూశారు. అలాగే ట్విట్టర్‌లో బాధలు చెప్పుకునేవారిని ఆదుకుంటున్నారు. పాలకులు మారినా పోలీసులు తీరు మారలేదు. నా కుమారుడి మందుల కోసం తీసుకెళ్లిన డబ్బును జరిమానా పేరిట లాక్కున్నారు అంటూ బాలకృష్ణన్ అనే వ్యక్తి సీఎంకు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను చూసిన సీఎం వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, డీజీపీ తదితరులు బాలకృష్ణన్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. జరిమానా పేరిట వసూలు చేసిన వ్యక్తులే మీ వద్దకు వచ్చిన సంబంధిత నగదు, మందులు ఇస్తారని తెలిపారు. వారు చెప్పినట్టుగానే రాత్రి పది గంటలకు సెవ్వాపేటకు చేరుకున్న ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్ అయిదు వందల రూపాయల నగదు, బాలుడికి నెలకు సరిపడా మందులను ఇచ్చి క్షమాపణలు కోరారు. ఇలా ప్రజల మనసులను దోచుకుంటున్నారు ముఖ్యమంత్రి స్టాలిన్.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ రైల్వే స్టేషన్ కు అసలు పేరే లేదు.. ఎందుకో, ఎక్కడో తెలుసా..?? ( వీడియో )